అంతా అక్రమమే!

– నరసరావుపేటలో టీడీపీ నేతల అక్రమ నిర్మాణాలు 
–పట్టించుకోని పురపాలక ప్రణాళిక అధికారులు
– నిబంధనల పేరుతో సామాన్యులకు ఇక్కట్లు 

గుంటూరు: అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ నేతలు చేస్తున్న ఆగడాలకు అంతే లేకుండా పోయింది. వారు చెప్పిందే వేదం..చేసిందే చట్టం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అధికారులను గుప్పిట్లో పెట్టుకొని అక్రమాలకు తెరలేపారు. వారు చేస్తే ఒప్పు..ఇతరులు చేస్తే తప్పు అన్నట్లుగా చిత్రీకరించి చట్టాలను మార్చి వేస్తున్నారు. జిల్లాలోని నరసరావుపేట పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకుల కనుసన్నల్లో అక్రమ కట్టడాలు యథేచ్చగా జరుగుతున్నాయి. టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు  తమ ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపడుతున్నా అడిగే నాథుడు కరువయ్యాడు. అదే ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారు, సామాన్య పౌరులు ఒకటీ, రెండు సెంట్లలో అదనంగా ఒక గది నిర్మాణం చేసుకున్నా వాటిని కూలగొట్టి వేధిస్తున్నారు. అన్నీ అనుమతులతో ఆన్‌లైన్‌లో ప్లాను పొంది అపార్టుమెంట్‌ లాంటి నిర్మాణాలు చేసుకుంటున్నా ఓర్వలేకపోతున్నారు. భవన నిర్మాణాలు కొనసాగాలంటే  ముడుపులు చెల్లించుకోవాలని అధికారులే వారిపై ఒత్తిడి చేస్తున్నారు. 

అక్రమ నిర్మాణాలన్నీ పచ్చ నేతలవే..
టీడీపీకి చెందిన ఓ కౌన్సిలర్‌ పాతూరు గీతామందిరంకు ఎదురుగా కేవలం 11 అడుగుల వేడల్పు స్థలంలో ఐదు అంతస్థులు నిర్మించి పూర్తిచేశాడు. ప్రస్తుతం ఆ భవనానికి రంగులు వేస్తున్నారు. మరో కౌన్సిలర్‌ పట్టణానికి ఆనుకొని వినుకొండ రోడ్డు ఎన్‌టీఆర్‌నగర్‌ సమీపంలో లింగంగుంట్ల పంచాయతీ పరిధిలో సుమారుగా ఉన్న 10 సెంట్ల స్థలంలో జీప్లస్‌ 5 నిర్మాణం చేపట్టాడు. శ్లాబులు మొత్తం పూర్తయి గోడలు పెట్టేదశకు చేరుకుంది. అలాగే 18వ వార్డు టీడీపీ నాయకుడు   పల్నాడు రోడ్డు, రెడ్డి కళాశాల జంక్షన్‌కు ఎదురుగా రోడ్డు, భవనాల శాఖ (ఆర్‌అండ్‌బి) స్థలాన్ని సైతం ఆక్రమించి నాలుగు సెంట్ల లోపు స్థలంలో ఐదు అంతస్థుల వాణిజ్య సముదాయం ఏడాదిగా నిర్మాణం జరుగుతుంది. ప్రకాష్‌నగర్‌లో రిక్షా సెంటర్‌ నుంచి ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లే దారిలో కేవలం నాలుగైదు సెంట్ల స్థలంలో 5 అంతస్థులతో రెండు భవనాలు నిర్మాణం జరిగాయి. త్వరలో అవి వాడుకలోకి రాబోతున్నాయి. ఇవి మొత్తం ఆన్‌లైన్‌ ద్వారా ప్లాన్‌ తీసుకున్నవే. అయితే అవి నిర్మాణం జరిగే స్థలాన్ని బట్టి జీ ప్లస్‌ ఒకటి లేదా రెండు, మూడింటికే అనుమతులు ఉన్నాయి. అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా పురపాలకశాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూస్తే ఒట్టు. 

అన్ని అనుమతులున్నా..
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులు, సామాన్య ప్రజలు అన్ని అనుమతులు పొంది నిర్మాణాలు చేపడుతున్నా..అధికారులు వేధింపులకు పాల్పడుతున్నారు.  ప్రకాష్‌నగర్‌లోని సెయింట్‌ జోసెఫ్‌ స్కూలుకు ఎదురువీధిలో ఓ మహిళ తన సెంటున్నర స్థలంలో అదనపు గది నిర్మాణం చేస్తుంటే..ఆమె టీడీపీ మద్దతుదారు కాదంటూ పురపాలకసంఘ అధికారులచే శ్లా్లబుకు రంధ్రాలు పెట్టించారు. కోర్డులో ఈ వ్యవహారం నలుగుతున్నా, ప్రభుత్వానికి ఫీజుచెల్లించి ఆన్‌లైన్‌లో తీసుకున్న ప్లాన్‌ ఉన్నా, సుమారు 15 అడుగుల స్థలం వదిలి అపార్టుమెంట్‌ నిర్మాణం చేపడుతున్నా అధికారులు వదలడం లేదు. భవిష్యత్‌లో రోడ్డు విస్తరణకు కావాల్సిన సర్టిఫికేట్‌ ఇవ్వలేదనే కారణం చూపించి రాజకీయకక్షతో రామిరెడ్డి నగర్‌లో నిర్మాణంలో ఉన్న ఐదు అంతస్థులు అపార్టుమెంట్‌పై దాడిచేసి నిర్ధాక్షిణ్యంగా గోడలు కూల్చి, శ్లాబుకు రంధ్రాలు పెట్టి పనికిరాకుండా చేయించారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా నిబంధనలకు అనుగుణంగా నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన అధికారులు అధికార పార్టీ ప్రాపకం, సొంత లాభం కోసం వ్యవహరించడం దారుణం. ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని సామాన్యులు శాపనార్థాలు పెడుతున్నారు.
Back to Top