పచ్చప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘన...!

గ్రామపంచాయతీ నిధులకు కత్తెర..!
రూ.500 కోట్లు కాజేసే ప్రయత్నం..!
మండిపడుతున్న వైఎస్సార్సీపీ సర్పంచ్ లు..!
భూముల దోపిడీ, సర్కారీ కొలువులకు కత్తెర, పేదల రేషన్ కార్డు తొలగింపు, ప్రాజెక్ట్  టెండర్లలో  గోల్ మాల్, ఇసుకమాఫియా ఇలా ప్రతి చోట పచ్చప్రభుత్వం తనదైన మార్క్ రాజకీయాలు చేస్తోంది. విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడుతూ  అరాచక పాలన సాగిస్తోంది. తాజాగా మరో అవినీతి బాగోతానికి తెరలేపింది. ప్రతిపక్ష పార్టీ సర్పంచ్ లున్న గ్రామపంచాయతీలపై చంద్రబాబు సర్కార్ పగబట్టింది. 73వ రాజ్యాంగ సవరణకు తూట్లు పొడుస్తూ కేంద్రం నుంచి వచ్చిన నిధులను దోచుకునేందుకు పన్నాగం పన్నింది. గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు మంజూరు చేసిన నిధుల ఖర్చుపై గ్రామపంచాయతీలకే అధికారం ఉంటుంది. కానీ, ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. 

ప్రతిపక్ష సర్పంచ్ లకు బెదిరింపులు...! 
రాష్ట్రంలో సగానికి పైగా గ్రామపంచాయతీల్లో వైఎస్సార్సీపీ అధికారంలో ఉంది. ఐతే, గ్రామాభివృద్ధి కోసం కేంద్రం నుంచి వచ్చిన నిధులను రాష్ట్రఖజానాకు మళ్లించేందుకు  ప్రతిపక్ష పార్టీని టార్గెట్ చేసింది.  మేం పనులు చేయిస్తాం నిధులిచ్చేయండి అంటూ దౌర్జన్యానికి దిగుతోంది. ఇందుకు అంగీకరించని సర్పంచ్ ల చెక్ పవర్ రద్దు చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతోంది. గతేడాది కేంద్రప్రభుత్వం రాష్ట్రంలోని 12,918 గ్రామాలకు రూ.1,744 కోట్లు మంజూరు చేసింది. ఐతే, వాటిలో రూ.500 కోట్లు లాక్కునేందుకు ప్రభుత్వం ఎత్తుగడ వేసింది. దీనిలో భాగంగానే ఇప్పటికే 600 కు పైగా గ్రామపంచాయతీల నుంచి విద్యుత్ బకాయిల పేరుతో వందలకోట్లు లాగేసుకుంది. 

కేంద్రనిధుల కోసం ఒత్తిడి..!
వైఎస్సార్సీపీ సర్పంచ్ లున్న గ్రామపంచాయతీల్లో నిధుల ఖర్చును  తమ ఆధీనంలోకి తీసుకొని..అభివృద్ధి పనులను అధికారపార్టీకి అనుకూలంగా ఉన్నవారితో చేయించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే కార్యక్రమాలకు చంద్రబాబు సర్కార్ మంగళం పాడేసింది. గ్రామపంచాయతీలు 50 శాతం నిధులిస్తేనే మిగిలిన 50 శాతం ఉపాధి హామీ పథకం ద్వారా ఆయా గ్రామాల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణానికి అనుమతివ్వాలంటూ జూన్ 18న  58 జీవోను జారీ చేసింది. ఈక్రమంలోనో ఆయా గ్రామాలపై తీర్మానాలు తీసుకునేందుకు ఒత్తిడి తీసుకొస్తోంది.  సర్కార్ నిర్ణయంపై వైఎస్సార్సీపీ సర్పంచ్ లు మండిపడుతున్నారు. 
Back to Top