ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు

ఏపీలో గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులకు అదానీతో ఎంవోయూ..  రెండో రోజు దావోస్‌లో కీలక ఒప్పందాలు

3,700 మెగావాట్లతో పంప్డ్‌ హైడ్రో స్టోరేజ్‌ ప్రాజెక్టు

10 వేల మెగావాట్లతో సోలార్‌ విద్యుదుత్పత్తి

ఏపీలో దాదాపు 10 వేల మందికి ఉద్యోగావకాశాలు

ముఖ్యమంత్రి  వైయ‌స్ జగన్, గౌతమ్‌ అదానీ సమక్షంలో ఎంవోయూ

దావోస్‌: సుస్థిర అభివృద్ధిలో భాగంగా కర్బన ఉద్గారాలు లేని ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. కాలుష్య రహిత ఇంధనం ఉత్పత్తే లక్ష్యంగా రాష్ట్రంలో రెండు మెగా గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఎంవోయూ కుదుర్చుకుంది. ఈ రెండు ప్రాజెక్టులను అదానీ గ్రీన్‌ ఎనర్జీ నెలకొల్పనుంది. ఇందులో 3,700 మెగావాట్లు పంప్డ్‌ హైడ్రో స్టోరేజ్‌ ప్రాజెక్టు కాగా 10 వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టు కూడా ఉంది.

రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో ఇవి అత్యంత కీలకం కానున్నాయి. రెండు ప్రాజెక్టుల కోసం దాదాపు రూ.60 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఎంవోయూలో పేర్కొన్నారు. తద్వారా 10 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. 

రెండో రోజు విస్తృతంగా చర్చ
దావోస్‌లో తొలిరోజు గౌతమ్‌ అదానీతో సమావేశమైన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండోరోజు సోమవారం మరోసారి భేటీ నిర్వహించి ఈ ప్రాజెక్టులపై విస్తృతంగా చర్చించారు. గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులకు సంబంధించి సీఎం జగన్, అదానీ గ్రూపు సంస్థల అధిపతి గౌతమ్‌ అదానీల సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కరికాల వలవన్, అదానీ గ్రీన్‌ ఎనర్జీ తరఫున ఆశిష్‌ రాజ్‌వంశీ ఎంవోయూపై సంతకాలు చేశారు.  

ప్రతి ఒక్కరికీ అందుబాటులో.. సమగ్ర ఆరోగ్యవ్యవస్థ : దావోస్‌ సదస్సులో సీఎం వైయ‌స్ జ‌గ‌న్  
 ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఒక్కరికీ సమగ్ర ఆరోగ్య వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు దావోస్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్‌)లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. కోవిడ్‌ లాంటి విపత్తులు మరోసారి వచ్చినా సమర్థంగా ఎదుర్కొనేలా బలమైన వ్యవస్థను రూపొందిస్తున్నట్లు చెప్పారు.

ఇందుకోసం రాష్ట్రంలో 2 వేల జనాభా దాటిన ప్రతి గ్రామంలో వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేయడంతో పాటు పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒక మెడికల్‌ కాలేజీ చొప్పున ఇప్పుడున్న 11 కాలేజీలకు అదనంగా మరో 16 వైద్య కళాశాలలను అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించారు. వచ్చే మూడేళ్లలో వైద్య ఆరోగ్య రంగంపై రూ.16,000 కోట్లు వ్యయం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం రెండో రోజు సమావేశాల సందర్భంగా సోమవారం ఫ్యూచర్‌ ఫ్రూఫింగ్‌ హెల్త్‌ సిస్టమ్స్‌పై సీఎం జగన్‌ మాట్లాడారు.  
 
ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్‌..
కోవిడ్‌ లాంటి విపత్తును ఎవరూ ఊహించలేదు. మన తరం మునుపెన్నడూ చూడని విపత్తు ఇది. వైద్య రంగంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. కోవిడ్‌ లాంటి విపత్తు మరోసారి తలెత్తితే సమర్థంగా నివారించేందుకు బలీయమైన వ్యవస్థ కావాలి. కోవిడ్‌ విపత్తు నుంచి చాలా పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది. నివారణ, నియంత్రణ చికిత్స విధానాల ప్రాముఖ్యత తెలుసుకోవాలి. సమగ్ర ఆరోగ్య వ్యవస్ధ ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలి. కోవిడ్, తదనంతర పరిణామాలన్నీ మనకు కనువిప్పు లాంటివి. ఒక దేశం, ఒక రాష్ట్రం పరిధిలో ఎంతవరకు చేయగలమో అంతా చేశాం. కోవిడ్‌ సమయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్‌పై దృష్టి పెట్టింది. 

 
అత్యాధునిక ఆస్పత్రులు లేకున్నా..
అత్యాధునిక మల్టీ స్పెషాలిటీ వైద్య సేవల విషయంలో రాష్ట్రం వెనుకబడి ఉంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కావడమే దీనికి ప్రధాన కారణం. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ లాంటి టైర్‌–1 నగరాలు ఏపీలో లేనందున ప్రైవేట్‌ రంగంలో అత్యాధునిక వైద్య సేవల లభ్యత తక్కువగా ఉంది. కోవిడ్‌ సమయంలో ప్రధానమైన ఈ లోపాన్ని ముందే గుర్తించి అప్రమత్తమయ్యాం.

కోవిడ్‌ నియంత్రణలో భాగంగా 44 దఫాలు ఇంటింటి సర్వే నిర్వహించాం. రాష్ట్రంలో ఇందుకోసం బలమైన వ్యవస్థ ఉంది. ప్రతి గ్రామంలోనూ  సచివాలయం, ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌తో పాటు 42 వేల మంది ఆశావర్కర్లు వైద్య, ఆరోగ్య రంగంలో చురుగ్గా పనిచేస్తున్నారు. వీరందరూ సమష్టిగా ఇంటింటి సర్వే చేపట్టడంతో తగిన చర్యలు తీసుకుంటూ కోవిడ్‌ను సమర్ధంగా ఎదుర్కోగలిగాం. ఫలితంగా మరణాల రేటును తగ్గించగలిగాం. భారత్‌లో నమోదైన సగటు మరణాల శాతం 1.21 కాగా ఏపీలో దేశంలోనే అత్యల్పంగా 0.63% నమోదైంది. 

 
కొత్తగా 16 మెడికల్‌ కాలేజీలు
ఇక నియంత్రణ చర్యల విషయానికొస్తే జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, బోధనాసుపత్రులు క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకుని మెడికల్‌ కాలేజీల నిర్మాణాన్ని చేపడుతున్నాం. అన్ని ప్రాంతాలకు బోధనాసుపత్రుల సేవలను సమానంగా అందించాలన్నదే లక్ష్యం. మెడికల్‌ కాలేజీలు ఏర్పాటైనప్పుడే పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ స్టూడెంట్స్‌ వస్తారు.

అప్పుడే ఆ మెడికల్‌ కాలేజీలను అనుసంధానం చేయడం సాధ్యమవుతుంది. అప్పుడే మేం ఎదురుచూస్తున్న అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వస్తుంది. దీనికి మూడేళ్ల కాలపరిమితి విధించుకున్నాం. మొత్తం మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు మూడేళ్లలో రూ.16 వేల కోట్లు సమీకరణ చేయాలని నిర్దేశించుకున్నాం. 

25 లక్షల మందికి ఉచిత వైద్యం 
హెల్త్‌ ఇన్సూరెన్స్‌ రంగానికి వస్తే ప్రధాని మోదీ ఆయుష్మాన్‌ భారత్‌ పథకం  ప్రవేశపెట్టారు. దాదాపు వెయ్యి చికిత్సా విధానాలు ఇందులో కవర్‌ అవుతున్నాయి. ఏపీలో ప్రత్యేకంగా వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి 2,446 చికిత్స విధానాలకు వర్తింప చేస్తున్నాం. 1.44 కోట్ల ఇళ్లకి ఆరోగ్యశ్రీ కార్డులు అందచేసి లబ్ధిదారుల ఆదాయ పరిమితిని రూ.5 లక్షలకు పెంచాం. రాష్ట్రంలో దాదాపు 1.53 కోట్ల కుటుంబాలు ఉండగా 1.44 కోట్ల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చాం. గత మూడేళ్లుగా 25 లక్షల మందికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చికిత్స అందచేశాం.  

 
వైయ‌స్సార్‌ విలేజ్‌ క్లినిక్స్‌
కోవిడ్‌ లాంటి మహమ్మారులు చెలరేగినప్పుడు ప్రధానంగా నివారణ, నియంత్రణ, చికిత్సపై దృష్టి పెట్టాలి. వైద్య, ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయాలంటే అవైలబులిటీ, యాక్సెస్‌బులిటీ, ఎఫర్ట్‌బులిటీ.. ఈ మూడూ సమాంతరంగా అందుబాటులోకి రావాలి.  ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌లో 2 వేల జనాభా ఉన్న ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేస్తున్నాం.

ప్రతి 30 వేల జనాభా ఉన్న మండలాన్ని యూనిట్‌గా తీసుకుని రెండు ప్రైమరీ హెల్త్‌ సెంటర్లు నెలకొల్పుతున్నాం. తద్వారా ఒక్కో పీహెచ్‌సీలో ఇద్దరు చొప్పున నలుగురు వైద్యులు ఉంటారు. ప్రతి వైద్యుడికి 104 వాహనాన్ని కేటాయిస్తారు. ఒక్కో వైద్యుడికి మండలంలో 4–5 గ్రామాలను కేటాయిస్తారు. వారు రోజు విడిచి రోజు గ్రామాలకు వెళ్లి వైద్య సేవలు అందిస్తారు. ఫ్యామిలీ డాక్టర్లుగా గ్రామాల్లో ప్రజలను పేరుపేరునా పలకరిస్తూ సేవలు అందించడంతో పాటు విలేజ్‌ క్లినిక్‌ను మెడికల్‌ హబ్‌గా వినియోగించుకుంటారు. ఇందులో ఏఎన్‌యమ్, నర్సింగ్‌ గ్రాడ్యుయేట్, మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రాక్టీస్‌నర్, ఆశా వర్కర్లు ఉంటారు.  

 
పలు ప్రముఖ కంపెనీలతో సీఎం వైయ‌స్ జగన్‌ చర్చలు 
  దావోస్‌లో వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సమావేశాల సందర్భంగా రెండో రోజైన సోమవారం పలు అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమై ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాల్లో భాగస్వాములు కావడానికి పలు కంపెనీలు ఆసక్తి వ్యక్తం చేశాయి.

విద్యారంగంలో ఏపీ ప్రభుత్వంతో కలసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఫ్రాన్స్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ సంస్థ దస్సాల్ట్‌ సిస్టమ్స్‌ ప్రకటించింది. విశాఖను హైఎండ్‌ టెక్నాలజీ హబ్‌గా మార్చేలా సహకారం అందించేందుకు టెక్‌ మహీంద్రా ముందుకొచ్చింది. జపాన్‌కు చెందిన ప్రముఖ లాజిస్టిక్‌ కంపెనీ మిట్సుయి కాకినాడలో కార్యకలాపాలను ప్రారంభించేందుకు సంసిద్ధత తెలిపింది. 

 
హై ఎండ్‌ టెక్నాలజీ హబ్‌గా విశాఖ
విశాఖను హైఎండ్‌ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలో భాగస్వామి కానున్నట్లు టెక్‌ మహీంద్రా ప్రకటించింది. దావోస్‌లోని ఏపీ పెవిలియన్‌లో టెక్‌ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ గుర్నానితో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమావేశమై నైపుణ్యాభివృద్ధి, పెట్టుబడులు లాంటి అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కోసం స్కిల్‌ యూనివర్సిటీతోపాటు 30 స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీలు, 175 స్కిల్‌ హబ్స్‌ ఏర్పాటు చేస్తున్నామని వివరిస్తూ వీటిని ఐటీ సంబంధిత సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానించాలని కోరారు.

విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించేలా ఇంటర్న్‌షిప్, అప్రెంటిషిప్‌ కార్యకలాపాల్లో పాలు పంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై గుర్నానీ స్పందిస్తూ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, రోబోటిక్‌ టెక్నాలజీ లాంటి అత్యాధునిక పరిజ్ఞానంలో ఆంధ్రప్రదేశ్‌తో కలసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. యువత నైపుణ్యాలకు పదును పెట్టేందుకు హైఎండ్‌ టెక్నాలజీపై వచ్చే మూడు నెలల్లో యూనివర్సిటీతో కలసి ప్రత్యేకంగా పాఠ్యప్రణాళిక రూపొందిస్తామని ప్రకటించారు. 

 
రూ.250 కోట్లతో అసాగో ఇథనాల్‌ ప్లాంట్‌
మహీంద్రా గ్రూపు అనుబంధ కంపెనీ అసాగో ఇండస్ట్రీస్‌ రాష్ట్రంలో రూ.250 కోట్లతో ఇథనాల్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటు ప్రతిపాదనను సీఎం దృష్టికి తెచ్చింది. ఇథనాల్‌ యూనిట్‌ ఏర్పాటుకు అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా సీఎం హామీ ఇచ్చారు.

విద్యారంగంలో ‘దస్సాల్‌’ పెట్టుబడులు
విద్య, నైపుణ్యాభివృద్ధి లాంటి అంశాల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో కలసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఫ్రాన్స్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ సంస్థ దస్సాల్ట్‌ సిస్టమ్స్‌ ప్రకటించింది. దావోస్‌లో దస్సాల్ట్‌ సిస్టమ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఫ్లోరెన్స్‌ వెర్జలెన్‌తో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో సరికొత్త ఆవిష్కరణలకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందించడంతో పాటు పోర్టులను పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా సహకారం అందించాలని సీఎం కోరారు.

 
ఏపీలో నైపుణ్యాభివృద్ధి అవకాశాలను మెరుగుపరచడంపై ప్రధానంగా చర్చించినట్లు అనంతరం ఫ్లోరెన్స్‌ వెర్జలెన్‌ తెలిపారు. ఏపీతో భాగస్వామ్యానికి సిద్ధంగా ఉన్నామని, విద్యారంగంలో పెట్టుబడులు పెట్టడానికి దస్సాల్‌ సిస్టమ్స్‌ ఆసక్తిగా ఉన్నట్లు ఆమె ప్రకటించారు. కొత్త తరహా ఇంధనాలపై కూడా చర్చించామని, త్వరలోనే రాష్ట్రంలో పర్యటించనున్నట్లు ఫ్లోరెన్స్‌ తెలిపారు.

కాకినాడకు జపాన్‌ లాజిస్టిక్‌ దిగ్గజం
సుదీర్ఘ తీర ప్రాంతం కలిగి ఉండటంతో పాటు ఏపీలో కొత్తగా నిర్మించే నాలుగు పోర్టుల ద్వారా లభించే లాజిస్టిక్‌ అవకాశాలను అందిపుచ్చుకోవడంపై జపాన్‌కు చెందిన లాజిస్టిక్‌ కంపెనీ మిట్సుయి ఓ ఎస్‌కే లైన్స్‌ ఆసక్తి వ్యక్తం చేసింది. మిట్సుయి ఒ.ఎస్‌.కె.లైన్స్‌ లిమిటెడ్‌ ప్రెసిడెంట్, సీఈవో తకీషి హషిమొటోతో సీఎం జగన్‌ సమావేశమయ్యారు.

రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న 4 గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టులతో సరుకు రవాణాను ఏటా 507 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులకు చేర్చాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని, దీనికి సంబంధించి కంటైనర్‌ హబ్, లాజిస్టిక్‌ రంగాలపై దృష్టి సారించాలని సీఎం కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన హషిమొటో కాకినాడలో వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు.

 
ఈవీ వాహనాలపై ‘హీరో’తో చర్చలు
రాష్ట్రంలో వ్యాపార విస్తరణ, ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ అంశాలపై హీరో గ్రూపు చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ పవన్‌ ముంజల్‌తో సీఎం జగన్‌ చర్చించారు. ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన హీరో గ్రూపు అథెర్‌ ఎనర్జీలో ఇప్పటికే 36 శాతం వాటాను కొనుగోలు చేయడమే కాకుండా తైవాన్‌కు చెందిన బ్యాటరీ టెక్నాలజీ గగొరోలో భాగస్వామిగా చేరింది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ, హీరో గ్రూప్‌ విస్తరణ అవకాశాలపై చర్చలు జరిగాయి.

 విశాఖ– చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడర్‌లో భాగంగా పరిశ్రమలకు నీటి వనరులను సమకూర్చడంలో భాగంగా తిరుపతి సమీపంలో ఉన్న హీరో కంపెనీకి కండలేరు నుంచి నీటిని ఇవ్వాలని ఈ సందర్భంగా సీఎం అధికారులను ఆదేశించారు. అంతకుముందు భారత సంతతికి చెందిన స్విస్‌ ఎంపీ నిక్లాజ్‌ శామ్యూల్‌ గుగెర్‌తో కూడిన స్విస్‌ పార్లమెంటరీ ప్రతినిధి బృందంతో సీఎం జగన్‌ సమావేశమై ఏపీలో వ్యాపార అవకాశాలపై చర్చించారు. భారత రాయబారి సంజయ్‌ భట్టాచార్య కూడా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశమయ్యారు.   
 
 

Back to Top