వైయస్‌ జగన్‌ను కలిసిన దివ్యాంగ ప్రతినిధులు

 తాడేపల్లి : వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారిని  ఆల్ యూనివర్శిటీ దివ్యాంగ్ వింగ్స్ ప్రతినిధులు కలిసి తమ సమస్యలను వివరించారు. ఆల్ యూనివర్శిటీ దివ్యాంగ్ వింగ్స్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎం. కోటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎం. శ్రీనివాసరావు వైయస్ జగన్‌ను కలిసి ఆంధ్రప్రదేశ్‌లోని 19 యూనివర్శిటీలలో 1523 అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ దివ్యాంగులకు ఎలాంటి రిజర్వేషన్లు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉన్నత విద్యను అభ్యసించి, పీహెచ్‌డీలు పూర్తి చేసిన దివ్యాంగులు రిజర్వేషన్లు లేకపోవడం వల్ల ఉద్యోగ అవకాశాలకు దూరమవుతున్నారని తెలిపారు. దివ్యాంగుల హక్కులు, సమానత్వం, సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న“దివ్యాంగుల హక్కుల పరిరక్షణ చట్టం - 2016” ను రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా అమలు చేయడం లేదని ఆరోపించారు. దీంతో దివ్యాంగులు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలను కోల్పోతున్న పరిస్థితి నెలకొన్నదని పేర్కొన్నారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో కూడా తమకు తగిన అవకాశాలు కల్పించడం లేదని వాపోయారు. దివ్యాంగుల సమస్యలను సావధానంగా విన్న వైయస్ జగన్ వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గతంలో వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం తీసుకున్న చర్యలను గుర్తు చేస్తూ, భవిష్యత్తులో కూడా దివ్యాంగులకు అండగా వైయ‌స్ఆర్‌సీపీ నిలుస్తుందని భరోసా ఇచ్చారు.
 

Back to Top