టిటిడి ఛైర్మన్ పదవి అంత చులకనా?

శ్రీవారి కొండ మీద ఆధ్యాత్మిక వాతావరణం తప్ప రాజకీయ వాతావరణం ఉండకూడదని భక్తులు కోరుకుంటారు. కానీ చంద్రబాబు మాత్రం ఆ కొండలరాయుడిపైనే పెత్తనం కోరుకుంటాడు. ఎన్నో సవాళ్లతో, పవిత్రతతో ఉండే టిటిడి ఛైర్మన్ పదవిని రాజకీయ క్రీడలో పావుగా ఉపయోగించుకోవడం చంద్రబాబుకు అలవాటైంది. అసంతృప్తులకు పదవుల సర్దుబాట్లలో టిటిడి ఛైర్మన్ పోస్టును పప్పుబెల్లం పంచినట్టు పంచేందుకు బాబు సిద్ధం అవుతున్నాడు. చివరకు బోర్డు సభ్యులను కూడా ముఖ్యమంత్రి తన అనుకూలురు,రాజకీయ నిరుద్యోగులకు వేదికగా మారుస్తున్నారు. 
తాజాగా గరుడ పురాణంతో ఫేమస్ అయిపోయిన శివాజీకి టిటిడి ఛైర్మన్ పదవిని ఇచ్చేలా చంద్రబాబు మాటిచ్చాడని ఆరోపణలు వస్తున్నాయి. చచ్చేలోపు నేను టిటిడి ఛైర్మన్ అవుతా అంటూ శివాజీ చెప్పడం దీనికి ఊతం ఇస్తోంది. ముఖ్యమంత్రి అలాంటి హామీ ఇవ్వకపోతే ఓ సాధారణ వ్యక్తికి టిటిడి ఛైర్మన్ పదవి ఎలా దక్కుతుంది. నేనో మామూలు మనిషిని అని చెప్పుకునే శివాజీ టిటిడి ఛైర్మన్ అవుతాను అని చెప్పుకోగలిగాడంటే ఎవరి అండతో, ఎవరి ప్రాపకంతో అవుతాడనే విషయాన్ని ఎవ్వరైనా తేలికగా అర్థం చేసుకోగలరు. 
అయితే ఈ ప్రతిష్టాత్మకమైన పదవి కోసం ఎంతోమంది ఉవ్విళ్లూరుతుంటారు. చంద్రబాబు చాలామందికి ఈ పదవిని ఆశచూపించే అసంతృప్తులను బుజ్జగించేవాడు. పార్టీమారతామనే వాళ్లకు ఈ పదవిని ఎరగా చూపి ఆపేవాడు. తీరా బాబును నమ్మి వారు తమ ప్రయత్నాలు విరమించుకున్నాక, బాబు చెప్పినట్టు విన్నాక వారికి ఇచ్చిన హామీకి నామం పెట్టేవాడు. గతంలో గాలి ముద్దు కృష్ణమ నాయుడుకు టిటిడి ఛైర్మన్ పదవి ఇస్తానని హామీ ఇచ్చాడు చంద్రబాబు. అంతకు చాన్నాళ్ల  ముందు నుంచి మురళీ మోహన్ కు ఆ ఆ పదవిని ఆశపెట్టాడు. ఈమధ్యకాలంలో కె.రాఘవేంద్రరావుకు కూడా ఛైర్మన్ పీఠం అనే ప్రచారం చేసాడు. తీరా చూస్తే ఎన్నో ఆరోపణలు ఎదుర్కుంటున్న పుట్టా సుధాకర్ కు ఆ పదవి కట్టబెట్టాడు. బాబు హయాంలో టిటిడి ఛైర్మన్ ఎంపిక ఎప్పుడూ విమర్శలు ఎదుర్కుంటూనే ఉంటుంది. 
వెంకన్న సన్నిధిని కూడా రాజకీయ క్రీడావేదిక చేసిన చంద్రబాబు తీరు చూసి భక్తులు ఆగ్రహంతో మండి పడుతున్నారు. బాబు తీరును తప్పుపట్టినందుకు స్వామివారి అర్చకులనే విధుల్లోంచి తీసేసి తన అహంకారం ప్రదర్శించాడు ముఖ్యమంత్రి చంద్రబాబు. మునుముందు కొండకు ఇంకెన్ని కష్టాలు వస్తాయో అని అయోమయానికి గురౌతున్నారు భక్తజనం. 

 
Back to Top