వానలో తడుస్తూ.. బురదలో నడుస్తూ..

ఉరవకొండ: మరో ప్రజా ప్రస్థానం.. జన సముద్రం నడుమ ఎగిసిపడుతున్న అభిమానపుటలలను దాటుకుంటూ పయనిస్తోంది. ఆ అలల ప్రభావం అలా వ్యాపిస్తూనే ఉంది. మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన వైయస్ షర్మిల శుక్రవారం ఉదయం 10.15 గంటలకు పాదయాత్ర ప్రారంభించారు. పెన్న అహోబిలం మీదుగా మధ్యాహ్నం 12.15కు కోనాపురం క్రాస్‌రోడ్డుకు ఆమె చేరుకుంది. మధ్యాహ్న భోజనానికి అక్కడే విశ్రమించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి వర్షం ఏకధాటిగా కురిసింది. ఇదేదీ ఆమె దీక్షను భగ్నం చేయలేకపోయింది. వర్షంలోనే మధ్యాహ్నం 3 గంటలకు షర్మిల యాత్రకు తిరిగి బయలుదేరారు. కోనాపురం మీదుగా ఉరవకొండకు చేరుకునే దారి అది. కోనాపురం, షేక్షానిపల్లి మీదుగా దాదాపు 6 కిలోమీటర్లు మొత్తం అడుగు తీసి అడుగు వేయలేనంత బురద. అందులపోనే ఆమె అడుగులేశారు. అంత వర్షంలోనూ కోనాపురం, షేక్షానిపల్లి ప్రజలు షర్మిలకు ఘనస్వాగతం పలికారు. షేక్షానిపల్లిలో షర్మిల మాట్లాడుతూ ‘వాన పడుతోంది కాబట్టి నాకు అర్థమైంది. ఈ రోడ్డుపై మీరు ఎన్ని కష్టాలు పడుతున్నారో.. జగనన్న సీఎం అయ్యాక మీకు రోడ్డు, బస్సులు వచ్చేలా చేస్తాం..’ అని హామీ ఇచ్చారు. సాయంత్రం 5.30కు లత్తవరం వద్ద రాత్రి బసకు చేరుకున్నారు. శుక్రవారంనాటి పాదయాత్రలో ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, గురునాథరెడ్డి, కాపు రాంచంద్రారెడ్డి, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి పాల్గొన్నారు. ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, సీజీసీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి కాసేపు నడిచారు. పార్టీ నేతలు రోజా, వాసిరెడ్డి పద్మ, ఉరవకొండ నియోజకవర్గ ఇన్‌చార్జి విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజు తదితరులు యాత్రలో పాల్గొన్నారు. శుక్రవారం మొత్తం 12.30 కిలోమీటర్ల పాదయాత్ర సాగింది.

Back to Top