2018 ..వైయ‌స్ఆర్‌సీపీ పోరాటనామ సంవత్సరం

ప్రతిపక్ష పార్టీగా వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీకి, ప్రతిపక్ష నేతగా వైయస్ జగన్‌మోహ‌న్‌రెడ్డికి 2018 ఎంతో ముఖ్యమైన సంవత్సరం. ఎన్నికలకు సమీపంలో ఉన్న ఏడాది, ప్రభుత్వ వైఫల్యాలపై నిరంతర పోరాటాలను ఉధృతం చేసిన ఏడాది, ప్రజాసంకల్పయాత్ర జన హృదయాలను తాకుతూ వేలాది కిలోమీటర్ల మైలురాళ్లను అధిగమించిన ఏడాది, ప్రజారంజక పాలనకు పట్టం కట్టేందుకు ప్రజలు నిర్ణయం తీసుకున్న ఏడాది. ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకున్న 2018వ సంవ‌త్స‌రంపై ప్ర‌త్యేక‌ కథనం. 

 

బాబుతో హోదాకు జైకొట్టించిన ప్రతిపక్ష నేత

ప్రత్యేక హోదా కోసం వైయస్ జగన్ మోహన్ రెడ్డి జరిపిన రాజీలేని పోరాటం ఎన్నో ఫలితాలనిచ్చింది.  ప్రజల్లో హోదాపై అవగాహన, చైతన్యం పెరిగాయి. హోదా ఏమైనా సంజీవనా అంటూ ప్యాకేజీ పాట పాడిన చంద్రబాబుతో హోదాకి జై కొట్టించారు ప్రతిపక్ష నేత. ఇది ప్రతిపక్ష నాయకుడి విజయం. 

 

ఉవ్వెత్తున ప్రత్యేక హోదా ఉద్యమం

వంచనపై గర్జన ద్వారా దిల్లీలో ప్రత్యేక హోదా సాధన కోసం చేసిన పోరాటం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. అందరి దృష్టినీ రాష్ట్రం వైపు మళ్లించింది. ఆసమయంలో ప్రతిపక్ష నేతలను అరెస్టులు చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా కాండిల్ ర్యాలీలు జరిగాయి. వామపక్షాల బందుకు మద్దతు ఇస్తూ, అఖిలపక్షాలతో కలిసి నిరసనలు జరిపింది వైసీపీ. అన్ని జిల్లాల్లో హోదా విషయంలో వంచించిన కేంద్ర, రాష్ట్రాలకు వ్యతిరేకంగా వంచనపై గర్జన సభలు నిర్వహించడం జరిగింది.  హోదాకోసం పార్లమెంట్ లో పోరాడేందుకు ఎంపీలను సిద్ధం కమ్మన్నారు వైఎస్ జగన్. పార్లమెంట్ లో ఎంపీలు ఆందోళనలు, నిరసనలతో హోదా ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో ప్రస్తావించారు. 

 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ  సమరం

హోదా సాధన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడింది వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ . కేంద్రంపై అవిశ్వాసానికి రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వాన్ని కలిసి రమ్మని కోరింది. కానీ హోదాపై చిత్త శుద్ధి లేని ప్రభుత్వాన్ని విడిచి పార్లమెంట్ లో మద్దతు కూడగట్టుకుంటూ ఎన్డీయే ప్రభుత్వంపై అవిశ్వాసం అస్త్రాన్ని సంధించింది. ఇది ప్రభుత్వాన్ని పడగొట్టేంత బలం లేకున్నా హోదా ఆకాంక్షల ఏపీ ప్రజల్లో ఎంతగానో ఉందన్న విషయాన్ని దేశానికి చాటిచెప్పినట్లైంది. హోదా కోసం ఎందాకైనా అంటూ వైసీపీ తమ 5గురు ఎంపీలతో రాజీనామాలు సమర్పించి, దిల్లీ నడిబొడ్డునే ఆమరణ నిరాహారదీక్షకు పూనుకుంది. ఏడురోజుల నిరవధిక నిరాహారదీక్షకు మద్దతుగా, రాష్ట్రంలో టీడీపీ సర్కారుకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. 

 

ప్రజాసంకల్ప యాత్రలో నమోదైన కీలక ఘట్టాలు

ప్రజాసంకల్పయాత్రలో వేయి, రెండువేలు, మూడువేల కిలోమీటర్ల మైలురాళ్లకు వేదిక అయ్యింది 2018. యువనేత జనహృదయనేతగా ఎదిగిన వైనాన్ని ప్రపంచానికి చాటింది. అతడి అడుగడుగూ జన ప్రభంజనమని నిరూపించింది. యువనేతకు అండగా నాయకులు సైతం సంఘీభావ పాదయాత్రలు జరిపారు. వైఎస్ జగన్ స్ఫూర్తితో ప్రాజెక్టుల కోసం మరికొందరు నేతలు పాదయాత్రలు చేసారు. ప్రపంచంలో ఇంత ఎక్కువ సమయం ప్రజలతో మమేకమైన పాదయాత్ర లేదు. ఇన్ని రోజుల పాటు నడిచిన నాయకుడు లేడు. ఇదో సరికొత్త రికార్డు. 

 

ప్రజాపక్షాన పోరాటాలు

అగ్రిగోల్డు బాధితుల పోరాటానికి బాసటగా నిలిచి నిరవధిక దీక్షలకు వెన్నుదన్నుగా నిలుస్తోంది వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ . దాచేపల్లి మైనర్ బాలికపై అత్యాచారం ఘటనలో బాధితురాలి పక్షాన నిలిచి, ప్రభ్త్వుం కదిలేలా చేసింది వైయస్సార్ కాంగ్రెస్. గుంటూరు జిల్లాలో టీడీపీ నేత యరపతినేని అక్రమమైనింగ్ వ్యవహారాలను బట్టబయలు చేసారు వైసీపీ నేతలు. నిజనిర్థారణ కమిటీగా మైనింగ్ ప్రాంతాన్ని పర్యటిస్తామని ప్రకటించగానే ఉలిక్కిపడ్డ ప్రభుత్వం వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులను ముందస్తు అరెస్టులు చేసి, నిజాలను బయటకు రాకుండా చేయాలని విశ్వప్రయత్నం చేసింది. హైకోర్టు జోక్యంతో అక్రమ మైనింగ్ వ్యవహారాలకు అడ్డుకట్టపడేలా పోరాటం చేసిందివైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ . మరోపక్కా ప్రాంతీయ సమస్యలపై వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ నిరసనలు కొనసాగించారు. వెలిగొండ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని కోరుతూ వైవీ సుబ్బారెడ్డి పాదయాత్ర చేసారు. నారాహమారా చంద్రబాబు మైనారిటీ సభలో 8 మంది ముస్లిం యువకులను ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపినందుకు వేధించడంపై మైనారిటీ విభాగం నేతలతో కలిసి పోలీసులకు ఫిర్యాదులు అందించింది వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ . ఫీజు రీయంబర్సు మెంట్ పై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ వైయస్సార్సీపీ విద్యార్థివిభాగం రాష్ట్రవ్యాప్తంగా ఫీజుపోరు ర్యాలీలునిర్వహించింది. ఓటర్ల జాబితాలోని అవకతవకలపైనా వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎలక్షన్ కమీషన్ కు ఫిర్యాదులు అందించారు. ఆశా వర్కర్లు, డిటిపి ఆపరేటర్లు, డ్వాక్రా సంఘాలు, చేనేతలు, మత్స్యకారులు, రైతులు, కూలీలు ఇలా అన్ని వర్గాల వారి తరఫునా నిలిచి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టిందివైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ . ప్రకృతి విపత్తులు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన సమయంలోనూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించి కోట్లాదిరూపాయిల విరాళాలను అందించారు. కార్యకర్తలను సుశిక్షితులైన సైనికుల్లా సాయానికి పంపించారు. ప్రతిపక్ష నాయకులు సైతం బాధితుల వెన్నంటి ఉండి ధైర్యం అందించారు. 

 

హత్యారాజకీయాలు

ఇదే ఏడాది అక్టోబర్ నెలలో ప్రజాసంకల్పయాత్ర నుంచి హైదరాబాద్ కు వస్తున్న  వైయ‌స్ జగన్ పై విశాఖ ఎయర్పోర్టులో హత్యాయత్నం జరిగింది. దేశవ్యాప్తంగా ఇది సంచలనం అయ్యింది. టీడీపీకి చెందిన ప్రముఖ నేతకు చెందిన ఫుడ్ కోర్టులో పనిచేసే శ్రీనివాస్ కోడిపందేలకు ఉపయోగించే కత్తితో వైయస్ జగన్ పై హత్యాయత్నానికి ఒడిగట్టాడు. ఆయుధాలను విమానాశ్రయంలోకి ఎలా అనుమతించారో, విఐపి లాంజ్ లోకి సాధారణ ఉద్యోగిని ఎలా పంపించారో, హత్యాయత్నం జరిగిన కొద్ది నిమిషాల్లో ఏపీ డీజీపీ ఇది జగన్ అభిమాని చర్య అని ఎలా నిర్ధారించారో అంతా మిస్టరీగా సాగింది. జగన్ హత్యాయత్నాన్ని నీరుగార్చే ప్రయత్నం చేసిన రాష్ట్రప్రభుత్వాన్ని హైకోర్టు చివాట్లు పెట్టింది. హత్యాప్రయత్నం పై న్యాయవిచారణ, దర్యాప్తూ రాష్ట్ర పరిధిలో లేని సంస్థల ద్వారా చేయించాలని వైయస్ జగన్ ఇంకా వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కోర్టును కోరాయి. 

2018 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కొత్త అధ్యాయాలకు నాందీ ప్రస్తావన చేసింది. ఓ పక్క చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతుండగా, ప్రతిపక్షనేత వైయస్ జగన్ పై ప్రజల్లో అంతులేని ఆదరణ పెరిగింది. రాజకీయ మనుగడ కోసం టీడీపీ అధినేత కాంగ్రెస్ పంచన చేరాల్సిన దుస్థితి వచ్చింది. పొరుగు తెలుగు రాష్ట్రమైన తెలంగాణాలో టీడీపీకి దారుణ ఓటమిని రుచి చూపించి, చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతానికి తగిన శాస్తిని చేసింది 2018. యువ నాయకత్వానికి, నవ నాయకత్వానికి ఏపీ ప్రజలు పట్టం కట్టబోతున్నారనే సూచనలను దేశానికి అందించింది 2018వ సంవ‌త్స‌రం.

Back to Top