చంద్రబాబుకు అన్ని దారులూ మూసుకుపోయాయా??

తోచీ తోచనమ్మ తోడికోడలి పుట్టింటికెళ్లిందని సామెత. కానీ ఏమీ తోచక  చంద్రబాబు నాయుడు కనీసం అలాంటి పనైనా చేయడం లేదు. తన ఓటమిని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయాన్నీ జీర్ణించుకోలేక దారుణమైన ఆలోచనలకు తెరతీస్తున్నారు. వైయస్ జగన్ ను, ప్రభుత్వాన్నీ విమర్శించే దారులన్నీ మూసుకుపోవడంతో ఎవ్వరూ ఊహించని తీరులో నాటకాలు, డ్రామాలతో కొత్త స్కెచ్చులు వేస్తున్నారు. కాకపోతే ఆ నాటకాలన్నీ బట్టబయలు అవుతూ తరచూ పరువు పోగొట్టుకుంటున్నారు. 
అతి స్వల్ప మెజారిటీతో, చావు తప్పి కన్నులొట్టపోయి ప్రతిపక్ష స్థానం దక్కించుకుంది తెలుగుదేశం పార్టీ.  ఆ అవమానాన్ని తట్టుకోలేక, అధికారం దూరమయ్యిందనే విషయాన్ని ఒప్పుకోలేక నేనెందుకు ఓడిపోయా అంటూ వందలసార్లు అడుగుతున్నారు చంద్రబాబు. ప్రజలు దానికి సమాధానం ఇవ్వడం లేదు. దీంతో ప్రభుత్వంపై తన చూపు సారించారు. ముఖ్యమంత్రిని ఎలాగైనా విమర్శించాలని, వైయస్ జగన్ చేసే ప్రతి పనిలోనూ తప్పులు వెతకాలని తీవ్రమైన ప్రయత్నాలు చేసారు. అందులో భాగంగానే తెలంగాణా ముఖ్యమంత్రితో స్నేహంగా ఉండటాన్ని బానిసత్వం అంటూ ప్రచారం చేయబోయారు. ఏపీ ఆస్తులను తెలంగాణాకి రాసేస్తున్నారని భయపెడుతూ దొంగ ఏడుపులు ఏడ్చారు. ఏపీకి కే.సీ.ఆరే సీఎమ్ అంటూ బరి తెగించి విమర్శలు చేసారు. నీటి పంపకాల గురించి సామరస్యంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ భేటీ అయితే రాష్ట్రానికి అన్యాయం చేసేస్తున్నారంటూ గగ్గోలు పెట్టారు. అయితే వీటన్నిటిపై ప్రభుత్వం పూర్తి వివరాలను ప్రజలకు అందజేసింది. చంద్రబాబు కల్లబొల్లి ఏడుపులు కేవలం ప్రభుత్వం పై కక్షతో చేసినవే అని రుజువైపోవడంతో చంద్రబాబు రూటు మార్చారు.
ఈసారి ముఖ్యమంత్రి వైయస్ జగన్ తానిచ్చిన హామీలు నెరవేర్చడం లేదంటూ కొత్త విమర్శలు మొదలు పెట్టారు. అధికారం చేపట్టి ఆరునెలలు కూడా కాకుండానే హామీలన్నిటినీ గాలికొదిలేసారంటూ గాలి కబుర్లు ప్రచారం చేయడం మొదలు పెట్టారు. నిజానికి 5ఏళ్ల చంద్రబాబు పాలనా కాలంలో రాష్ట్రం అప్పుల్లో పీకల్లోతు కూరుకుపోతోందన్న విషయాన్ని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారం చేపట్టినప్పుడు కూడా వైయస్ జగన్ ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు. దాంతోపాటే నవరత్నాలే కాదు తానిచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ 100 రోజుల్లోనే మేనిఫెస్టోలో చాలా హామీలకు నిధులు కేటాయించుకుంటూ వచ్చారు. ఏ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించేదీ తేదీలతో సహా అధికారులు, మీడియా, ప్రజల సమక్షంలో ప్రకటించారు. గ్రామ సచివాలయం, వాలంటీర్ల వ్యవస్థ, నాణ్యమైన బియ్యం పంపిణీ, లక్షల ఉద్యోగాల కల్పన, పింఛన్ల పెంపు మొదలైన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు శరవేగంగా అమలు అవుతున్నాయి. దాంతో చంద్రబాబు పాచిక ఈ విషయంలోనూ పారలేదు. 
పాలన విషయంలో వంకపెట్టడానికి కుదరక, ఏడుపులతో చేసిన నాటకాలు రక్తికట్టకపోవడంతో చంద్రబాబు మరిన్ని కొత్త పద్ధతుల్లో ప్రభుత్వాన్నీ, వైయస్ జగన్ ను టార్గెట్ చేసేందుకు స్కెచ్ లు వేస్తున్నారు.
పెయిడ్ ఆర్టిస్టులతో ముఖ్యమంత్రిని తిట్టించడం, ప్రభుత్వంపై అబద్ధాలను ప్రచారం చేయడం, అబద్ధపు వార్తలను సోషల్ మీడియాలో వైరల్ చేయించడం, కుల, ప్రాంత, మత ఘర్షణలు చెలరేగేలా వాఖ్యలు చేయడం, చేయించడం, టీడీపీ నేతలతో వివక్షాపూరితంగా దాడులు చేయించడం, గ్రామాల్లో జరిగే సాధారణ గొడవలకు రాజకీయ రంగు పులిమి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం, కుల పత్రికలతో కుట్రపూరితంగా ప్రభుత్వంపై ఆరోపణలు చేయించడం ఇవీ నేడు 40ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ నాయకుడు చంద్రబాబు చేస్తున్న రాజకీయాలు. ఇలాంటి ఊహకు కూడా అందని నీతిమాలిన, జుగుప్సాకరమైన పనులను చేసేందుకు టీడీపీ అధ్యక్షుడు, ఆయన కుమారుడు ఏమాత్రం వెనుకాడటం లేదు. తిరుపతి కొండను, శ్రీవారిని కూడా తన నీచ రాజకీయాలకు పావుగా వాడుకుంటున్నాడు ప్రతిపక్షనేత చంద్రబాబు. అయితే అటు ప్రభుత్వం, ఇటు సోషల్ మీడియా చంద్రబాబు అబద్ధాలను ఎప్పటికప్పుడు బట్టబయలు చేస్తూనే ఉంది. అయినా కూడా వైయస్ జగన్ ప్రభుత్వంపై దుష్ర్పచారం చేయడం, ముఖ్యమంత్రిని కించపరచడం విషయంలో రోజుకో కొత్త పంథా అనుసరిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. ఈ విష ప్రచారం ద్వారా ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై ప్రజల్లో వ్యతిరేకత పుట్టించాలన్న పచ్చనేతల ప్లాన్లు ఎప్పటికప్పుడు పటాపంచలు అవుతున్నాయి. కొత్తగా బాధితుల సిబిరం అంటూ మరో డ్రామా మొదలు పెట్టారు. ట్విట్టర్లో చంద్రబాబు, లోకేష్, ఇంకా లక్షల జీతాలిస్తూ నియమించుకున్న టీడీపీ సోషల్ మీడియా ఉద్యోగులు కలిసి ప్రస్తుతం చేస్తున్న ఒకే ఒక్కపని వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పైనా, ముఖ్యమంత్రి పైనా తప్పుడు ప్రచారం చేయడం. ఇందుకోసం వారి సొంత కుల మీడియాను కూడా విశేషంగా ఉపయోగిస్తున్నారు. 
చంద్రబాబు ఈ తరహా వ్యవహార శైలిని చూస్తే వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పాలనపై ప్రజల్లో వస్తున్న విపరీతమైన ఆదరణకు భయపడే ఇలాంటి కుతంత్రాలకు తెరతీసాడని అర్థం అవుతోంది. మరో రెండేళ్లలో ప్రజలు తెలుగుదేశం పార్టీనే మర్చిపోతారని అర్థమయ్యే, తన ఉనికిని  కాపాడుకోవడం కోసం బాబు ఇలా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నిజంగా ప్రజలపై ప్రేమ ఉన్న నాయకుడే అయితే తాను ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో అగ్రిగోల్డు బాధితులను, ఫాతిమా బాధితులను, తనవల్లే ప్రాణాలు పోగొట్టుకున్న పుష్కారాల బాధితులను, రాజధాని బాధితులను పట్టించుకుని ఉండేవాడు. కానీ అవినీతి, అక్రమాలతో రాష్ట్రాన్ని కొల్లగొట్టి, అప్పుల పాలు చేసి నేడు ప్రతిపక్షంలో కూర్చోగానే ప్రజలు కష్టాలు పడుతున్నారని మొసలి కన్నీరు కార్చే చంద్రబాబును రాష్ట్రంలో ఎవ్వరూ నమ్మడం లేదు. ఇలాంటి శిబిరాల నాటకాలు ఎన్ని ఆడినా భవిష్యత్తులోనూ నమ్మే పరిస్థితి లేదు అన్నది కనిపించే వాస్తవం.  

Back to Top