తాడేపల్లి: రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రజలపై కక్ష గట్టినట్లు వ్యవహరిస్తున్నారని, రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశన్నంటుతున్నా తగ్గించకుండా, పొదుపు పేరుతో ఉచిత సలహాలు ఇవ్వడమే ఇందుకు నిదర్శనమని మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు వెల్లడించారు. పెట్రో ధరల మంటకు వ్యతిరేకంగా సోమవారం వైయస్సార్‌సీపీ నిర్వహించిన రాష్ట్రవ్యాప్త నిరసనలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని, ప్రభుత్వం వెంటనే పెట్రో ధరలు తగ్గించకపోతే, భారీ ఉద్యమం తప్పదని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కోరుముట్ల శ్రీనివాసులు హెచ్చరించారు. ప్రెస్‌మీట్‌లో కోరుముట్ల శ్రీనివాసులు ఇంకా ఏమన్నారంటే..: ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరల సెగ: దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు మండుతున్నాయి. ఏపీలో రెండు రోజుల క్రితం రూ.113 ఉన్న లీటరు పెట్రోల్ ఇవాళ్టి పెంపుతో రూ.114 దాటేసింది. డీజిల్ కూడా రెండు రోజుల క్రితం లీటరుకు రూ.101.55 ఉంటే ఇవాళ తాజా పెంపుతో అది కాస్తా రూ.103కు చేరుకుంది. దీంతో రాష్ట్రంలో ప్రజలపై భారం మరింత పెరిగిపోయింది. ఎన్నికలకు ముందు పెట్రోల్ ధరలపై చంద్రబాబు, లోకేష్ పోటీ పడి మరీ విమర్శలు చేశారు. ఇతర రాష్ట్రాలతో పోలుస్తూ ఇతర రాష్ట్రాలకు వెళ్లి పెట్రోల్, డీజిల్ పోయించుకోవాలని ఇక్కడి ప్రజలకు పిలుపునిచ్చారు. తాము అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామన్నారు. చంద్రబాబు ఎన్నికల హామీ ఏమైంది?: చంద్రబాబు ఇప్పుడు మాత్రం ఇంధనం పొదుపు చేయాలి, కార్లలో తిరగకూడదు, దగ్గరి ప్రాంతాలకు సైకిళ్లపై వెళ్లిపోండి, ఒకరోజు నో వెహికల్ డే పాటించాలని ఉచిత సలహాలు ఇస్తున్నారు. రాష్ట్రంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో రాష్ట్రంలో అందరిపైనా భారం పడుతుంటే.. వాటిని తగ్గించకుండా ఉచిత సలహాలు ఇవ్వడం ఏంటో అర్ధం కావట్లేదు. నిత్యావసరాల రేట్లు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కేరళతో పోలిస్తే ఇక్కడ రూ.3 ధర ఎక్కువగా ఉంది. తమిళనాడుతో పోలిస్తే రూ.10, కర్నాటకతో పోలిస్తే రూ.7 వ్యత్యాసం ఉంది. పెరిగిన చమురు ధరల్ని ప్రభుత్వం భరిస్తే కానీ నిత్యావసరాల ధరలు తగ్గేలా లేవు. ఇవేమీ చేయకుండా చంద్రబాబు ఉచిత సలహాలు ఇస్తున్నారు. పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించకుండా ఉచిత సలహాలా?: ఎన్నికలకు ముందు పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ ఎత్తేస్తామని, ధరలు తగ్గిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు అదే వ్యాట్ తగ్గించాలని ప్రజలు అడుగుతున్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఎక్కడో పెంచారని, మేం పెంచుతున్నారని సమర్ధించుకుంటున్నారు. కనీసం దక్షిణాది రాష్ట్రాలతో పోల్చినా ఏపీలో ప్రజలపై భారం ఎక్కువగా పడుతుంది కాబట్టి ఇక్కడ వ్యాట్ తగ్గించాలని కోరుతున్నాం. పెట్రోల్ పై 31 శాతం వ్యాట్ రూపంలో వసూలు చేస్తున్నారు. మరో 4 రూపాయలు అదనపు వ్యాట్ పేరుతో వసూలు చేస్తున్నారు. అధికారంలోకి వస్తూనే ధరలు తగ్గిస్తామని చంద్రబాబు, లోకేష్ హామీ ఇచ్చి గాలికొదిలేశారు. కూటమి ఎన్నికల మ్యానిఫెస్టోలో ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరో మాట చెప్తున్నారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా నిన్న వైయస్ఆర్‌సీపీ 175 నియోజకవర్గాల్లో నిరసనలు తెలిపింది. వీటికి ప్రజల నుంచి భారీగా మద్దతు లభించింది. ప్రజలంతా పెరిగిన ధరలు భరించలేక ఇతర రాష్ట్రాలకు తరలిపోయే పరిస్ధితులు నెలకొంటున్నాయి. రేట్లు తగ్గించకపోతే భారీ ఉద్యమం తప్పదు: మరోవైపు చంద్రబాబు మాత్రం చమురు ధరల సమస్య నుంచి డైవర్ట్ చేసేందుకు రాష్ట్రంలో ముగ్గురు పిల్లల్ని కంటే రూ.30 వేలు, నాలుగో బిడ్డను కంటే రూ.40 వేలు ఇస్తామనే ప్రచారం మొదలుపెట్టారు. ఇప్పటికే రాష్ట్రంలో పరిస్ధితి దారుణంగా ఉంది. వేసిన పంటకు గిట్టుబాటు ధరలేక రైతులు అల్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్న పథకాలు ఏవీ అమలు కావట్లేదు. ఇలాంటి పరిస్ధితుల్లో అదనపు బిడ్డల్ని కనాలని చంద్రబాబు చెప్పడం వారిని మరోసారి వంచించడమే. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలతో అల్లాడుతున్న ప్రజలకు ప్రభుత్వం ఊరట కలిగించలేకపోతే వైయస్ఆర్‌సీపీ తరఫున భారీ ఎత్తున పోరాటాలు తప్పవని కోరుముట్ల శ్రీనివాసులు హెచ్చరించారు.