అనంతలో దద్దరిల్లిన యువభేరి

ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు…అది సాధించుకునేదాకా పోరాడుదాం. చెముడుతో వినలేకపోతున్న పాలకుల కర్ణభేరులు బద్దలయ్యేలా యువ భేరిని మోగిద్దాం అన్న వైయ్యస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపుకు యువజనం ఉప్పెనై కదలి వచ్చారు. కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్ర ఇలా ఎక్కడ యువభేరి మోగించినా ప్రతిధ్వనించేందుకు యువతరం కదం తొక్కుతూ జగన్ వెంట నడిచింది. రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇస్తామని నమ్మి మోసగించిన పాలకుల గుండెల్లో యుద్ధభేరీలు మోగించింది అనంతపురంలోని నేటి యువభేరి. 

ప్రతిపక్షం అధికార పక్షం కలిసి రాష్ట్రాన్ని విడగొడుతూ, హోదా ఇస్తామని పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చారు. ఎన్నికలైపోయాయి. ప్రజలతో పనైపోయింది కాబట్టి, ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినియా అని అడుగుతున్నాడు చంద్రబాబు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన మాటే పట్టించుకోకుండా పోతే... ప్రజాస్వామ్యంలో వీళ్లు చేసిన మోసాలకు ఎవరిని ప్రశ్నించాలి? ప్రత్యేక హోదా పోరాటానికి కొనసాగింపే ఈ యువభేరి అన్నారు యువనేత. 

ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదాకోసం నిరాహారదీక్ష చేసారు వైయ్యస్ జగన్ మోహన్ రెడ్డి. మోడీ వస్తున్నారని తెలిసి జగన్ దీక్షన్ బలవంతంగా భగ్నం చేశారు. ఇస్తామన్న హోదా ఏదని మోడీని అడగాల్సింది పోయి, అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. రెండుసార్లు బంద్ కి పిలుపునిస్తే... బాబు దగ్గరుండి బస్సులు నడిపించారు. పదిహేనేళ్లు హోదా కావాలన్న నాయకులే, హోదాకి వెన్నుపోటు పొడిచి ప్యాకేజి పాట పాడుతున్నారు.

దేశంలో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే రెండవ ప్రాంతం అనంతపురం జిల్లా. రాష్ట్రంలో అతి పెద్ద జిల్లా అనంతపురం. అత్యధికంగా ప్రజలు వలసపోతున్న జిల్లా కూడా అనంతపురమే. అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నజిల్లా కూడా ఇదే. పార్లమెంటులో మాట ఇచ్చినట్టుగా అప్పడే ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే... ఇప్పటికే లక్షల ఉద్యోగాలు మన దగ్గరకు వచ్చేవి.  చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం వస్తుందన్న నమ్మకం పూర్తిగా పోయిన ఈ పరిస్థితుల్లో... హోదా ఇచ్చి ఉంటే.. ఉద్యోగం నా జిల్లాకే వస్తుంది, నా దగ్గరకే వస్తుందనే ధీమా యువతలో కలిగేది. మూడున్నర సంవత్సరాలుగా హోదా ఇవ్వకుండా చెబుతున్న అబద్ధాలు, మోసాలు కారణంగానే ఈ పోరాటం కొనసాగుతుంది.

మూడేళ్ల క్రితం బాబు ఇచ్చిన హామీలు:
అనంతపురానికి సెంట్రల్ యూనివర్సిటీ తెస్తానన్నాడు
ఎయిమ్స్ కి అనుబంధ కేంద్రం ఏర్పాటు చేస్తానన్నారు. కానీ ఇక్కడ ఉన్న హాస్సిటల్స్ లో ఎమెర్జెన్సీ వార్డులో కూడా వైద్యానికి దిక్కులేదు.
నూతన పారిశ్రామిక నగరం నిర్మాణం చేస్తానన్నాడు
స్మార్ట్ సిటీగా చేస్తానన్నాడు
బెంగళూరు చెన్నై కారిడార్ ఏర్పాటు చేసి అందులో హిందూపురం కూడా కలుపుతానన్నాడు. కనీసం దానికి టెంకాయ కూడా కొట్టలేదు.
టెక్స్ టైల్ పార్క్ అన్నాడు, ఫుడ్ పార్క్ అన్నాడు, ఎలక్ట్రానిక్ హార్డ్ వేర్ క్లస్టర్ అన్నాడు.
అనంతపురంలో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అన్నాడు
పుట్టపర్తిని ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతాను అన్నాడు
విమాన నిర్వహణ, మరమ్మత్తుల కేంద్రం తెస్తానన్నాడు.
కుదిరేముఖ్ స్టీల్ ప్లాంట్ తెస్తానన్నాడు.
హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తిచేస్తానన్నాడు. పూర్తి చేయలేదు సరికదా.. గతంలోనే పూర్తయిన ఫేజ్ వన్ కి పిల్లకాలువ కూడా తవ్వలేకపోయాడు.
బాబు అధికారంలోకి రావడానికి ఎవరినైనా మోసం చేస్తాడు. ఎవరినైనా వెన్నుపోటు పొడుస్తాడు. అవసరానికి వాడుకోవడం... అవసరం తీరాక వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నైజం. హోదా తీసుకురావడం చంద్రబాబు కనీస కర్తవ్యం. అలాంటి బాబు తన స్వార్థం కోసం ప్రత్యేక హోదాను అమ్మేయడం అన్నింటికంటే బాధాకరమైన విషయం. హోదాను తీసుకురాలేకపోవడానికి కారణం 14వ ఆర్థికసంఘం అని సాకులు చెబుతున్నాడు బాబు. 14వ ఆర్థిక సంఘం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వలేదు కాబట్టి మనకు కూడా ఇవ్వలేదు అని బొంకుతున్నాడు. పైగా హోదా కంటే ప్యాకేజి వల్లే ఎక్కువ నిధులొస్తాయి అని కల్లబొల్లి కబుర్లు చెబుతున్నాడు. ఈ రెండూ పచ్చి అబద్ధాలే. పైగా మనకు హోదా లేదు ప్యాకేజి కూడా లేదు. 

11 రాష్ట్రాలు ప్రత్యేక హోదా కలిగి ఉన్నాయని రాజ్యసభ సాక్షిగా కేంద్ర ఆర్థికశాఖ చెప్పింది. ఈ రాష్ట్రాల జనాభా దేశ జనాభాలో 6.12శాతం. 2016-17 సంవత్సరానికి సంబంధించి అన్నిరాష్ట్రాల జనాభాకు లక్షా 32వేల 582 కోట్ల నిధులిచ్చింది. కేవలం ఏడున్నర కోట్ల జనాభా ఉన్న రాష్ట్రాలకు 14.06 శాతం నిధులిచ్చింది. 6.12 శాతం జనాభాకు ఈ నిధులిచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ జనాభా 4.93 కోట్లు. 4.08 శాతం జనాభా ఉన్నఇలాంటి రాష్ట్రానికి హోదా లేకపోవడం వల్ల వచ్చిన మొత్తం 44 వేల 743 కోట్లు. అదే ప్రత్యేక హోదా ఉండి ఉంటే 86 వేల 684 కోట్లు వచ్చి ఉండేది. హోదా లేకపోవడం వల్లే మన రాష్ట్రానికి ఈ నిష్పత్తి వర్తించలేదు. ఇలాంటి పరిస్థితిల్లో ఏ మొహం పెట్టుకొని చంద్రబాబు ప్యాకేజీవల్ల ఎక్కువ లాభం అని చెబుతాడు?

పిల్లలకు పరిక్షలు, సెలవులు, అడ్మిషన్ల కారణంగా కొంతకాలం యువభేరి కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరిగింది. ఇప్పుడు మళ్లీ యువభేరి మోగుతోంది. రాబోయే రోజుల్లో యువభేరి కార్యక్రమం నిర్వహించే బాధ్యత నియోజకవర్గాల నాయకులకే అప్పజెబుతానన్నారు ప్రతిపక్ష నేత. పాదయాత్ర ద్వారా ప్రత్యేక హోదాకు ప్రజల మద్ధతు ఇంకా కూడగట్టే ప్రయత్నం చేస్తానని యువభేరి సాక్షిగా మాటిచ్చారు. అవసరమైతే చివరి అస్త్రంగా ఎంపిల చేత రాజీనామా చేయిస్తానని కూడా తెలియజేసారు. జగన్ మాట్లాడితేనే ప్రత్యేకహోదా అనే పరిస్థితి మారాలి. ఒత్తిడి పెరగాలి. అందుకోసం మీ అందరి తోడ్సాటు కావాలి. అప్పుడే ప్రత్యేక హోదా మనం సాధించుకోగలుగుతాం అంటూ యువతకు పిలుపునిచ్చారు. హోదా అంటే ఏమిటి? అనేది ఎవరూ మర్చిపోకూడదని, హోదా అంటే మన ఉద్యోగాలు మన రాష్ట్రంలోనే, మన జిల్లాకే రావడం అనే సంగతి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు వైయస్ జగన్. 

తాజా వీడియోలు

Back to Top