- రాష్ట్రంలో విజృంభిస్తున్న స్వైన్‌ఫ్లూ- ఉలుకు పలుకు లేని సర్కార్- ఆరోగ్యశాఖను పక్కన పెట్టుకొని చోద్యం చూస్తున్న చంద్రబాబు- ధర్మ పోరాట దీక్షలు, ఢిల్లీ పర్యటనలతో సీఎం బిజీ- 15 రోజుల వ్యవధిలో కర్నూలు జిల్లాలో 12 మంది మృత్యువాత- కానరాని నివారణ చర్యలుఅమరావతి: రాష్ట్రంలో పాలన గాడి తప్పింది. స్వైన్ ఫ్లూ విజృంభించడంతో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. కొత్త రోగాలతో ప్రజలు అల్లాడుతుంటే..ఆరోగ్య శాఖ అడ్రస్ కరువైంది. స్వైన్‌ఫ్లూ కారణంగా ఒక్క కర్నూలు జిల్లాలో అధికారికంగా 15 రోజుల వ్యవధిలో 12 మంది మృత్యువాడ పడినా సర్కార్‌లో చలనం లేదు. ఎంతో మంది వ్యాధి బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా వారికి ధైర్యం ఇచ్చే నాథుడు కరువయ్యాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనను పక్కన పెట్టి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు ఢిల్లీ పర్యటనలకు బయలుదేరారు. అంతేకాకుండా పార్టీని కాపాడుకునేందుకు ధర్మ పోరాట దీక్షలు అంటు నాటకాలు మొదలుపెట్టారు. వైద్యమో నారాయణ అంటూ ప్రజలు ఆర్తనాధాలు చేస్తున్నారు.
హడలెత్తిస్తున్న కొత్త రోగం..2010–11 ప్రాంతంలో స్వైన్‌ఫ్లూ అంటే అదో కొత్త రోగం. అప్పట్లో మీడియాలో సైతం ఈ వ్యాధిపై విస్తృతంగాప్రచారం జరిగింది. ఈ కారణంగా అప్పట్లో ఎక్కడ చూసినా ప్రజలు నోటికి మాస్క్‌లు ధరించి లేదా చేతిరుమాలు అడ్డుగా పెట్టుకుని తిరిగేవారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. రోజూ కొన్ని కేసులు బయటపడుతుండడం, అదే స్థాయిలో మరణాలు సంభవిస్తుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. తాజాగా కర్నూలు మండలం వెంగన్నబావి ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల యువకుడు, ప్యాపిలికి చెందిన 38 ఏళ్ల వ్యక్తి, ఆదోనికి చెందిన 54 ఏళ్ల వ్యక్తి ఈ వ్యాధితో చనిపోయారు. నెలరోజుల వ్యవధిలో 25 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదు కాగా..వీరిలో 12 మంది మృతిచెందడం ఆందోళన కల్గించే విషయం. ప్రస్తుతం 30 మంది కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. వ్యాధికి గురైన వారిలో నలుగురు మాత్రమే ఇతర జిల్లాలకు చెందిన వారున్నారు. మిగతా 21 మంది ఈ జిల్లా వారే. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ గోనెగండ్ల మండలంలో ఒకరు ఈ వ్యాధికి గురై మరణించారు. ఇవి కర్నూలు సర్వజన ఆసుపత్రిలో నమోదైన లెక్కలు మాత్రమే. స్వైన్‌ఫ్లూ ఉందంటే ఎక్కడ దూరం పెడతారేమోనని భయపడి చాలా మంది ప్రైవేటు నర్సింగ్‌హోమ్‌లలోని వైద్యుల వద్ద చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. కర్నూలు కొత్తబస్టాండ్ సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ముగ్గురు రోగులు చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. ఈ వ్యాధి నిర్ధారణ పరీక్షలు కేవలం కర్నూలు మెడికల్ కాలేజీలోని మైక్రోబయాలజీ విభాగంలో మాత్రమే ఉన్నా.. వ్యాధి లక్షణాలను బట్టి ప్రైవేటు ఆసుపత్రుల్లో రోగులకు చికిత్స అందిస్తున్నారు. స్వైన్‌ఫ్లూ పేరిట సాధారణ రోగులను కూడా భయపెట్టి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
వైద్య ఉద్యోగుల్లో ఆందోళనస్వైన్ఫ్లూ బారిన పడిన వారిలో ఇద్దరు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఉద్యోగులతో పాటు కర్నూలు మెడికల్ కాలేజీలో ఒకరు ఉన్నారు. వీరిలో ఒక్కరు మాత్రమే ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటుండగా.. మిగిలిన ఇద్దరు ఇంటి వద్దే ఉంటూ వైద్యుల సూచనల మేరకు వైద్యం అందుకుంటున్నారు. ఇక ఆసుపత్రిలో పది మంది స్వైన్‌ఫ్లూ రోగులు చికిత్స పొందుతున్నారు. కొందరు ఐసోలేషన్ విభాగంలో ఉండగా, మరికొందరు ఏఎంసీలో చికిత్స తీసుకుంటున్నారు. మరికొందరు వ్యాధి లక్షణాలతో జనరల్ వార్డుల్లోనే ఉన్నారు. రోగులు జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, ఊపిరి తీసుకోలేకపోవడం వంటి లక్షణాలతో బాధపడుతుంటే వైద్యసిబ్బందిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ లక్షణాలు కనిపించిన వారందరికీ ముక్కులో స్వైప్ ద్వారా గళ్లను తీసి పరీక్షకు పంపిస్తున్నారు. స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఉన్న వారి వద్దకు కొంత మంది వైద్యసిబ్బంది, నర్సులు వెళ్లేందుకు జంకుతున్నారు. ఆసుపత్రిలోని నాల్గవ తరగతి సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు, పారిశుద్ధ్య సిబ్బంది ద్వారా వారికి వైద్యసేవలు అందేలా పనిచేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మరో నలుగురికి స్వైన్‌ఫ్లూ కర్నూలు జిల్లాలో మరో నలుగురికి స్వైన్‌ఫ్లూ నిర్ధారణ అయ్యింది. పాములపాడు మండలం కంబలపల్లికి చెందిన క్రిష్ణమ్మ(38), పగిడ్యాలకు చెందిన శివరాజు(35), కర్నూలు కుమ్మరివీధికి చెందిన హర్షవర్దన్(3), కోడుమూరుకు చెందిన అనూష (28)కు స్వైన్‌ఫ్లూ సోకినట్లు వైద్యులు గుర్తించారు. మొదటి ముగ్గురు ఊపిరితిత్తుల్లో సమస్యతో ఇటీవల కర్నూలు సర్వజన ఆసుపత్రిలో చేరారు. అనుమానంతో వైద్యులు స్వైన్‌ఫ్లూ పరీక్ష చేయించారు. వ్యాధి సోకినట్లు మంగళవారం నిర్ధారణ అయ్యింది. అనూష హైదరాబాద్‌లో చికిత్స పొందుతోంది. ఈమెకు కూడా స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు అక్కడి వైద్యులు తేల్చారు. దీంతో బాధితుల సంఖ్య 36కు చేరుకుంది. వీరిలో ఇప్పటి వరకు 12 మంది మరణించారు.
వైయస్ఆర్‌సీపీ ఆందోళనకర్నూలు ప్రభుత్వాసుపత్రిలో గల వైద్య సదుపాయాలు, సౌకర్యాలపై వైయస్ఆర్‌సీపీ ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే 12 మంది చనిపోగా, మరికొంతమందికి వ్యాధి నిర్దారణ అయింది. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సదుపాయాలపై వైయస్ఆర్‌సీపీ నాయకులు ఆరా తీశారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం వల్లే స్వైన్‌ఫ్లూ మృతుల సంఖ్య పెరుగుతోందని ఎమ్మెల్యే గౌరు చరితా విమర్శించారు. పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బి వై రామయ్య, కర్నూలు, కోడుమూరు నియోజకవర్గాల సమన్వయకర్తలు హఫీజ్ ఖాన్, మురళీకృష్ణ ఆసుపత్రిని సందర్శించి రోగులను పరామర్శించారు. మందులు, ప్రత్యేక వార్డులు లేకపోవడంతో అసంతృప్తిని వ్యక్తం చేశారు.
నివారణ చర్యలేవిరాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంటే ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టడం లేదు. కర్నూలు జిల్లాలో డిప్యూటి ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, పర్యటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియా ఉన్నా ఎలాంటి చర్యలు లేవు. పైగా ఆరోగ్యశాఖను చంద్రబాబు తన వద్ద పెట్టుకున్నా..ఇంతవరకు స్వైన్‌ఫ్లూ మరణాలపై ఎలాంటి సమీక్షలు చేయలేదు. చర్యలు చేపట్టలేదు. ఈయనకు ప్రజల ప్రాణాల కంటే పక్క రాష్ట్రంలో ఎన్నికలే ముఖ్యమయ్యాయి. పొత్తుల కోసం వారంలో రెండు సార్లు ఢిల్లీ వెళ్లి రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. దీంతో ప్రజల గురించి పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. స్వైన్‌ఫ్లూపై ప్రజలను అప్రమత్తం చేస్తూ వైద్యశిబిరాలు ఏర్పాటు చేయడం, ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.