మండే గుండెలపై రాజధాని కడతారా?

హైదరాబాద్: రాజధాని భూసమీకరణకు గడువు పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించడంపై రైతులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ప్రభుత్వ పొడిగింపు ప్రకటన రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్‌డీఏ) చట్టానికి విరుద్ధమని రైతుసంఘాలు ధ్వజమెత్తాయి. తమ భూములివ్వడానికి రైతులంతా విముఖత ప్రదర్శిస్తుంటే మరోవైపు భూసేకరణకు గడువు పొడిగింపు ప్రకటన ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నాయి. ఇలాంటి ప్రకటనలు రైతులను పరోక్షంగా బెదిరించేలా ఉన్నాయని విమర్శించారు.

నిబంధనల ప్రకారం నడుచుకోరా?

  • ‘‘సీఆర్‌డీఏ చట్టంలోని 9వ అధ్యాయం ల్యాండ్ పూలింగ్ అంశానికి చెందినది. అందులోని 55వ సెక్షన్‌లోని 4, 5, 6 నిబంధనల్లో పేర్కొన్న ప్రకారం నిర్ణీత గడువులోగా మాత్రమే భూసమీకరణ పూర్తి కావాలి. అది కూడా రైతుల ఇష్టపూర్వకంగానే జరగాలి
  • సెక్షన్ 56, 2వ నిబంధన ప్రకారం భూ సమీకరణకు అత్యధికంగా ఇచ్చిన గడువు 30 రోజులు. ల్యాండ్ పూలింగ్ పథకం నోటిఫికేషన్ నిబంధనలు కూడా ఇదే అంశాన్ని ధ్రువీకరిస్తున్నాయి. భూసమీకరణకు ప్రభుత్వం జనవరి 2 నుంచి 14వ తేదీ వరకు సమయానుకూలంగా ఆయా గ్రామాలకు వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇచ్చింది. నిబంధనల ప్రకారం ఈనెల 14తో గడువు ముగిసింది. తుది నోటిఫికేషన్ ఆధారంగా భూములిచ్చినా కూడా సీఆర్‌డీఏ అధికారులు మాత్రం పాత తేదీలతో అంటే జనవరి 2 నుంచి ఫిబ్రవరి రెండు లోపు ఇచ్చినట్టే రికార్డుల్లో రాస్తున్నారు
  • గడువు ముగిసిన తర్వాత ఇచ్చిన ఒకరిద్దరికి కూడా పాత తేదీలే వేయడం గమనార్హం
  • ఇంతచేసినా ప్రభుత్వం అనుకున్న మేరకు భూసమీకరణ జరగకపోవడంతో నోటిఫికేషన్ గడువును పొడిగించారు
  • వాస్తవానికి ఇది సీఆర్‌డీఏ చట్టానికి, ల్యాండ్‌పూలింగ్ పథకంలో పేర్కొన్న నిబంధనలకు వ్యతిరేకం. ఇలా గడువు పెంచే అధికారం సీఆర్‌డీఏ అధికారులకు లేదు. ఒకవేళ పొడిగించాలనుకుంటే చట్టాన్నైనా మార్చాలి లేదంటే ఆర్డినెన్స్ అయినా తీసుకురావాలి. ల్యాండ్ పూలింగ్ స్కీంపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది’’ అని రైతు సంఘాలు పేర్కొన్నాయి


అధికారులు మొండిగా వ్యవహరిస్తున్నారు..!
దీనిపై రైతు సమాఖ్య నేత ఎం.శేషగిరిరావు మాట్లాడుతూ.. సీఆర్‌డీఏ బాధ్యులుగా ఉన్న ఐఏఎస్ అధికారులకు ఈ విషయం తెలిసి కూడా మొండిగా వ్యవహరిస్తున్నారని తప్పుపట్టారు. నోటిఫికేషన్ గడువు పొడిగింపుపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.  గడువు పొడిగింపు అన్యాయం, అక్రమం, చట్టవిరుద్ధమని ఏపీ రైతు సంఘం నేత కేవీవీ ప్రసాదరావు పేర్కొన్నారు. రైతుల నిరసనను గమనించి భూసమీకరణకు ముందుకు సాగవద్దని విజ్ఞప్తి చేశారు. భూసేకరణ చట్టం ప్రకారమే భూమిని సేకరించాలని మరో రైతు నాయకుడు వి.సుబ్బారావు డిమాండ్ చేశారు.

తాజా ఫోటోలు

Back to Top