సీఎంగా చంద్ర‌బాబు దుబారా

ప్ర‌జాధ‌నాన్ని నీళ్ల‌లా ఖ‌ర్చు చేసిన సీఎం

ఆఫీసులు, ఇళ్ల నిర్మాణాలు, మ‌ర‌మ్మ‌తుల‌కు ప్ర‌జ‌ల డ‌బ్బు

ప్ర‌త్యేక విమానాల పేరుతో విలాసాలు

పునాది రాళ్లు, శంకుస్థాప‌న‌ల‌కు కోట్లు ఖ‌ర్చు

అమ‌రావ‌తి:  మ‌నది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్యంలో మనం ఏర్పరచుకొన్నటువంటి రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాలు పనిచేయాలి. మన రాజ్యాంగాన్ని అనుసరించి ప్రజల నుంచి పన్నుల ద్వారా వసూలు చేసినటువంటి ఆదాయాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలి అనే దానికి కొన్ని విధివిధానాలు ఏర్పరచుకోవడం జరిగినది. కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక విధానాలు, విత్తన కోడ్ , ఎఫ్.ఆర్.బి.ఎమ్. చట్టాలు మొదలైనవన్నీ
                ఇందుకోసం నిర్దేశించబడిన ప్రాథక సూత్రం ప్రకారం ఆదాయాన్ని జాగ్రత్తగా వినియోగించేటప్పుడు పాలకులు తమ సొంత డబ్బు వినియోగించటానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో ప్రజాధనం వినియోగించేటపుడు అంతకంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి.  దురదృష్టం ఏంటంటే ఈ మద్యకాలంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాథమిక సూత్రానికి తిలోదకాలు ఇచ్చినట్లు కనిపిస్తుంది. మనం వినియోగించే ప్రభుత్వ సొమ్ము ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఆలోచించడం మానేసింది. జాతిపిత గాంధి గారు కోరుకున్నట్లుగా మన ప్రభుత్వ పెద్దలు ప్రజా సేవకులం అనే విషయం మర్చిపోయి ప్రజల సొమ్ము ఆడంబరాలకు, ఆర్భాటాలకు, విలాసవంతమైన జీవితం గడపటానికి ఖర్చు చేస్తున్నారు. వ్యవస్థలు బలహీనమవటం వీరికి మరికొంత దోహదం చేస్తుంది. ఉదా: ఒక ముఖ్యమంత్రికి గాని, ఒక మంత్రికి గాని ఒక కలెక్టరుకు కాని కేవలం ఒక క్యాంప్ ఆఫీస్  మాత్రమే ఉండాలి. అది కూడా కనీస వసతులతో ప్రజా కార్యక్రమాలు నిర్వహించడానికి సరిపోయేదిగా మాత్రమే ఉండాలి. కాని ఆచరణలో ఏ నియమ నిబంధనలు పాటించకుండా ప్రస్తుత ముఖ్యమంత్రి హైదరాబాదులో సొంత ఇంటి మీద క్యాంప్ ఆఫీస్ పేరుతో ఖర్చు పెట్టడం జరిగింది.  అదనంగా ఫాంహౌస్ మీద మరొక 4 కోట్లు ఖర్చు పెట్టడం జరిగినది. ఇది చాలనట్లు లేకవ్యూ అతిథి గృహాన్ని క్యాంప్ ఆఫీస్ గా మార్చటానికి (మరమ్మత్తుల కోసం) 9.5 కోట్లు ఖర్చు చేయడం జరిగినది. అదనంగా ఫర్నిచర్ కోసం 10 కోట్లు ఖర్చు చేయడం జరిగినది.

                ఇంత ఖర్చు పెట్టిన తరువాత ఒక సంవత్సరం కూడా కాకముందే విజయవాడ వద్ద నీటిపారుదల  అతిథి గృహాన్ని ఇంకొక క్యాంప్ ఆఫీస్ గా మార్చడానికి రూ.42 కోట్లు ఖర్చు చేశారు. ఇవన్నీ వదిలేసి చివరకు కృష్ణాకర కట్ట మీద ఒక ప్రైవేటు వ్యక్తికి సంబంధించినటువంటి అతిథి గృహంలో తిష్టవేయడం జరిగినది. ఈ నిర్ణయాలను తీసుకొనేటప్పుడు ప్రజాధనాన్ని ఈ విధంగా వృధా చేయడం నైతికమా లేదా అనే ఆలోచన చేసినట్లుగా కూడా కనిపించదు. మరి వీరి సుదీర్ఘ పరిపాలనా అనుభవం ఎక్కడికి పోయిందో భగవంతుడికి ఎరుక.

            ఇక ఎక్కడికి తిరిగినా ప్రత్యేక విమానాలు, ప్రైవేటు హెలికాప్టర్లు. మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ సాధారణ విమానాల్లో వేల ఖర్చుతోటి వెళ్తుంటే, ఆదాయం తక్కువగా ఉన్న రెవెన్యూ లోటుతో సతమతమవుతున్న, ఒక చిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విధంగా ప్రజాధనాన్ని నియోగించడం నైతికమా?.

             దీనికి తోడు రూ. 5.5 కోట్లు పెట్టి నెలకు ఒక్క రోజు కూడా ఉపయోగించని ప్రత్యేక బస్సు కొనుగోలు చేయడం ఎంతవరకు సమంజసం. మరొక చిత్రం ఏంటంటే, ఈ దేశంలోనే అతి పెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, మహారాష్ట్ర, తమిళనాడు ముఖ్యమంత్రులకు కేవలం ఒక కాన్వాయ్ (కార్లు) మాత్రమే. ఆర్ధికంగా చితికిన మన చిన్న రాష్ట్ర ముఖ్యమంత్రికి మాత్రం అమరావతి, హైదరాబాద్, ఢిల్లీ, విశాఖపట్నంలలో ప్రత్యేక కాన్వాయ్‌లు ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయమేటటంటే ఢిల్లీలో మనకు తప్పితే మిగతా పెద్ద రాష్ట్రాలకు ఇటువంటి కాన్వాయ్‌లు లేకపోవడం. దీనిని ఏమంటారు?  

            ఒక పక్క ఆదాయం లేదంటూనే ఆర్భాటాలతో బ‌తుకుతూ కేంద్ర ప్రభుత్వం ముందు యాచన చేస్తున్నట్లు నటిస్తూ, శంఖుస్థాపన శిలాఫలకాల మీద మాత్రం అవసరం లేకపోయినా, ప్రజలకు ఏ విధమైన మేలు జరగకపోయినా, వందలాది కోట్లు ఖర్చుబెట్టడం ఎంత ఆర్థిక దుర్మార్గం. రాజధాని శిలాఫలకాల పేరుతో వేసినది వేయకుండా నాలుగుసార్లు రాళ్ళు వేసి రూ.350 కోట్లు ఖర్చు చేయడం పరిపాలనా అనుభవం కిందకు వస్తుంది. దీనికి తోడు పోలవరం పేరుతో ఎన్నోసార్లు శిలాఫలకాలు వేస్తూ ఆ ప్రాజెక్టు తను నిర్మిస్తున్నట్లు ప్రచారం చేసుకోవడానికి, రైతులను తరలించడానికి బస్సుల కోసం రూ.84.5 కోట్లు ఖర్చు చేశారు. ఇక ధర్మపోరాటాల దీక్షలతో ఇప్పటివరకు రూ.63 కోట్లు, నవ నిర్మాణ దీక్షల పేరుతో 80 కోట్లు. నిబద్దత, బాధ్యతవున్న ప్రభుత్వం ఈ విధంగా చేయవచ్చునా?
             ఒక్క సంవత్సరం కూడా ఉండనటువంటి హైదరాబాదు సచివాలయంలో రిపేర్లు పేరుతో ఎల్‌ బ్లాకు మీద రూ.14.63 కోట్లు ఖర్చు చేయడం ఎలా సమర్ధించుకుంటారు? అదే విధంగా ముఖ్యమంత్రి ఆఫీసు మరమ్మత్తుల మీద కూడా మరొక 6.90 కోట్లు ఖర్చు పెట్టడం నిజం కాదా?.  ఇంత ఖర్చు పెట్టిన తరువాత మరలా తన కుటుంబాన్ని హైద‌రాబాద్ పెట్టి కోట్ల రూపాయలు ఖర్చుచేయడం నిజం కాదా!    ఇక మన పాలకుల విదేశీయానం గురించి చెప్పేదేముంది.  రూ.120 కోట్లు విదేశాలు సందర్శించడానికి ఖర్చు పెట్టారు. దీనివలన ప్రజలకు ఒనకూరేదేంటో మరి.
                పుష్కరాల పేరుతో రూ.3200 కోట్లు ఖర్చు పెట్టి 30 మందిని బలిచేశారు. ఇంకెంతో మందిని గాయపర్చారు. ఇపుడు అక్కడ పరిస్థితి చూస్తే రూ.300 కోట్ల విలువైన పనులు కూడా క‌నబ‌డ‌వు. మరి మిగతా డబ్బు అంతా ఎటు పోయిందో దేవుడికి ఎరుక. హ్యాపీ సండేస్   పేరుతో 10 కోట్లు, హ్యాపీ సిటీస్ పేరుతో రూ.61 కోట్లు ఖర్చు చేయడం ప్రజా ప్రభుత్వాలు చేయవలసిన పనేనా? పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సుల పేరుతో 150 కోట్లు కన్సల్టెంట్స్ పేరుతో రూ.300 కోట్లు ఖర్చు పెట్టడం ఏ విధంగా సమర్ధించుకుంటారు? 

బహుశా మనకు ముఖ్యమంత్రులు, మంత్రులు అవసరం లేదేమో ఆ బాధ్యత కూడా కన్సల్టెంట్స్  కి అప్పజెప్పితే ఇంత కంటే మంచిపరిపాలన ఇస్తారేమో కదా?. పక్క రాష్ట్ర రాజధానిలో (రాయపూర్) పూర్తి స్థాయిలో సచివాలయం నిర్మించడానికి రూ.1000 కోట్లు కూడా ఖర్చు చేయనప్పుడు తాత్కాలిక సచివాలయం పేరుతో రూ.1100 కోట్లు ఖర్చు పెట్టడం ఎంతవరకు సమంజసం. పైన ఉదహరించిన ఖర్చులన్నీ చూసినప్పుడు రాజ్యాంగబద్ధంగా ఆర్ధిక విధివిధానాలకు లోబడి, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పరిపాలన జరుగుతుందంటే మనం నమ్మగలమా? న‌ల‌భై ఏళ్ల సీనియారిటీ అంటే ప్ర‌జ‌ల‌కు జ‌వాబుదారిలేని త‌న‌మా?

తాజా వీడియోలు

Back to Top