చంద్ర‌బాబు పాల‌నే రాష్ట్రానికి గొడ్డ‌లి పెట్టు

మ‌త్స్య‌కారుల‌కు తీర‌ని ద్రోహం

మాజీ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు ధ్వ‌జం

శ్రీకాకుళంలోని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన పార్టీ డాక్ట‌ర్స్ వింగ్ అధ్య‌క్షుడు, మాజీ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు 

శ్రీ‌కాకుళం: జువ్వ‌ల‌దిన్నె ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా వైయస్ జ‌గ‌న్ గారికి వ‌చ్చిన ప్ర‌జా స్పంద‌న‌, ఆయ‌న ఇచ్చిన పిలుపుతో చంద్ర‌బాబులో వ‌ణుకు మొద‌లైంద‌ని, అందుకే ప‌చ్చి అబ‌ద్ధాలు వ‌ల్లె వస్తూ గ‌త ప్ర‌భుత్వాన్ని, వైయ‌స్ జ‌గ‌న్ గారిని నిందిస్తున్నార‌ని మాజీ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు ధ్వ‌జ‌మెత్తారు. శ్రీకాకుళంలోని పార్టీ కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ మ‌త్స్యకారుల‌కు చంద్ర‌బాబు చేసిందేమీ లేద‌ని, కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక అన్ని వ‌ర్గాల‌తోపాటు మ‌త్స్య‌కారులు కూడా తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌ని చెప్పారు. మ‌రోవైపు పోర్టులు, ఫిషింగ్ హార్బ‌ర్‌లు, ఫిష్ ల్యాండింగ్ సెంట‌ర్ల రూపంలో వైయ‌స్ జ‌గ‌న్ గారు సృష్టించిన సంప‌ద‌ను ప్రైవేటీక‌ర‌ణ పేరుతో త‌న బినామీల‌కు అప్ప‌జెప్పే కుట్ర‌లు చంద్ర‌బాబు చేస్తున్నాడ‌ని దుయ్య‌బ‌ట్టారు. రాష్ట్రానికి రెండేళ్ల‌లో చేసిందేమీ లేక, ఏమీ చెప్పుకోలేక జ‌గ‌న్‌ని తిట్ట‌డ‌మే చంద్ర‌బాబు ప‌నిగా పెట్టుకున్నాడని, చంద్ర‌బాబు పాల‌న రాష్ట్రానికి గొడ్డ‌లిపెట్టులా మారింద‌ని, రెండేళ్ల‌లో అన్ని వ్య‌వ‌స్థ‌లూ నిర్వీర్యమ‌య్యాయ‌ని, అన్ని వ‌ర్గాల‌కు అన్యాయం జ‌రిగింద‌ని మాజీ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు స్ప‌ష్టం చేశారు. 
ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే...

 
2024-25 మత్స్య‌కార సేవ‌లో బకాయిలు ఎప్పుడిస్తారు?

వైయ‌స్ఆర్‌సీపీ  ప్ర‌భుత్వ హ‌యాంలో మ‌త్స్య‌కార భ‌రోసా పేరుతో ప్ర‌తి ఏటా దాదాపు 1.20ల‌క్ష‌ల కుటుంబాల‌కు ఏటా రూ.10 వేలు చొప్పున‌ఆర్థిక సాయం జ‌రిగింది. ఎన్యుమ‌రేష‌న్ ద‌గ్గ‌ర నుంచి సాయం ల‌బ్ధిదారుల అకౌంట్‌లో జ‌మ‌య్యే వ‌ర‌కు అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకునేవాళ్లం. ప్ర‌తి మ‌త్స్య‌కార కుటుంబానికి ఠంఛ‌న్‌గా వేట నిషేధ స‌మ‌యంలో జ‌మ చేసేవాళ్లం. ఎక్క‌డా పైసా కూడా అవినీతికి తావులేకుండా డీబీటీ ప‌ద్ధ‌తిలో న‌గ‌దు నేరుగా ల‌బ్ధిదారుల ఖాతాల్లో జ‌మయ్యేది. చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చాక మ‌త్స్య‌కార సేవ‌లో పేరుతో ఏటా రూ.20 వేలు ఇస్తాన‌ని చెప్పి 2024-25 సంవ‌త్స‌రానికి పూర్తిగా ఎగ‌నామం పెట్టాడు. డీజిల్ సబ్సిడీ పేరుతో కూడా సీఎం చంద్ర‌బాబు, మంత్రి అచ్చెన్నాయుడు ప‌చ్చి అబ‌ద్ధాలు చెబుతున్నారు. లీట‌ర్‌కి రూ.6 స‌బ్సిడీ ఇస్తామ‌ని చెప్పారు. 2014-19 మ‌ధ్య బ్యాక్ ఎండ్ స‌బ్సిడీ పేరుతో మ‌త్స్య‌కారులు వినియోగించుకున్న త‌ర్వాత ఆ అమౌంట్‌ని జ‌మ చేస్తామ‌ని చెప్పారు. కానీ నిధులు విడుద‌ల చేయ‌క‌పోవ‌డంతో వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వం వ‌చ్చాకే ఆ పెండింగ్ బిల్లుల‌ను చెల్లించ‌డ‌మే కాకుండా మ‌త్స్య‌కారుల‌కు డీజిల్‌ స‌బ్సిడీకి సంబంధించి కార్డులు ఇవ్వ‌డం జ‌రిగింది. డీజిల్ కొన్న‌ప్పుడే నేరుగా ఆ స‌బ్సిడీ డ‌బ్బులు ల‌బ్ధిదారుల అకౌంట్‌లో జ‌మ‌య్యే విధానానికి శ్రీకారం చుట్టాం. మోటార్ బోట్ల‌కు నెల‌కు 300 లీట‌ర్లు, మెక‌నైజ్డ్ బోట్ల‌కు 3 వేల లీట‌ర్ల చొప్పున లీట‌ర్‌కి రూ.9లు స‌బ్సిడీ విధానం తీసుకొచ్చాం. 2014-19 వ‌ర‌కు ఉన్న రూ.6 ల సబ్సిడీని రూ.9ల‌కు పెంచి అంద‌జేశాం. పాద‌యాత్ర‌లో మ‌త్స్య‌కారుల క‌ష్టాల‌ను చూసి ప్ర‌మాదవ‌శాత్తు వేట స‌మ‌యంలో మ‌ర‌ణిస్తే రూ. 10 ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియా వ‌చ్చేలా చ‌ర్య‌లు తీసుకున్నారు. ఇప్పుడు కూట‌మి ప్ర‌భుత్వం దాన్ని అమ‌లు చేస్తూ త‌మ ఘ‌న‌త‌గా చెప్పుకుంటోంది.

చేసిందేమీ లేక వైయ‌స్ జ‌గ‌న్‌ని తిడుతున్నాడు

రెండేళ్లుగా చేసిందేమీ లేక, చెప్పుకోవ‌డానికి ఏమీలేక వైయ‌స్ జ‌గ‌న్ గారిని తిట్ట‌డ‌మే చంద్ర‌బాబు ప‌నిగా పెట్టుకున్నాడు.  త‌న పాల‌నా వైఫ‌ల్యాల‌ను క‌ప్పిపుచ్చుకోవ‌డానికి స‌మ‌యం, సంద‌ర్భం, వేదిక‌తో సంబంధం లేకుండా నీచంగా దిగ‌జారి మాట్లాడుతున్నాడు. నోరెత్తితో గొడ్డ‌లి పార్టీ అని మాట్లాడుతున్నాడు. నిజానికి రాష్ట్రానికి చంద్ర‌బాబే గొడ్డ‌లి వేటు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను చంద్ర‌బాబు త‌న రెండేళ్ల పాల‌న‌తో తీవ్రంగా వంచించాడు. ఏ వ‌ర్గ‌మూ కూట‌మి పాల‌న‌లో సంతోషంగా లేదు. విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు, మ‌హిళ‌లు, వ్యాపారులు, వృద్ధులు.. ఏ వ‌ర్గం చూసినా చంద్ర‌బాబు గొడ్డ‌లి వేటుకి రోదిస్తూనే ఉన్నారు. ఇసుక‌, మ‌ట్టి, గ్రావెల్ వంటి స‌హ‌జ వ‌న‌రులు దోపిడీ ఈ రాష్ట్రంలో చంద్ర‌బాబు పాల‌న‌లో జ‌రుగుతున్న‌ట్టుగా గ‌తంలో ఎక్క‌డా జ‌ర‌గ‌లేదు. ఇవ‌న్నీ మాట్లాడితే చంద్ర‌బాబుకి వ‌ణుకు. త‌న రాజకీయ జీవితంలో కనీసం ఒక్క పోర్టు, ఒక్క ఫిషింగ్ హార్బ‌ర్ నిర్మాణం చేప‌ట్టని చంద్ర‌బాబుకి జువ్వ‌ల‌దిన్నె ఫిషింగ్ హార్బ‌ర్‌ని ప్రైవేటుప‌రం చేసే హ‌క్కు ఎవ‌రిచ్చారు?  వైయ‌స్ జ‌గ‌న్ గారు 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బ‌ర్‌లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంట‌ర్లు నిర్మాణానికి శ్రీకారం చుడితే,  ఆ ప‌నుల‌ను ఎక్క‌డిక‌క్క‌డే ఆపేసిన విష‌న‌రీ చంద్ర‌బాబు. మ‌త్స్య‌కారుల కోసం వైయ‌స్ జ‌గ‌న్ గారు సంప‌ద సృష్టిస్తే, చంద్ర‌బాబు ఆ సంప‌ద‌ను త‌న బినామీల‌కు రాసివ్వ‌డానికి పూనుకున్నాడు. వైయ‌స్ జ‌గన్ గారు జువ్వ‌ల‌దిన్నె ఫిషింగ్ హార్బ‌ర్ ని సంద‌ర్శించి హెచ్చ‌రించ‌బ‌ట్టే ప్రైవేటీక‌ర‌ణ‌పై చంద్ర‌బాబు వెన‌క‌డుగు వేశాడు. ప్ర‌భుత్వ ఆస్తుల‌ను తెగ‌న‌మ్మ‌డమే ఈ ప్ర‌భుత్వ విధానం. రాబోయే త‌రాల‌కు చంద్ర‌బాబు ఏమీ మిగ‌ల్చ‌డం లేదు. ప్ర‌జ‌ల్లో వీటిపై చ‌ర్చ జ‌ర‌గ‌కుండా చూడాల‌నేది చంద్ర‌బాబు ల‌క్ష్యం. ఈ వైఫల్యాల‌ను క‌ప్పిపుచ్చ‌డానికే వైయ‌స్ జ‌గ‌న్ గారిని తిట్ట‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నాడు. మ‌త్స్య‌కారుల‌కు సంప‌ద సృష్టించ‌డం విధ్వంస‌మా?  వాటిని ప్రైవేటుకి దారాద‌త్తం చేయ‌డం విధ్వంస‌మా? చ‌ంద్ర‌బాబు స‌మాధానం చెప్పాలి. చంద్ర‌బాబే రాష్ట్రాన్ని అభివృద్ధి నుంచి విధ్వంసం వైపు విజ‌య‌వంతంగా తీసుకెళ్తున్నాడు. 

జువ్వ‌ల‌దిన్నెలో జ‌గ‌న్ పిలుపుతో చంద్ర‌బాబులో వ‌ణుకు 
జువ్వ‌ల‌దిన్నెలో వైయ‌స్ జ‌గ‌న్ గారు ఇచ్చిన పిలుపు చంద్ర‌బాబుకి వ‌ణుకు పుట్టిస్తోంది. అందుకే శ్రీకాకుళంలో పెట్టాల్సిన మ‌హానాడుని నెల్లూరుకి మార్చేశాడు. వైయ‌స్ జ‌గ‌న్ గారు వ‌చ్చిన‌ప్పుడు మ‌త్స్య‌కారుల్లో ఉన్న ఉత్సాహం నేడు చంద్ర‌బాబు వ‌చ్చిన‌ప్పుడు వారిలో క‌నిపించ‌డం లేదు. జువ్వ‌ల‌దిన్నె ఫిషింగ్ హార్బ‌ర్‌తోపాటు రాష్ట్రంలోని ఇత‌ర పోర్టులు, హార్బ‌ర్ల విష‌యంలో చంద్ర‌బాబు స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేస్తార‌నుకుంటే నేరుగా చెప్ప‌కుండా ఫేక్ ప్ర‌చారాలు న‌మ్మ‌వ‌ద్ద‌ని పిలుపునివ్వ‌డం అంటే ఏమ‌ని అర్థం చేసుకోవాలి. బీచ్ రోడ్డులో సోలార్ ల్యాంప్ లు ప్రారంభించి సాగ‌ర మాల ప్రాజెక్టును ప్రారంభించాన‌ని కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడు అబ‌ద్ధాలు చెబుతున్నాడు. స్టీల్ బెంచీలు, సోలార్ ల్యాంప్‌లు వేసి ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టాల‌నుకోవ‌డం కేంద్ర మంత్రిగా ఆయ‌న‌కు త‌గ‌దు. విభ‌జ‌న చ‌ట్టం ప్రకారం శ్రీకాకుళం జిల్లాకు రావాల్సిన పెట్రో కెమిక‌ల్ రిఫైన‌రీ ప్రాజెక్ట‌ను సాధించుకురావాలి. సిమెంట్ రోడ్ల శంకుస్ధాప‌న‌లు చేయ‌డం కేంద్ర‌మంత్రి చేయాల్సిన ప‌నా?   అని మాజీ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు విమ‌ర్శించారు.

Back to Top