అభివృద్ధే లక్ష్యంగా అడుగులు

రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి నాలుగు ప్రాంతీయ ప్రణాళిక బోర్డులు

ఆయా ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వం

ప్రాంతాల మధ్య అసమానతల తొలగింపు, సమగ్రాభివృద్ధే లక్ష్యం

ఆర్థిక వనరుల ప్రణాళిక,మౌలిక వసతుల అంతరాల తగ్గింపునకు ప్రాధాన్యం

నీటి నిర్వహణ, వ్యవసాయ ఉత్పత్తులు, పారిశ్రామికాభివృద్ధి, సామాజిక మౌలిక వసతులు,సంక్షేమ ప్రణాళికల రూపకల్పన

మూడేళ్ల కాల వ్యవధికి చైర్మన్‌ నియామకం

సభ్యులుగా వ్యవసాయం, నీటి నిర్వహణ, ఆర్థిక, సమగ్రాభివృద్ధి రంగాల్లో నలుగురు నిపుణులు

రాష్ట్ర ప్రణాళిక బోర్డు రద్దు.. ఆర్థిక శాఖ పరిశీలనలో ఫైలు

అమరావతి : రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అన్ని రంగాల్లో సమానంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా నాలుగు ప్రాంతీయ ప్రణాళిక బోర్డులను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సాధిస్తూ ప్రాంతాల మధ్య అసమానతలను రూపు మాపాలని అడుగులు వేస్తోంది. ప్రధానంగా సామాజిక అసమానతలతో పాటు అభివృద్ధి, సామాజిక, మౌలిక వసతుల్లో వ్యత్యాసాలను నివారించడం ద్వారా అన్ని ప్రాంతాల్లో సమాన అవకాశాలను కల్పించాలనేది ప్రభుత్వ ఉద్దేశం అని  ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇందులో భాగంగానే నాలుగు ప్రాంతీయ ప్రణాళిక బోర్డులను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిందని చెప్పారు. ఆయా ప్రాంతీయ ప్రణాళిక బోర్డుల పరిధిలో గల జిల్లాలన్నీ అన్ని రంగాల్లో సమానంగా అభివృద్ధి చెందేందుకు ప్రణాళికలను రూపొందించడంతో పాటు అమలు తీరు తెన్నులను పర్యవేక్షిస్తుందని ఆ అధికారి పేర్కొన్నారు.

విజయనగరం జిల్లా కేంద్రంగా (శ్రీకాకుళం– విజయనగరం– విశాఖపట్టణం) ఉత్తరాంధ్ర ప్రాంతీయ ప్రణాళిక బోర్డు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కాకినాడ కేంద్రంగా తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలతో ప్రాంతీయ ప్రణాళిక బోర్డు.. గుంటూరు కేంద్రంగా నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల ప్రాంతీయ ప్రణాళిక బోర్డు.. కడప కేంద్రంగా చిత్తూరు, కర్నూలు, అనంతపురం, వైయస్‌ఆర్‌ జిల్లాల ప్రాంతీయ ప్రణాళిక బోర్డు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

కేబినెట్‌ ర్యాంకుతో చైర్మన్ల నియామకం
ప్రాంతీయ ప్రణాళిక బోర్డులకు కేబినెట్‌ స్థాయి ర్యాంకులో మూడేళ్ల కాల వ్యవధికి చైర్మన్‌ నియామకం ఉంటుంది. వ్యవసాయం (ఫుడ్‌ ప్రాసెసింగ్‌–అగ్రి మార్కెటింగ్‌) నీటి నిర్వహణ, ఆర్థిక వృద్ధి – మౌలిక వసతులు, సమ్మిళిత అభివృద్ధి – సంక్షేమ రంగాలకు చెందిన నలుగురు నిపుణులను సభ్యులుగా నియమిస్తారు. అవసరమైన సిబ్బందిని కూడా ఇస్తారు. ప్రాంతీయ ప్రణాళిక బోర్డుల ఏర్పాటు నేపథ్యంలో రాష్ట్ర ప్రణాళికా మండలిని రద్దు చేయనున్నారు. ఈ ప్రతిపాదనలు ప్రస్తుతం ఆర్థిక శాఖ పరిశీలనలో ఉన్నాయి.

విధివిధానాలు ఇలా..
⇔ ఏయే ప్రాంతాల్లో ఏ రంగాల్లో, ఏ గ్రూపు జనాభాపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉందో గుర్తించాలి.
⇔ ప్రాంతీయ, జిల్లా అభివృద్ధి నివేదికలను రూపొందించడంతో పాటు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలి.
⇔ ప్రాంతీయ అభివృద్ధికి ఏ స్థాయిలో నిధులు వ్యయం చేయాలో అంచనా వేసి ప్రభుత్వానికి తగిన సూచనలు చేయాలి.
⇔ వివిధ అభివృద్ధి కార్యక్రమాలను అంచనా వేస్తూ.. ప్రాంతీయ అసమానతలను రూపుమాపడానికి కృషి చేయాలి. మొత్తం ప్రాంతం సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకోవాలి.
⇔ జిల్లా సమీక్షా కమిటీల సమావేశాలకు ప్రాంతీయ ప్రణాళిక బోర్డు చైర్మన్లు ప్రత్యేక ఆహ్వానితులుగా వెళ్తారు.
⇔ నీటి నిర్వహణ ప్రణాళికలను రూపొందించడంతో పాటు నీటి సంరక్షణ, ఉన్న జలాలను సమర్థవంతంగా వినియోగించడంతో పాటు స్థానికంగా మారుమూల ప్రాంతాల్లో నివశించే ప్రజలకు ప్రయోజనం కలిగేలా కరువు నివారణ చర్యలు చేపట్టాలి.
⇔ వ్యవసాయ ఉత్పత్తుల ప్రణాళికను రూపొందించడంతో పాటు ఫుడ్‌ ప్రాసెసింగ్, ఎగుమతులను ప్రోత్సహించి రైతుల పంటలకు సరైన ధర కల్పించాలి.
⇔ సమగ్ర పారిశ్రామిక అభివృద్ధికి మాస్టర్‌ ప్రణాళికను రూపొందించడంతోపాటు సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించాలి. తగిన పెట్టుబడులు ఆకర్షించడం ద్వారా స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలి.  
⇔ ఆర్థిక వనరులు, మౌలిక వసతుల ప్రణాళికలను రూపొందించాలి. రాష్ట్ర అభివృద్ధి వ్యూహంలో భాగంగా ప్రాంతీయ అభివృద్ధి ప్రణాళికను రూపొందించాలి. మౌలిక సదుపాయాల వ్యత్యాసాలను పూరించడంతో పాటు స్థానిక సహజ వనరుల ద్వారా జిల్లాలను పటిష్టం చేసే దిశగా చర్యలు తీసుకోవాలి.
⇔ సామాజిక మౌలిక సదుపాయాలు
⇔ సంక్షేమ రంగాలకు ప్రణాళికలను రూపొందించాలి. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచడంతో పాటు ఉపాధి హామీ, ఆర్‌ఐడీఎఫ్‌ నిధులతో పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, రవాణా రంగాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి.

Back to Top