ఓట్లు చీల్చానని ఒప్పుకున్న పవన్

 

 

నిజాలు నిప్పు కణికలు...ఎన్నాళ్లు వాటిని దాచి ఉంచాలని చూసినా ఏదో రోజు నిప్పులు కక్కుకుంటూ  బైటకొస్తాయి. అబద్ధాల గోడలను బద్దలుకొట్టేస్తాయి. ముసుగు తెరలను కాల్చి
మసి చేస్తాయి. పవన్
కళ్యాణ్ టిడిపికి సపోర్ట్ చేయకపోతే 2014 ఎన్నికల్లో
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ఉండేదని, జగనే సిఎమ్
అయ్యేవారని దేశమంతా సామాన్యుడి నుంచీ రాజకీయవేత్తల దాకా అందరూ అభిప్రాయపడ్డారు.
ఇన్నేల్ల తర్వాత అదే నిజాన్ని తన నోటితో స్వయంగా ఒప్పుకున్నారు పవన్
కళ్యాణ్. తాను టిడిపికి మద్దతు ఇవ్వకపోయినట్టైతే జగన్ అప్పుడు
గెలిచి సిఎమ్ అయ్యేవారని, టిడిపికి మద్దతిచ్చి తప్పు చేసానని
పశ్చాత్తాపం ప్రకటించారు పవన్. నేడు టిడిపి నాయకులు రాక్షసుల్లా
రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారని చెప్పుకొచ్చారు. కాపుల కంచుకోట
లాంటి పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన బహిరంగ సభలో పవన్ ఈ వాఖ్యలు చేయడం విశేషం.
ఓ బలమైన ప్రతిపక్షాన్ని ఓడించడానికి టిడిపికి జన సేన పార్టీ సాయపడిందనే
ధోరణిలో పవన్ ప్రసంగించారు.  

కాపు కుల ఓట్లను పవన్ ప్రభావితం చేసాడని రాజకీయ నిపుణులు 2014 ఎన్నికల తర్వాత బహిరంగంగానే
విశ్లేషించారు. చంద్రబాబు హామీలకు నేను
జవాబుదారీ అంటూ పవన్ కళ్యాణ్ చెప్పడం వల్లే పవన్ ఫాన్స్తో
పాటు,ఆ సామాజిక వర్గం టిడిపికి
ఓట్లు వేసింది. నిజానికి చంద్రబాబు
పవన్ కళ్యాణ్ రంగంలోకి దించిన ఉద్దేశ్యం కూడా ఇదే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూల పవనాలు
ఉన్నాయని తెలిసే పవన్ ను ఆ ఓట్లను టిడిపి వైపు మళ్లించే పావుగా ఉపయోగించాడు. ఇందుకు పవన్ ఒప్పుకోవడానికి
గల కారణాలను చాలా సందర్భాల్లో స్వయంగా ఆయనే ఒప్పుకోవడం కూడా మనం
చూసాం. గత
ఎన్నికల్లో తాను పోటీ చేయకుండా ఉండేందుకు టిడిపి అధినేత చంద్రబాబు రాజ్యసభ సీటు ఇస్తానని
హామీ ఇచ్చినట్టు బహిరంగంగానే చెప్పారు పవన్ కళ్యాణ్. ఇక ప్యాకేజీలు
భారీగా ముట్టినందునే పవన్ టిడిపికి అనుకూలంగా పనిచేసారని చాలామంది వాదించారు.
అందుకు తార్కాణంగా అమరావతికి కూతవేటు దూరంలో మంగళగిరిలో కారుచౌకగా ఇంటిస్థలాన్ని
పవన్ కళ్యాణ్ తెలుగు తమ్ముళ్ల నుంచి కొనుగోలు చేయడాన్ని చూపించారు. చంద్రబాబు ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల వరకూ పవన్ కళ్యాణ్
టిడిపి ప్రభుత్వాన్ని కానీ, ఆ పార్టీ నాయకుల అవినీతి,
అక్రమాలను కానీ ప్రశ్నించిన దాఖలాలు లేవు. అడపాదడపా
ట్విట్టర్లో తప్ప పవన్ బహిరంగంగా ఏనాడూ చంద్రబాబు అమానుష పాలనపై ప్రశ్నించలేదు.
ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ అంటూ చెప్పిన పవన్ టిడిపి విషయంలో ఆచితూచే
వ్యవహరించడం వారి మైత్రీ బంధాన్ని బహిరంగ పరిచింది. అయితే బాబు
అవినీతి, కుంభకోణాలు, భూదందాలు,
అక్రమాలపై నిరంతరం పోరాడుతున్న ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ ప్రజల్లో
నమ్మకాన్ని పెంచుకుంటోంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై,
ప్రత్యేక హోదాను కేంద్రంలో తాకట్టుపెట్టిన చంద్రబాబు వైఖరిపై ప్రతిపక్ష
నేత వైఎస్ జగన్ చేసే ప్రతికార్యక్రమానికి పోటీగా పవన్ కూడా సభలు పెట్టడం ప్రారంభించారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవరత్నాల ప్రకటన, ప్రజాసంకల్ప
యాత్ర ఆరంభాన్ని తెలుసుకున్న క్షణం నుంచీ పవన్ కళ్యాణ్ మరింత జోరుగా ప్రజల్లోకి వెళ్లేందుకు
ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైఎస్ జగన్ ను విమర్శించిన
పవన్, నేడు మాత్రం స్వయంగా కొన్ని నిజాలను బయట పెట్టారు.
టిడిపికి నాడు జన సేన చేసిన సపోర్టు వల్లే చంద్రబాబు అధికారంలోకి వచ్చారని,
నాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పడాల్సిన ఓట్లను చీల్చి వాటిని టిడిపికి
తాను మళ్లించడం వల్లే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారని ఒప్పుకున్నారు పవన్.

శంఖంలో పోస్తేనే తీర్థం అన్నట్టుగా ఈ విషయం గురించి
రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ బహిరంగంగానే తెలిసినా, ఆ నిజం
దానికి కారకుల నోటినుంచే బైటపడటం సంచలనానికి కారణం అయ్యింది. 

Back to Top