అమరావతి: ఇద్దరితో ప్రారంభమైన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ(వైయస్ఆర్‌సీపీ) నేడు అఖండ ప్రజాబలంతో వెలిగిపోతోంది. దేశ రాజకీయాల్లో విప్లవం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నవశకం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఆరంభమైంది. దేశంలోనే అతిపెద్ద పార్టీ కాంగ్రెస్‌కు రాష్ట్రంలో చోటు కరువైంది. 40 ఏళ్ల రాజకీయ అనుభవం..14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 12 ఏళ్లు ప్రతిపక్ష నేతగా పని చేసిన చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ పార్టీకి ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల్లో నిలిచేందుకు అభ్యర్థులు కరువయ్యారు. వీటన్నింటికీ ఒకే ఒక్కరు కారణం. ఆయనే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రస్తు త ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి. జన హోరుని చూసి మైమరచిపోయి తొడగొట్టే హీరో కాదాయన. సినిమాల్లో విలన్ల ముందు తిప్పినట్టు జనం ముందు మీసాలు మెలేసే పాతకాలపు కథానాయకుడు అసలే కాదు. ఇచ్చిన మాట మీద నిలబడే నిజమైన నాయకుడు. ఎన్నికల కోసం హామీలు ఇవ్వడం కాదు..ప్రజలకు ఏం కావాలో తెలిసిన నాయకుడు. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను 95 శాతం అమలు చేసి రాష్ట్ర ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. అందుకు ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికలే అద్దం పట్టాయి. రేపు పురపోరులోనూ నిజం కాబోతుంది. పంచాయతీ ఎన్నికల్లో విజయదుందుభి ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ అసాధారణ విజయాన్ని సొంతం చేసుకుంది. సానుకూల ఫలితాలతో వైయస్సార్‌సీపీ శ్రేణుల్లో జోష్ రెట్టింపు అయింది. ఊరు, వాడ, జిల్లా, ప్రాంతం తేడా లేకుండా విజయ దుందుభి మోగించారు. చంద్రబాబు ఒటమి చాలా చక్కగా కనిపించింది. రాష్ట్రంలో 13,095 పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి. వాటిలో వైయస్‌ఆర్‌సీపీకి 10524 పంచాయతీలు దక్కాయి. 80.37 శాతం వైయస్‌ఆర్‌సీపీ అభిమానులు సర్పంచ్‌లుగా గెలిచారు. టీడీపీకి 2063 పంచాయతీల్లో గెలిస్తే..15.75 శాతం స్థానాలు దక్కించుకుంది. ఇతరులు 488 మంది గెలిచారు. 3.8 శాతం గెలిచారు. పుర పోరులో ఏకగ్రీవాల హవా ఏపీ మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో వైయస్సార్‌సీపీ హవా కొనసాగింది. వైయస్ఆర్ జిల్లా పులివెందుల, చిత్తూరు జిల్లా పుంగనూరు, గుంటూరు జిల్లా మాచర్ల, పిడుగురాళ్ల మున్సిపాలిటీలు వైయస్ఆర్‌సీపీ ఖాతాలో చేరాయి. రాష్ట్రం మొత్తం 578 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అందులో వైయస్సార్‌సీపీ అభ్యర్థులు 570 చోట్ల.. టీడీపీ అభ్యర్థులు ఆరు స్థానాల్లో, బీజేపీ, స్వతంత్ర అభ్యర్థులు ఒక్కో చోట ఏకగ్రీవమయ్యారు. చిత్తూరు, తిరుపతి, కడప కార్పొరేషన్లలో వైయస్సార్‌సీపీ ఆధిఖ్యం కొనసాగుతోంది. చిత్తూరు కార్పొరేషన్‌లో 50 డివిజన్లలో 37 ఏకగ్రీవంగా గెలుచుకుంది. తిరుపతి కార్పొరేషన్‌లో 50 డివిజన్లలో 21.. కడప కార్పొరేషన్‌లో 50 డివిజన్లలో 23 డివిజన్లను వైయస్సార్‌సీపీకి ఏకగ్రీవం అయ్యాయి. పుంగనూరు మున్సిపాలిటీలో మొత్తం 31 వార్డులను అధికార పార్టీ ఏకగ్రీవం చేసుకుంది. గత చరిత్ర చూస్తే.. 2019లో జరిగిన సాధారణ ఎన్నికలను మించి పంచాయతీ ఫలితాలు వైయస్ఆర్‌సీపీకి అనుకూలంగా వచ్చాయి. గత చరిత్రను చూస్తే అధికార పార్టీ అభిమానులు 60 శాతానికి మించి గెలిచిన సందర్భాల్లేవు. ఇప్పుడు ఏకంగా 80 శాతానికిపైగా పల్లె జనం ప్రభుత్వానికే జై కొట్టారు. చంద్రబాబు పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోను విడుదల చేసి తన మోసపూరిత బుద్ధిని ప్రదర్శించారు. అయినా ప్రజలు పట్టించుకోలేదు. తన పార్టీ అధికారంలో లేదని తెలిసీ కూడా చంద్రబాబు మేనిఫెస్టోలో తప్పుడు వాగ్ధానాలు చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 2014-2019 మధ్యలో ఎన్ని హామీలు అమలు చేశారో చెప్పుకునే దమ్ము, ధైర్యం కూడా టీడీపీ నేతలకు లేదు. ప్రతి వాగ్ధానం నెరవేర్చుతూ.. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఎన్నికల ముందు, పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్ధానాన్ని నెరవేర్చతూ ముందుకు వెళ్తున్నారు. ప్రణాళికబద్దంగా తేదీలు, నెలల వారీగా ఏ కార్యక్రమాన్ని ఎప్పుడు చేయబోతున్నామో తెలియచేస్తూ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుకోవాలనే తపన బహుశా ఎప్పుడూ చూసి ఉండకపోవచ్చు. గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా స్థాపించిన గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ పనితీరు అద్భుతంగా ఉంది. ఈ వ్యవస్థ ద్వారా ఎలాంటి వివక్ష లేకుండా అర్హులందరికీ నవరత్నాల సంక్షేమ ఫలాలను అందిస్తున్నారు. తొలి ఏడాదిలోనే 90 శాతం హామీలు అమలు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన ఏడాది కాలంలోనే 90 శాతం హామీలు అమలు చేశారు. పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావించారు. సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి అంశాలవారీగా తేదీలతో క్యాలెండర్‌ను ప్రకటించి, అమలు చేస్తున్నారు. నవరత్నాల ద్వారా గత నెల 20వ తేదీ వరకు రాష్ట్రంలో 3,57,51,614 మందికి రూ.40,139.58 కోట్ల మేర ఆర్ధిక సాయం అందించారు. గతంలో ఎన్నడూ ఇంత పెద్ద మొత్తంలో పేదలకు మేలు చేసిన ప్రభుత్వాలు లేవు. ఇంటింటికి వెళ్లి సహాయం అందిస్తుంటే లబ్ధిదారులు పొందే ఆనందం అంతా ఇంతా కాదు. ఓటు వేయని వారికి కూడా.. వివక్షకు తావు లేకుండా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారు. ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీకి ఓటు వేయని వారికి కూడా అర్హత ఉంటే పథకాలు అందిస్తున్నారు. పారదర్శకంగా లబ్ధిదారుల పేర్లను సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వ పథకాలన్నీ గడప గడపకూ అందిస్తున్నారు. దాదాపు నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. సూర్యోదయానికి ముందే.. సూర్యోదయానికి ముందే ఇంటి తలుపు తట్టి మరీ పెన్షన్ ఇస్తున్నారు. అమ్మ ఒడి ద్వారా 43 లక్షల మంది తల్లుల ఖాతాల్లో నగదు జమ చేశారు. వైయస్‌ఆర్ రైతు భరోసా, వాహనమిత్ర.. ఇలా ఏది చూసినా పథకం పేదలకు మేలు చేస్తున్నాయి. మద్యం మహమ్మారికి బ్రేక్ గతంలో గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్టు షాపులు ఏర్పాటు చేసి మద్యం విక్రయించారు. వైయస్ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే రాష్ట్రవ్యాప్తంగా 43 వేల బెల్టుషాపులను రద్దు చేయించింది, మద్యం షాపులు 33 శాతం తగ్గించింది. ఎక్కడా పర్మిట్‌రూమ్‌లు లేకుండా చేశాం. విక్రయ వేళలు తగ్గించి షాపులను ప్రభుత్వమే నిర్వహిస్తోంది. మరోవైపు షాక్ కొట్టేలా మద్యం ధరలు పెంచారు. దీంతో ఐఎంఎఫ్‌ఎల్ లిక్కర్ అమ్మకాలు 23 లక్షల కేసుల నుంచి 10 లక్షలకు తగ్గాయి. మరెన్నో పథకాలు.. వైయస్ఆర్‌సీపీ అధికారంలోకి ప్రజలకు ఏది అవసరమో గుర్తించి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. 2018 అక్టోబరు దాకా అంటే ఎన్నికలకు ఆరు నెలల ముందు దాకా గత ప్రభుత్వ హయాంలో కేవలం 44 లక్షలు మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చేవారు. ఈరోజు మేం ఇస్తున్న పెన్షన్ల సంఖ్య 58.61 లక్షలు. గత ప్రభుత్వం ఎన్నికలకు రెండు నెలల ముందు దాకా ఇచ్చిన పింఛను కేవలం రూ.1,000 మాత్రమే. ఇవాళ రూ.2,250 పెన్షన్ ఇస్తున్నారు. ‘వైఎస్‌ఆర్ వాహనమిత్ర’తో సొంతంగా ఆటో ఉన్న డ్రైవర్లకు, టాక్సీ డ్రైవర్లకు తోడుగా నిలిచారు. ‘వైఎస్‌ఆర్ కంటి వెలుగు’ ద్వారా దాదాపు 69 లక్షల మంది పిల్లలకు ఉచితంగా కంటి పరీక్షలు, చికిత్స. ‘వైఎస్‌ఆర్ రైతు భరోసా’ పథకం ద్వారా దాదాపు 50 లక్షల మందికి లబ్ధి. ‘వైయస్సార్ నవోదయం’తో ఎంఎస్‌ఎంఈ యూనిట్లకు రుణాల రీస్ట్రక్చర్. అగ్రిగోల్డ్ బాధితులకు రూ.264 కోట్ల చెల్లింపులు. కోర్టు అనుమతిచ్చిన మేరకు రూ.పదివేల లోపు డిపాజిట్‌దారులందరినీ ఆదుకున్నారు. మనబడి నాడు –నేడు పనులకు శ్రీకారం. జూలై నాటికి తొలిదశలో 15,700 స్కూళ్ల రూపురేఖలు మార్పుచేశారు. ‘వైయస్‌ఆర్ నవశకం’ సర్వేకి శ్రీకారం. బియ్యం కార్డులకు ఆదాయ అర్హత రెట్టింపు. మత్స్యకార భరోసా, ఆరోగ్యశ్రీ రూపురేఖలు సంపూర్ణంగా మార్పు చేశారు. వైఎస్‌ఆర్ ఆరోగ్య ఆసరా ద్వారా చికిత్స అనంతరం ఇంట్లో విశ్రాంతి తీసుకునే సమయంలో నెలకు రూ.5 వేలు చెల్లింపు. వైయస్‌ఆర్ లా నేస్తం, మహిళల భద్రత కోసం దిశ చట్టం. 18 దిశ పోలీస్ స్టేషన్ల ఏర్పాట్లు. వైయస్‌ఆర్ నేతన్న నేస్తం ద్వారా 81 వేల మంది చేనేతన్నలకు రూ.24 వేల చొప్పున ఆర్థిక సాయం. ఆరోగ్యశ్రీ ద్వారా 2 వేలకు పైగా వ్యాధులకు చికిత్స . అమ్మ ఒడి ద్వారా రూ.15 వేల చొప్పున తల్లుల ఖాతాల్లో జమ. జగనన్న వసతి దీవెన పథకం ద్వారా తొలిదఫాలో రూ.1,200 కోట్లు చెల్లింపులు. ఏప్రిల్‌లో పొదుపు సంఘాలకు రూ.1,400 కోట్ల మేర వడ్డీలేని రుణాలు. వైఎస్‌ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించడం ద్వారా స్వయం సహాయ సంఘాలకు చేయూత అందించారు. కుప్పకూలిన టీడీపీ కంచుకోట... ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ కంచుకోట కుప్పకూలింది. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం ప్రజలు ఆయనకు గట్టి షాక్ ఇచ్చారు. ఆ నియోజకవర్గంలో 89 పంచాయతీలుంటే 74 చోట్ల వైయస్సార్‌సీపీ మద్దతుదారులను గెలిపించారు. 1989లో చంద్రబాబు తొలిసారి టీడీపీ ఎమ్మెల్యేగా కుప్పం నుంచి ఎన్నికయ్యారు. తర్వాత వరుసగా ఏడు పర్యాయాలు ఇక్కడ గెలిచారు. మూడుసార్లు సీఎంగా పదవి చేపట్టారు. కుప్పంలో తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. కానీ పంచాయతీ ఎన్నికల్లో చరిత్ర తిరగబడింది. 89 పంచాయతీల్లో 74 పంచాయతీలు అధికారపార్టీ పరమయ్యాయి. టీడీపీ కేవలం 14 గ్రామాలకే పరిమితమైంది. కొన్ని చోట్లయితే టీడీపీ అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఇవే ఫలితాలు మున్సిపల్ ఎన్నికల్లోనూ పునరావృతం కావడం ఖాయమని పరిశీలకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.