అమరావతి: చంద్రబాబు అసమర్ధత మరోసారి బట్టబయలైంది. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం నిర్మాణం కేంద్రం చేపట్టాల్సి ఉండగా..ఆ బాధ్యతలను చంద్రబాబు తీసుకున్నారు. కమీషన్ల కోసం ప్రాజెక్టు అంచనాలు ఇష్టారాజ్యంగా పెంచారు. 2018 నాటికి గ్రావిటీతో నీళ్లు ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. 2019 అయినా కూడా ప్రాజెక్టు పనులు పునాదులు దాటలేదు. కానీ చంద్రబాబు మాటలు కోటలు దాటుతున్నాయి. ఎన్నికల కోడ్ ఉన్నా సరే తన కమీషన్ల కోసం ఇవాళ పోలవరం ప్రాజెక్టును సందర్శించిన చంద్రబాబు చేసింది ఏమీలేదు. పోలవరం ప్రాజెక్టు నుంచి 2019 జూన్-జూలై లోగా నీటిని అందిస్తాం, యుద్ధ ప్రాతిపదికపై పనులను పూర్తి చేస్తామని ఎడాపెడా మాటలు చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇపుడు చేతులు ఎత్తేశారు. ప్రజల ముందు వారిద్దరూ పలికిన మాటలు నీటిపై రాతలుగానే మిగిలిపోయాయి. ఎన్నికలకు ముందు, ఎన్నికలలో ఈమేర బీరాలు పలికిన వీరు ఇపుడు అసాధ్యమని తేల్చేశారు. 2019 ఏడాది జూన్-జూలై లో గ్రావిటీతో నీటిని సాగు అవసరాల కోసం ఇవ్వలేమని చంద్రబాబు ఇవాళ పోలవరం వద్ద మీడియాకు స్పష్టం చేశారు.. అందుకు ప్రాజెక్టు స్సిల్ వే సిద్ధం కాలేదని పేర్కొన్నారు. అయితే 23 టీఎంసీల నీటిని నిలువ చేసేందుకు వీలు ఏర్పడుతుందని ప్రకటించారు. ఈ నీటి వల్ల స్టోరేజి సౌలభ్యం ఒనగూరుతుందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం సత్వరం నిధులు విడుదల చేయక పోవడం, నిబంధనల అడ్డు మరిన్ని కారణాల వల్ల పోలవరం పనులలో జాప్యం చోటు చేసుకుందని చంద్రబాబు విచారాన్ని వ్యక్తం చేశారు. 2019 వ సంవత్సరంలో పూర్తి కావాల్సిన పోలవరం పనులు వచ్చే ఏడాది 2020 వ సంవత్సరంలో పూర్తి అవుతాయని ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఆనాడే ప్రాజెక్టు నుంచి గ్రావిటీ ద్వారా నీటిని సాగు నీటి అసవరాల కోసం విడుదలకు అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు. గత రెండు సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల ముందు చేసిన ప్రకటనలు అబద్ధాలని తేలిపోయాయి. మంత్రి దేవినేని మాటలు కోతలుగానే మిగిలిపోయాయి. చంద్రబాబు మీడియాతో మాట్లాడుతున్న సమయంలో సమీపంలోనే ఇరిగేషన్ మంత్రి దేవినేని కూడా ఉన్నారు. పోలవరం గురించి ఇప్పటి దాకా ఈ కోతల రాయుళ్లు చేసిన ప్రకటనల మాటేమిటి? అన్న ప్రశ్న ప్రస్తుతం ఉదయిస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టిన పోలవరం పనులు వైయస్ జగన్ హయాంలోనే సంపూర్ణంగా పూర్తి అవుతాయి. ఇది సత్యం.