విమానాశ్రయంపై విమర్శల వెల్లువ

భోగాపురం విమానాశ్రయం చుట్టూ చిక్కులు
15వేల ఎకరాల భూసమీకరణ యత్నాలపై విమర్శలు
చంద్రబాబు భూ దాహంపై నిరసనలు
విమానాశ్రయం మాకొద్దంటున్న రైతులు
 విజయనగరం: విశాఖపట్నం-విజయనగరం సరిహద్దుల్లో ఉన్న భోగాపురం కు కష్టం వచ్చి పడింది. అక్కడ ఏర్పాటు చేయతలపెట్టిన గ్రీన్ పీల్డ్ ఎయిర్ పోర్టుకు వ్యతిరేకంగా రైతులు, కూలీలు, స్థానికులు ఉద్యమ బాట పట్టారు. ఒకటి, రెండు కాదు ఏకంగా 15వేల ఎకరాల పంట పొలాల్ని లాక్కొని విమానాశ్రయం కట్టాలన్న  ప్రతిపాదనలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
నేపథ్యం:
విశాఖపట్నం విమానాశ్రయాన్ని విస్తరించాలన్న ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. ముఖ్యంగా ఇక్కడ విమానాశ్రయాన్ని ప్రయాణికుల అవసరాలతో పాటు ఈ ప్రాంతానికి గేట్ వే చేయాలన్న ప్రతిపాదన ఉంది. అటు రాష్ట్రం మొత్తం మీద నౌకాశ్రయానికి ఆనుకొని ఉన్న ఏకైక విమానాశ్రయం కావటంతో దీన్ని సరకు రవాణా కోసం తీర్చి దిద్దితే విస్తరణ సాధ్యమన్న మాట ఉంది. దీంతో విమానాశ్రయాన్ని అదే ప్రాంతంలో అభివృద్ది చేయటం కన్నా వేరొక చోట విస్తరించటం మేలన్న అభిప్రాయం వ్యక్తం అయింది. దీంతో నగరానికి నలు వైపులా అన్వేషించాక భోగాపురాన్ని ఎంపిక చేశారు.
 
వివాదం:
ఇంత వరకు బాగానే ఉంది కానీ విమానాశ్రయం కోసం 15వేల ఎకరాల భూముల్ని లాక్కొనేందుకు ప్రయత్నించటం వివాదానికి కేంద్రంగా మారింది. ఇంతటి భూమిని లాక్కొనే ప్రయత్నాల్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా ఈ మండలంలో 28 వేల ఎకరాల మేర భూములు ఉంటే వీటిలో సగానికి పైగా అంటే 15 వేల ఎకరాల్ని లాగేసుకోవటాన్ని అంతా వ్యతిరేకిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తప్ప ఇతర ప్రధాన పార్టీలన్నీ దీన్ని తప్పు పడుతున్నాయి. దాదాపు 150 గ్రామాల రైతులు నష్ట పోతుండటంతో ప్రజలంతా ఏకం అవుతున్నారు.
 
భూసమీకరణ భూతం
రైతుల గొంతు నొక్కేందుకు ఇక్కడ కూడా చంద్రబాబు ప్రభుత్వం భూ సమీకరణ మార్గాన్ని అనుసరిస్తోంది. ప్రస్తుతం ఉన్న భూ సేకరణ చట్టం కింద భూమిని సేకరించాలంటే అనేక నిబంధనలు ఉండటం, నష్ట పరిహారం అధికంగా ఉండటంతో ఈ మార్గాన్ని ఎంచుకొన్నట్లు తెలుస్తోంది. భూ సమీకరణ మంత్రంతో ఎకరాల కొద్దీ భూమిని తీసేసుకొని, కొన్ని గజాల స్థలాన్ని విదిలిద్దామని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు రైతుల్ని సమాయత్త పరిచే బాధ్యతను స్థానిక తెలుగుదేశం క్యాడర్ కు అప్పగించారు. దీంతో అధికార యంత్రాంగం కన్నా పచ్చ చొక్కాల హడావుడి బాగా పెరిగింది. రాజధాని లో భూముల సమీకరణ చేయించిన పచ్చ చొక్కా నేతలకు అధినేత దగ్గర బాగా మార్కులు పడటంతో, ఇక్కడ కూడా మార్కులు కొట్టేసేందుకు ప్రయత్నాలు బాగా ముమ్మరం అయ్యాయి.
 
ఇంత భూమి అవసరమా..!
విశాఖ పట్నంలో విమానాశ్రయానికి ఇంత భూమి అవసరమా అన్న ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది. ముంబైలాంటి పెద్ద నగరంలోనే కేవలం రెండు వేల ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం ఉండటం, చెన్నైలో అయితే 12 వందల ఎకరాల్లోనే అంతర్జాతీయ విమానాశ్రయం ఉండటం, కొచ్చిన్ లో కేవ లం 8 వందల ఎకరాల్లోనే అంతర్జాతీయ విమానాశ్రయం ఉండటాన్ని గుర్తు చేస్తున్నారు. అటువంటప్పుడు ఇక్కడ 15వేల ఎకరాల మేర భూముల్ని సమీకరించటం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇక్కడ సేకరించే భూముల్లో సర్కారు మార్కు రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుందన్న వాదన వినిపిస్తోంది. ఈ రియల్ ఎస్టే ట్ వ్యాపారం కోసం బడుగు రైతుల నుంచి భూముల్ని లాక్కొనేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న మాట వినిపిస్తోంది. అందుకే ఎవరు ఎంత చెప్పినా బలవంతంగా భూముల్ని లాక్కొంటున్నారన్న మాట ఉంది.
 
ఉద్యమించిన వైఎస్సార్‌సీపీ
స్థానికులకు జరుగుతున్న అన్యాయంపై మొదటగా ఉద్యమించింది వైఎస్సార్‌సీపీ నే . విమానాశ్రయం పేరుతో వేలాది ఎకరాల భూమిని స్వాధీనం చేసుకొనే ప్రయత్నాలపై ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఈజిల్లాకు చెందిన ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు, అఖిలపక్షం నాయకుడు కాకర్లపూడి శ్రీనివాస రాజు, ఇతర సీనియర్ నేతల సారథ్యంలో ఉద్యమ బావుటా ఎగుర వేశారు. తెలుగుదేశం మినహా ఇతర ప్రధాన పార్టీల నేతలు, కార్యకర్తల్ని కూడగట్టుకొని ప్రజాందోళనలకు శ్రీకారం చుట్టారు. అధికార పక్షం హడావుడితో అల్లాడిపోతున్న రైతులకు ధైర్యాన్ని నూరిపోస్తూ ఆందోళన్ని వేగవంతం చేశారు. రక రకాల మార్గాల్లో ఆందోళన కార్యక్రమాల్ని చేపట్టారు.
 
వైఎస్ జగన్ మార్గనిర్దేశనంతో..!
ఇటీవల విజయనగరం జిల్లా పర్యటనకు వ చ్చిన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఈ అంశం మీద అందుబాటులో ఉన్న నేతలతో సమావేశం అయ్యారు. ఉత్తరాంధ్ర జిల్లాల ఎమ్ ఎల్ ఎ లు, సీనియర్‌నేతలతో కమిటీ ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు.  బాధిత ప్రాంతాల్లో కమిటీపర్యటించి, రైతులు, కూలీలతో మాట్లాడాలని ఆయన అన్నారు. రైతుల ఇబ్బందులపై నివేదిక రూపొందించి, దాని ప్రకారం ఉద్యమాన్ని ముందుకు తీసుకొని వెళ్లాలని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా అఖిల పక్షం నేతల అభిప్రాయాల్ని ఆయన తీసుకొన్నారు. బాధిత రైతుల పక్షాన పోరాటం చేయాలని ఆయన అన్నారు. 

రైతుల భూములు లాక్కోవటమే ధర్మమా..! -వైఎస్ జగ న్ సూటి ప్రశ్న
భోగాపురం లో ఎయిర్ పోర్టు కోసం 15వేల ఎకరాలు లాక్కోవాలని ప్రయత్నించటం ఎంత వరకు ధర్మం. ఇది రైతుల పొట్ట కొట్టడమే. ప్రభుత్వానిది దిక్కుమాలిన ఆలోచన.
విమానాశ్రయం కోసం ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారు.  రైతుల్ని కంగారు పెడుతున్నారు. . చెన్నైలో అంతర్జాతీయ విమానాశ్రయం 12వందల 83 ఎకరాల్లో , కొచ్చిన్ లో అంతర్జాతీయ విమానాశ్రయం 800 ఎకరాల్లో , ముంబై లో  రెండు వేల ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నాయి.  విశాఖపట్నం ఎయిర్ పోర్టులో అంత రద్దీ కూడా ఉండదు.  అది చాలదు అనుకొంటే, అక్కడ విస్తరించటానికి ఉన్న అవకాశాల్ని పరిశీలించాలి. ఒక వేళ వేరే చోటకు వెళ్లాలనుకొన్నప్పుడు దానికి ప్రాతిపదికలు చూసుకోవాలి. 
భోగాపురం అంటే భీమిలీకి ఐదు కిలోమీటర్లు, అంటే విశాఖ నగరానికి పాతిక కిలోమీటర్ల దూరం ఉంటుంది.  ఇక్కడ ఎకరా రెండు కోట్ల రూపాయిల దాకా పలుకుతుంది. లాండ్ పూలింగ్ పేరుతో అక్కడ ఉన్న భూముల్ని లాక్కొంటే రైతులంతా ఎక్కడకు పోవాలి? వెయ్యి గజాల స్థలం ఇస్తామంటే ఎలా కుదురుతుంది..? ఇది రైతుల కడుపు కొట్టడమే..! విమానాశ్రయం నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతులకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది. ప్రభుత్వం అన్ని విధాలా ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తోంది.  ల్యాండ్ పూలింగ్ పేరుతో ప్రజల్ని అస్తవ్యస్త పరిస్థితుల్లోకి నెట్టడం ఎంత వరకు సమంజసం..! 
Back to Top