ఏపీ ప్రజల తీర్పు...ఈవీఎంలలో నిక్షిప్తం 

 

ఏప్రిల్‌ 11, 2019, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల రోజు. ప్రజల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైపోయింది. ఓటర్లలో వెల్లువెత్తిన చైతన్యానికి బారులు తీరిన క్యూలైన్లు సాక్ష్యాలయ్యాయి. దాదాపు  పోలింగ్‌ ఎన భై శాతం దాటడం...ప్రజల ఆకాంక్షను బలంగా చాటింది. 

ఎన్నికల ఫలితాలు రాగానే అధికారం చేపట్టాక, ఐదేళ్లపాటు ప్రజలను మరిచిపోరాదు. ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి. అసలైన ప్రజాస్వామిక స్పూర్తి అదే. మే 23న వెలువడే ప్రజల తీర్పు  ప్రజాస్వామిక స్పూర్తికి అద్దం పట్టేలా వుంటుంది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని నాయకులు ...మాటతప్పని ధీరులుగా ముందడుగు వేయాలన్నది ప్రజల ఆకాంక్ష. 

సాధారణంగా ఎన్నికలు అయిపోగానే మేనిఫెస్టోని, అందులోని హామీలని పక్కన పడేసి, స్వంత అజెండాని చేపట్టడం తరచూ మనం చూస్తూనే వుంటాం. ఇలాంటి చర్యలు సహజంగానే ప్రజల్లో అసంతృప్తిని, అసహనాన్ని రేకెత్తిస్తాయి. రెండువేల నాలుగులో ఎన్నికల ఫలితాలు రాగానే..దివంగత ముఖ్యమంత్రి డా.వై.యస్‌.రాజశేఖరరెడ్డి...ప్రజల ఆకాంక్షల్ని చూసి భయం వేస్తోంది అన్నారు. అప్పట్లో ఆయనిచ్చిన హామీలకు ప్రజల నుంచి అనూహ్యసానుకూలత లభించడం తెలిసిందే. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే అన్ని శాఖల కార్యదర్శులకు మేనిఫెస్టో ప్రతులను పంపాల్సిందిగా ఆదేశించారు. అంత నిబద్దతను నాయకుల్లో ప్రజలు సహజంగా కోరుకుంటారు. 

ఆంధ్రప్రదేశ్‌ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. జన్మభూమికమిటీలు, ఇంటికి ఒకటే పెన్షన్, ఉద్యోగాల కల్పన లేమి, రైతాంగానికి అందని గిట్టుబాటు ధరలు వంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ఉత్పాదక వ్యయం తగ్గింది. వృధా ఖర్చులు పెరిగాయన్న భావన సర్వత్రా నెలకొంది. ఈ దశలో ఆర్థిక క్రమశిక్షణ, సంపదసృష్టిపైన దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఎంతయినా ఉంది. 

రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది నిరుద్యోగులు ఉపాధి అవకాశాలు కోసం ఏళ్ల తరబడి కళ్లుకాయలు కాసేలా నిరీక్షిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ ద్వారా జరిగే ఉద్యోగాల భర్తీ వందల్లో వుంటున్నాయి.  ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పదోషెడ్యూల్‌లో ఉన్న సంస్థల విభజన అలాగే ఉండిపోయింది. 

కరువు పరిస్థితులు తీవ్రంగా నెలకొన్న దశల్లో రెయిన్‌గన్స్‌ అనే ప్రయోగం వైఫల్యం చెంది, వేసిన పంటలు చేతికి రాక, వచ్చిన అరకొర పంటలకు గిట్టుబాటు లేక, రైతులు, వారిపై ఆధారపడ్డ రైతు కూలీలు అనేక ఇక్కట్లకు లోనవుతున్నారు. 2000 సంవత్సరానికి అందరికీ ఆరోగ్యం, అందరికీ విద్య అనే నినాదాలు దశాబ్దాలుగా వింటున్నాం. ఇప్పుడు వీటి సరసన పోలవరం చేరిపోయింది. 2018కి పూర్తిచేస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ప్రాజెక్టు వ్యయ అంచనాలు దఫదఫాలుగా పెంచడం తప్ప, ప్రాజెక్టు నిర్మాణం నత్తనడకను మరిపిస్తోంది. వైయస్సార్‌ హయాంలో తొమ్మిది పదో తరగతి విద్యార్థులకు పూర్తి రాష్ట్రప్రభుత్వ నిధులతో మధ్యాహ్నభోజన పథకం ప్రవేశపెట్టారు. గడిచిన నాలుగేళ్లలో వేలాది ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి. వైయస్సార్‌ హయాంలో  ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, 108, 104 అంబులెన్స్‌లు ఏర్పాటయ్యాయి. ఇప్పుడు ఆ పథకాలను ఎంతగా నీరుగార్చారో అందరికీ తెలిసిన విషయమే. ఇక రైతురుణమాఫీ, డ్వాక్రామహిళల రుణమాఫీ, సున్నావడ్డీకే రుణాలు అన్నీ ఎండమావుల్నే తలపించాయి. 

మొత్తానికి జవాబుదారీతనం లేని ప్రభుత్వతీరు ...ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రజావ్యతిరేకతను ఎదుర్కోవల్సిందే. 2019, మే 23 ఆంధ్రప్రదేశ్‌ ప్రజల తీర్పు రేపటి ప్రభుత్వపాలన ఎలా సాగాలో నిర్దేశించే దిక్సూచి కాబోతోంది. ఏపీలో మార్పు తధ్యం. 

 

Back to Top