వెల్లివిరిసిన సామాజిక చైతన్యం 

రాజోలు నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సు యాత్ర 

భారీగా తరలి వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు 

  అమలాపురం: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో సామాజిక సాధికార నినాదం మార్మోగింది. శుక్రవారం మలికిపురం ప్రధాన రహదారి నుంచి వైయ‌స్ఆర్‌సీపీ నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్రకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వీరితో ప్రధాన రహదారి నిండిపోయింది.
 
ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యువకులు మోటార్‌ సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. తమకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను గుర్తు చేసుకుంటూ ‘జై జగన్‌.. జైవైయ‌స్ఆర్‌సీపీ’ నినాదాలతో హోరెత్తించారు. వీరికి స్థానిక ప్రజలు జేజేలు పలికారు. అనంతరం జరిగిన సామాజిక సాధికార సంభ జన సంద్రాన్ని తలపించింది. 

హోదా పెంచారు : మోపిదేవి 
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాధికారంలో పెద్ద పీట వేయడం ద్వారా ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి గౌరవం ఇచ్చారని, సమాజంలో హోదాను పెంచారని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ తెలిపారు. తనతో పాటు బీదా మస్తాన్‌రావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆర్‌.కృష్ణయ్యలను రాజ్యసభకు పంపించారంటే బీసీల పట్ల వైయ‌స్ జగన్‌కు ఉన్న ప్రేమను అర్థం చేసుకోవాలన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఎస్సీ, ఎస్టీ, బీసీ. మైనార్టీలకు అధికారంలో సముచిత స్థానం ఇచ్చిన ఏకైక సీఎం వైఎస్‌ జగన్‌ అని చెప్పారు. అంబేడ్కర్, పూలే కన్న కలలను సీఎం జగన్‌ నిజం చేశారన్నారు.  

సామాజిక విప్లవం: మంత్రి విశ్వరూప్‌ 
సీఎం జగన్‌ హయాంలో రాష్ట్రంలో సామాజిక విప్లవం వచ్చిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ అన్నారు. మహిళలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాధికారంలో అధిక ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. సంక్షేమ కార్యక్రమాల ద్వారా బడుగు, బలహీన వర్గాలు   ఆర్థి కంగా ఉన్నత స్థితికి ఎదిగేందుకు తోడ్పడ్డారన్నారు.

సమాజంలో బడుగు, బలహీన వర్గాలు ఉన్నత స్థితికి రావాలంటే చదువుతోనే సాధ్యమని జగన్‌ సంపూర్ణంగా విశ్వసించారని, అందుకే నాడు–నేడులో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించారని తెలిపారు. అమ్మ ఒడి పథకం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లోనే నేరుగా నగదు జమ చేస్తున్నారన్నారు.  ఇచ్చిన మాటకు కట్టుబడి పింఛన్‌ కానుకను రూ.2 వేల నుంచి రూ.3 వేలకు పెంచారని చెప్పారు.  

పేదల పక్షాన సీఎం వైయ‌స్‌ జగన్‌ ఒక్కరే : మంత్రి చెల్లుబోయిన వేణు 
రాష్ట్రంలో పేద వర్గాల పక్షాన నిలబడింది సీఎం వైయ‌స్‌ జగన్‌ ఒక్కరేనని, ప్రతి సంక్షేమ పథకం లబ్ధిని పేదలు, మధ్యతరగతి వర్గాలకు అందజేస్తున్నారని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను బానిసలుగా చూసిన చంద్రబాబుకు, ఈ వర్గాల వారిని అందలం ఎక్కించిన జగన్‌కు మధ్య పాలనను బేరీజు వేసుకుని, వచ్చి ఎన్నికల్లో తీర్పు ఇవ్వా­లని కోరారు.

ఎస్సీ, ఎస్టీ,  బీసీ, మైనార్టీలకు ఈ ప్రభుత్వంలో జరుగుతున్న మేలును చూసి చంద్రబాబు,  రామోజీరావు, రాధాకృష్ణ, టీవీ5 నాయుడు ఓర్చుకోలేక, నిత్యం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ యాత్రలో ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్‌ తదితరులు పాల్గొన్నారు.

Back to Top