బాబు నూతన సంవత్సర కానుక 'రూ.1.19 లక్షల కోట్ల అప్పు'

7 నెలల్లోనే జనంపై భారీ భారం

ఇంత అప్పు చేసినా సూపర్‌ సిక్స్‌లో ఒక్కటీ అమలు చేయలేదు

జగన్‌ ఇచ్చిన పథకాలను సైతం నిలిపివేసిన కూటమి ప్రభుత్వం 

విద్యార్థులకు అమ్మ ఒడి, ఫీజులు, వసతి దీవెన లేవు.. 

రైతన్నలకు ‘భరోసా’ కరువు.. ఆస్పత్రికి వెళ్తే ఆరోగ్యశ్రీ వర్తించదు 

బకాయిలు చెల్లించకుండా విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలతో ఆటలు.. బడ్జెట్, బడ్జెటేతర అప్పులతో కలిపి రాష్ట్రంపై పెనుభారం మోపిన చంద్రబాబు సర్కారు 

బడ్జెట్‌లో చెప్పిన దానికి మించి మార్కెట్‌ రుణాలు.. ఆర్ధిక ఏడాది ఇంకా మూడు నెలలు మిగిలి ఉండగానే గీత దాటి అప్పులు 

అమరావతి కోసం ఇప్పటికే రూ.31 వేల కోట్ల అప్పు 

మరో రూ.21 వేల కోట్లు సమీకరించాలంటూ సీఆర్‌డీఏకి ప్రభుత్వం ఆదేశం.. మూలధన వ్యయం రూ.8,329 కోట్లే 

ఏపీ మరో శ్రీలంకలా అయిపోతోందని.. సంక్షేమ పథకాల కోసం జగన్‌ బటన్‌ నొక్కుతున్నారంటూ నాడు చంద్రబాబు, ఎల్లో మీడియా గగ్గోలు  

వారం.. వారం అప్పులే! బడ్జెట్‌లోనూ.. బడ్జెట్‌ బయటా అప్పుల మోతలే! ఎటు చూసినా రుణ భారమే! ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిలో మంగళవారం అంటే అప్పుల బేరమే! రాష్ట్ర ప్రభుత్వ అప్పులు తాజాగా రూ.1.19 లక్షల కోట్లను దాటేశాయ్‌! 

చంద్రబాబు గొప్పగా చెప్పుకునే సంపద సృష్టి అంతా కరెంట్‌ చార్జీల బాదుడు.. ఉచిత ఇసుక ముసుగులో పచ్చ ముఠాల దందాలు.. మద్యం విక్రయాల పేరుతో జనం జేబులను గుల్ల చేయడంలోనే కనిపిస్తోంది. రాష్ట్రానికి పైసా ఆదాయం సృష్టించకపోయినా అప్పుల్లో మాత్రం రికార్డులు తిరగరాస్తున్నారు. కేవలం మార్కెట్‌ రుణాల ద్వారానే మంగళవారం చేసిన రూ.5,000 కోట్ల అప్పుతో చంద్రబాబు సర్కారు తీసుకున్న అప్పులు ఏకంగా రూ.74,827 కోట్లకు చేరాయి. తాజాగా ఆర్బీఐ ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా 7.17 శాతం వడ్డీకి రూ.ఐదు వేల కోట్ల రుణాన్ని సమీకరించింది. 

ఇక బడ్జెటేతర అప్పుల కింద వివిధ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వ గ్యారెంటీలతో చేసినవి, చేయనున్న అప్పులు, రాజధాని పేరుతో చేసినవి, చేయనున్న అప్పులతో కలిపి బాబు సర్కారు అప్పుల ప్రగతి ఏకంగా రూ.1.19 లక్షల కోట్లకు ఎగబాకింది! సంపద సృష్టించి అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తామని ఎన్నికల ముందు నమ్మబలికిన సీఎం చంద్రబాబు పగ్గాలు చేపట్టాక అప్పులు చేయడం, ప్రజలపై భారం మోపడమే సంపద సృష్టి అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. 

మూడు నెలల ముందే..
మార్కెట్‌ రుణాల ద్వారా ఈ ఆర్థిక ఏడాదిలో రూ.71,000 కోట్ల మేర అప్పులు  చేయనున్నట్లు బడ్జెట్‌లో టీడీపీ కూటమి ప్రభుత్వం పేర్కొంది. కానీ ఆర్థిక సంవత్సరం మరో మూడు నెలలు మిగిలి ఉండగానే అంతకు మించి అప్పు చేసింది. బడ్జెట్‌లో చెప్పిన దానికి మించి రూ.74,827 కోట్ల అప్పులు చేసింది. ఇంత అప్పులు చేసినా మూలధన వ్యయం అంతంత మాత్రంగానే ఉందని ‘కాగ్‌’ ప్రకటించిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. నవంబర్‌ వరకు మూలధన వ్యయం కేవలం రూ.8,329 కోట్లు మాత్రమేనని కాగ్‌ గణాంకాలు వెల్లడించాయి.  

కార్పొరేషన్ల పేరుతో మరిన్ని..
కేవలం మార్కెట్‌ రుణాల ద్వారానే ఇంత అప్పులు చేసిన చంద్రబాబు సర్కారు వీటికి అదనంగా వివిధ కార్పొరేషన్ల నుంచి గ్యారెంటీలతో మరిన్ని అప్పులు చేసింది. ఏపీ ఎండీసీ ద్వారా రూ.5,000 కోట్ల అప్పును సమీకరించేందుకు సలహాదారు–మర్చంట్‌ బ్యాంకర్‌ను నియమించాల్సిందిగా ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. 

అంతేకాకుండా బడ్జెట్‌ బయట ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ సంస్థ, ఏపీ ఎండీసీ, హడ్కో ద్వారా మరిన్ని అప్పులు చేసేందుకు ఇప్పటికే చంద్రబాబు సర్కారు నిర్ణయం తీసుకుంది. టీడీపీ కూటమి ప్రభుత్వం బడ్జెట్‌లో ఇంత అప్పు చేసినప్పటికీ సూపర్‌ సిక్స్‌ హామీల్లో ప్రధానమైనవి ఒక్కటీ అమలు చేయకపోవడం గమనార్హం. ఆస్తుల కల్పనకు సంబంధించి మూలధన వ్యయం కూడా చేయలేదు.

పథకాలు లేవు.. మరి ఏం చేస్తున్నట్లు?
వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉండగా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తోందని, ఏపీ మరో శ్రీలంకలా మారిపోతోందని, సంక్షేమ పథకాల కోసం వైఎస్‌ జగన్‌ బటన్లు నొక్కుతున్నారంటూ చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా పెద్ద ఎత్తున విషం చిమ్మిన విషయం తెలిసిందే. లేని అప్పులు ఉన్నట్లుగా తప్పుడు గణాంకాలతో మభ్యపుచ్చే యత్నం చేశారు. మరిప్పుడు సూపర్‌ సిక్స్, సెవెన్‌ పథకాల్లో ఏ ఒక్కటీ అమలు చేయడం లేదు. 

కొత్త పథకాలను అమలు చేయకపోగా పేదలకు జగన్‌ ఇచ్చిన అన్ని పథకాలను కూటమి ప్రభుత్వం నిలిపివేసింది. ఇప్పుడు స్కూలు పిల్లలకు ‘అమ్మ ఒడి’ లేదు. విద్యార్థులకు రూ.3,900 కోట్ల మేర ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలను చెల్లించకుండా కూటమి ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ వర్తించక పేదలు అల్లాడుతున్నారు. ఆరోగ్యశ్రీ ఆస్పత్రులకు రూ.3 వేల కోట్ల మేర బకాయిలు పేరుకుపోవడంతో వైద్య సేవలు నిలిచిపోతున్నాయి. 

హామీలను అమలు చేయకుండా.. పథకాలను నిలిపివేస్తూ.. ఎడాపెడా అందినకాడికి అప్పులు తీసుకుంటూ రాష్ట్రాన్ని కూటమి సర్కారు అంధకారంలోకి గెంటేస్తోంది. మరి ఆ అప్పులన్నీ దేనికి వ్యయం చేస్తున్నట్లు? గత సర్కారు ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలకు లోబడే అప్పులు చేసినా అది పెద్ద నేరంగా చిత్రీకరించిన ఎల్లో మీడియా ఇప్పుడు చంద్రబాబు సర్కారు ఇష్టారాజ్యంగా రుణాలు తీసుకుంటున్నా మొద్దు నిద్ర నటిస్తోంది. 

అటు అప్పులు.. ఇటు అమ్మకాలు
ఒకపక్క అప్పులతో రాష్ట్రంపై పెనుభారాన్ని మోపుతున్న సీఎం చంద్రబాబు మరోపక్క వైఎస్సార్‌ సీపీ హయాంలో సంపద సృష్టిస్తూ నిర్మాణాలు చేపట్టిన ఓడ రేవులు, ప్రభుత్వ నూతన వైద్య కళాశాలలను ప్రైవేట్‌ పరం చేస్తున్నారు. తద్వారా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉపాధి కల్పనకు పాతరేయడంతోపాటు ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారు.  

అప్పులతోనే అమరావతి!
రాజధాని అమరావతి కోసం తొలి దశలో రూ.52 వేల కోట్లు అవసరమని టీడీపీ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ రూ.15 వేల కోట్లు అప్పు మంజూరు చేశాయని అదే ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతే కాకుండా హడ్కో నుంచి రూ.11 వేల కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ సంస్థ నుంచి రూ.5 వేల కోట్ల రుణాన్ని సమీకరించేందుకు సీఆర్‌డీఏను అనుమ­తిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులను కూడా ప్రభుత్వం జారీ చేసింది. అలాగే మిగతా రూ.21 వేల కోట్ల  రుణ సమీకరణకు కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా సీఆర్‌డీఏను ఉత్తర్వుల్లో ప్రభుత్వం ఆదేశించింది.   

Back to Top