విజయవాడ : అక్రమ ఇసుక మాఫియాను అడ్డుకొన్న మహిళా తహశీల్దార్ ను కష్టాలు తరముతూనే ఉన్నాయి. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకొనేందుకు ఆమె స్వయంగా ట్రాక్టర్లకు అడ్డంగా బైఠాయించి, అక్రమాలపై పోరాటం చేశారు. ఆ సమయంలో ఆమె మీద తెలుగుదేశం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దౌర్జన్యం చేయించి, ఇసుకలో ఈడ్పించిన ఘటన అప్పట్లో సంచలనం కలిగించింది. అయినా సరే, ప్రభుత్వం నుంచి ఆమెకు ఏమాత్రం అండ దొరకలేదు సరికదా, సీఎం క్యాంపు కార్యాలయానికి పిలిపించి బెదిరించి పంపించారు. ఎమ్మెల్యే చింతమనేని మీద ఈగ వాలకుండా చూసుకొన్నారు. చివరకు మంత్రివర్గం భేటీలో ఆమె దే తప్పని తేల్చేశారు.తాజాగా మహిళా తహశీల్దార్ వనజాక్షికి బెదిరింపు లేఖ వచ్చింది. 10 రోజుల్లో ఊరు విడిచి వెళ్లాలని లేదంటే చర్యలు తప్పవని బెదిరించారు. మిమ్మల్ని చంపేందుకు ఇంటి దగ్గర రెండు సార్లు రెక్కీ కూడా నిర్వహించామని ఒక లేఖలో హెచ్చరించారు. ఇసుక రీచ్ లో గొడవ పడిన కొద్ది రోజులకే చంపేయమని తమకు సుపారీ ఇచ్చారని ఆ లేఖలో పేర్కొన్నారు. దీంతో వనజాక్షి పోలీసుల్ని ఆశ్రయించారు. <br/>