గెలిచే సత్తా లేక ఓటు రాజకీయం

  • మున్సిపల్‌ ఎన్నికల దృష్ట్యా అధికార పార్టీ అడ్డదారులు
  • వైయస్‌ఆర్‌సీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపు
  • వెంటాడుతున్న ఎన్నికల హామీలు
  • తప్పించుకునేందుకు మూడేళ్లుగా స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా
 ఎన్నికలు జరగాల్సిన ప్రాంతాలు:
కార్పొరేషన్లు: గ్రేటర్‌ విశాఖ, కాకినాడ, గుంటూరు, ఒంగోలు, కర్నూలు, తిరుపతి, శ్రీకాకుళం 
మున్సిపాలిటీలు: రాజాం, నెల్లిమర్ల, కందుకూరు, రాజంపేట  

 – గుంటూరు కార్పొరేషన్‌లో 4,81,544  మంది ఓటర్లు ఉండగా..ప్రస్తుతం ఏకంగా 1,22,223 ఓట్లను తొలగించారు. అంటే 25% ఓట్లు అన్న మాట. ఈ విషయం స్వయంగా చంద్రబాబు డ్యాష్‌ బోర్డులోనే పొందుపరిచారు. అయితే ఇన్ని ఓట్లు ఎందుకు తొలగించారన్న దానిపై మాత్రం ప్రభుత్వం నుంచి సమాధానం లేదు.

–కర్నూలు నగర పాలక సంస్థలో ఓటర్ల జాబితాను క్రమబద్ధీకరించేందుకు డోర్‌ టు డోర్‌ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా అధికార పార్టీ నేతల ఒత్తిళ్ల మేరకు 41,311 ఓట్లను తొలగించారు.

– ఒంగోలు  జిల్లాలో ఈ ఏడాది 1,33,898 మంది ఓటర్లు కొత్తగా పెరిగారు. మార్పు చేర్పుల్లో 73,121 మంది ఓట్లను తొలగించారు. ఓట్లు కోల్పోయిన వారిలో దాదాపు 40 వేల మంది వైయస్‌ఆర్‌ సీపీ సానుభూతిపరులు ఉన్నారు. 

ఎప్పుడో నిర్వహించాల్సిన ఎన్నికలపై అధికార పార్టీ వెనుకడుగు వేస్తోంది. అధికారంలోకి వచ్చింది మొదలు 2014 ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క వాగ్ధానాన్ని చంద్రబాబు నెరవేర్చలేదు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలంటే టీడీపీకి ఓటమి భయం పట్టుకుంది. ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించాల్సి రావడంతో అడ్డదారుల్లో అధికారం చేజిక్కించుకునేందుకు అధికార పార్టీ ఓటు రాజకీయాలు చేస్తోంది. రానున్న మున్సిపల్‌ ఎన్నికల్లో ఎలాగైనా పరువు నిలుపుకోవాలన్న తాపత్రయంతో ఉన్న టీడీపీ నాయకులు వైయస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ప్రభావాన్ని నిలువరించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఓటర్ల మనసు మార్చి తమవైపు ఎలాగూ తిప్పుకోలేమనుకున్న పచ్చపార్టీ అధికారులపై ఒత్తిడి తెచ్చి మరీ పెద్ద ఎత్తున  వైయస్‌ఆర్‌ సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారు. స్థానిక నాయకులు మున్సిపల్‌ కార్పొరేషన్‌ చుట్టూ తిరిగినా అధికారులు ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు. తొలగించినబడిన ఓట్లన్నీ వైయస్‌ఆర్‌సీపీవే.  వైయస్‌ఆర్‌సీపీకి  ఓటు బ్యాంకుగా ఉన్న కొన్ని సామాజికవర్గాలను టార్గెట్‌ చేసుకుని ఈ ఓట్లను తొలగించేశారు. ఈ ఓట్లు ఇలాగే ఉండిపోతే ఫలితాలు తారుమారు అవడం ఖాయం.

ఓటమి భయం
2014 సాధారణ ఎన్నికలకు ముందు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగినా వేర్వేరు కారణాల వల్ల ఏడు కార్పొరేషన్లకు, నాలుగు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగలేదు. ఏళ్ల తరబడి స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి కుంటుపడింది. గుంటూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 2010 సెప్టెంబరు 30 నుంచి ప్రత్యేక అధికారి పాలన కొనసాగుతోంది. గుంటూరుకు సమీపంలోని 8 గ్రామాల వీలీన ప్రక్రియపై ఇంకా కొంత అస్పష్టత ఉంది. రాష్ట్రంలోని గుంటూరు, విశాఖపట్నం, కాకినాడ, కర్నూలు, ఒంగోలు, తిరుపతి, శ్రీకాకుళం కార్పొరేషన్లకు ఎన్నికలు జరగాల్సి ఉంది.  రాష్ట్రంలో 2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటి వరకూ ఎన్నికలకు వెళ్లలేదు. 


హామీలకు తూట్లు
ఎన్నికలకు ముందు చంద్రబాబు అమలుకు సాధ్యంకాని హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా ప్రధాన హామీలకు తూట్లు పొడిచారు. దీంతో ప్రజల ముందుకు వెళ్లే దమ్మూ, ధైర్యం ప్రభుత్వానికి లేదు. పైగా పథకాల పేరుతో పచ్చ నేతలు కోట్లాది రూపాయలు దండుకుంటూ అవినీతికి పాల్పడుతున్నారు. అర్హులకు అందాల్సిన సంక్షేమ పథకాలు పచ్చ నేతల జేబుల్లోకి వెళ్తున్నాయి. రాజ్యాంగ విరుద్ధంగా ఏర్పడిన జన్మభూమి కమిటీలకు పెత్తనం కట్టబెట్టడంతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నగర ప్రాంతాల్లో ఏ ఒక్కరికీ కొత్తగా పింఛన్లు మంజూరు చేయలేదు. పక్కా గృహాలు, ఇళ్ల స్థలాలు మంజూరు చేయలేదు. దీంతో టీడీపీ నేతలపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్లాలంటే అధికార పార్టీకి గుబులు పుట్టుకుంది. ఎలాగైనా గెలవాలన్న తపనతో వైయస్‌ఆర్‌సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించేందుకు ప్లాన్‌ రూపొందించారు. ఇందులో భాగంగా ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఓట్ల తొలగింపునకు శ్రీకారం చుట్టారు.

ఇప్పట్లో ఎన్నికలు లేనట్లే
ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న స్థానిక సంస్థలకు ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశాలు కన్పించడం లేదు. రాష్ట్రంలో నాలుగు మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరగాల్సి ఉంది. 2014లో ఎన్నికలు జరగకుండా నిలిచిపోయిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికల నిర్వహణలో జాప్యం అనివార్యంగా కన్పిస్తోంది. ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి ముసాయిదా ఈనెల 31న విడుదల చేస్తారు. ఈనెల 31 నుంచి నవంబర్‌ 30 వరకూ ఓటర్ల జాబితాల్లో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పిస్తారు. అనంతరం అభ్యంతరాలు స్వీకరిస్తారు. అభ్యంతరాలు, మార్పులు, చేర్పులతో కూడిన జాబితాలను డిసెంబరు 15 నాటికి ముసాయిదా జాబితాల ప్రకటిస్తారు. వీటిని కంప్యూటరీకరించి జనవరి 14న తుది జాబితా విడుదల చేస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే నవంబరు, డిసెంబరు నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్లు వస్తాయని చెబుతూ వస్తున్న మంత్రుల ప్రకటనలు ఇప్పట్లో ఆచరణ సాధ్యం కాదు. జనవరి 15 తరువాత రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు స్థానిక సంస్థల నుంచి ఓటర్ల జాబితా చేరిన తరువాత ఎన్నికల ప్రక్రియ ప్రారంభించడానికి కనీసం నెల రోజుల సమయం పడుతుంది. దీని ప్రకారం ఫిబ్రవరి 15 తరువాత ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసే అవకాశం ఉంది. అలాగే వార్డుల పునర్విభజన లేదా పునర్‌ వ్యవస్థీకరణ కూడా ప్రకటించాల్సి ఉంది. వార్డులు, లేక డివిజన్ల రిజర్వేషన్లు కూడా ప్రకటించాల్సి ఉంది.

ఓట్ల తొలగింపునకు పైరవీలు..
ఓట్ల తొలగింపునకు అధికార నేతలు పైరవీలు ప్రారంభించారు. క్షేత్రస్థాయిల్లో సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. కొత్త ఓట్ల చేర్పులు, మార్పులు, తొలగింపులపై అధికార యంత్రాంగానికి భారీగా దరఖాస్తులు అందాయి.  వీటిపై ఇంటింటి విచారణ చేపట్టిన అధికారులు తప్పుల్లేని ఓటర్ల జాబితా ప్రచురించాల్సి ఉంది.  బోగస్‌ ఓట్లు గుర్తించడం, అర్హులైన వారికి ఓటు హక్కు దక్కేలా కృషి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. అయితే అధికార యంత్రాం గంపై రాజకీయ నేతల ఒత్తిళ్లు అధికంగా ఉన్నా యి.  విచారణ చేస్తున్న సిబ్బందిపై హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో భారీగా ఓట్లు నమోదు చేయించడం అధికార పార్టీ నేతలకే చెల్లింది. బోగస్‌ ఓట్లు అలాగే ఉంచి అర్హులైన వారి ఓట్లు తొలగించారు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే తొలగింపులు చేశారు.

టీడీపీ నేతల ఒత్తిళ్ల మేరకే 
తెలుగుదేశం పార్టీ నేతల  ఒత్తిళ్ల మేరకే గుంటూరు కార్పొరేషన్‌లో ఓట్లు తొలగించారని, ఓట్ల తొలగింపులో పారదర్శకత లోపించిందని, ఏ ప్రతిపాదికన ఓట్లు తొలగించారో స్పష్టత ఇవ్వాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ డిమాండ్‌ చేస్తోంది. ఓట్ల తొలగింపుపై వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి గుంటూరు నగర కమిషనర్‌ నాగలక్షి్మని కలిసి ఫిర్యాదు చేశారు. రానున్న కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఓటమి భయంతో వైయస్‌ఆర్‌సీపీకి పట్టున్న ప్రాంతాల్లో ఓట్లు తొలగించారంటూ   ధ్వజమెత్తారు. అర్హత కలిగిన ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కు ఓటు అన్నారు. గతంలో డీలిమిటేషన్‌ ప్రక్రియలో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం పారదర్శకతను పక్కన పెట్టిన తరుణంలో జరిగిన అన్యాయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే అక్షింతలు వేసిన విషయాన్ని గుర్తు చేశారు. గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. అధికార నేతలకు తలొగ్గి, వారి మెప్పుకోసం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే అధికారులపై కూడా న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వస్తుందని హెచ్చరించారు. 
 

తాజా వీడియోలు

Back to Top