సమైక్యతకు వామపక్షాల అండదండ కావాలి

వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షు‌డు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి శనివారం ఢిల్లీలో సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కార‌త్‌, సీపీఐ ప్రధాన కార్యదర్శి  సురవరం సుధాకర్‌రెడ్డిలను కలుసుకున్నారు. అత్యధిక శాతం ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా, ఏకపక్షంగా కేంద్ర ప్రభుత్వం తెస్తున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన బిల్లును వ్యతిరేకించి, సమైక్యాంధ్రప్రదేశ్ పోరాటానికి మద్దతు తెలపాలని కోరారు. వై‌యస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా శ్రీ జగన్మోహన్‌రెడ్డి ఇద్దరు లెఫ్టు నేతలకు రాసిన లేఖ పూర్తి పాఠం ఇదీ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు కాంగ్రె‌స్ పార్టీ మహా తొందరపడిపోతోంది. విభజనను వ్యతిరేకిస్తున్న అశేష రాష్ట్ర ప్రజల సెంటిమెంట్లకు చిల్లిగవ్వ విలువైనా ఇవ్వకుండా, పర్యవసానాల పట్టింపే లేకుండా రాజకీయ ప్రయోజనాల కోసం అది ఈ విభజనకు పాల్పడుతోంది.

మూడు నెలలకు పైబడి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ప్రజాగ్రహం ఒక ప్రభంజనంలా చెలరేగుతోంది. అయినా పట్టించుకోకుండా అధికారంలోని కాంగ్రె‌స్ పార్టీ రాష్ట్రాన్ని విభజించేందుకు తాను రూపొందించుకున్న పథకాలతో మొండిగా, ప్రమాదకరమైన వేగంతో ముందుకు సాగుతోంది.

రాష్ట్ర విభజన కోసం కాంగ్రె‌స్ ప్రవేశపెడుతున్న బిల్లు శ్రుతిమించిన కాంగ్రె‌స్ అధికార దురహంకార స్వభావానికి అద్దం పడుతోంది. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని వాంఛిస్తున్న 75 శాతం ప్రజల వాణిని అది ప్రతిబింబించడం లేదు. కాబట్టి నిజమైన సమాఖ్య భావనకు విరుద్ధమైన ఆ బిల్లును పార్లమెంటు ముందు ఉంచినప్పుడు మీ పార్టీ దాన్ని తిరస్కరించాలని కోరుతున్నాను.

ఏపీకి జరుగుతున్న ఈ అన్యాయానికి వ్యతిరేకంగా జాతీయ పార్టీలన్నీ నిలవాల్సిన సమయమిది. ఇది ఒక్క ఏపీకి సంబంధించిన సమస్య మాత్రమే కాదు. కాంగ్రె‌స్ ద్వంద్వ విధానాన్ని, తలబిరుసుతనాన్ని, ఆధిపత్య‌ వాదాన్ని నేడు తెలుగు ప్రజలు సవాలు చేస్తున్నారు. కాబట్టి  ప్రజాస్వామ్యంలోనూ, ప్రజాభీష్టంలోనూ విశ్వాసమున్న ప్రతి పార్టీ ఈ విభజనకు వ్యతిరేకంగా ప్రతిఘటనను చేపట్టాల్సి ఉంది.

ముందు ముందు కేంద్రంలో అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా ఇలా విభజన ఎత్తుగడలకు పాల్పడటానికి ఆంధ్రప్రదేశ్‌ను ఉదాహరణగా మారనివ్వకూడదు. కాబట్టి ప్రజాస్వామ్యానికి, విలువలతో కూడిన రాజకీయాలకు ప్రాధాన్యమిచ్చే రాజకీయ పార్టీలు ఈ సమస్యపై మౌన ప్రేక్షకులుగా మిగిలిపోకూడదు. ఎందుకంటే రేపు మరే రాష్ట్రంలోనైనా ఇదే పరిస్థితి పునరావృతం కావచ్చు.

సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉద్యమానికి పార్లమెంటులోనూ, బయటా కూడా మీ పార్టీ మద్దతుగా నిలవాలని, మా పోరాటానికి సంఘీభావ‌ం తెలపాలని కోరుతున్నాం. ఇది అధికార పార్టీకి కనువిప్పు కావాలి. మునుముందు‌ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి దుస్సాహసాలకు పాల్పడకుండా నివారించాల్సి ఉంది.

వైయస్ఆర్ మరణానంతర ఆంధ్రప్రదే‌శ్ పరిస్థితిని క్లుప్తంగా మీకు వివరించాల్సి ఉంది. రాష్ట్రం అరాచకపు గందరగోళంలో కూరుకుపోయింది, గత నాలుగున్నరేళ్లుగా పరిపాలన ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ప్రజలు అనేక కష్టనష్టాలను ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వపు ప్రజావ్యతిరేక విధానాలతో వారు విసిగి వేసారిపోయారు.

అధికార పార్టీ పట్ల వ్యతిరేకత మిన్నంటింది, ఆ పార్టీకి ఘోర పరాజయం తప్పదని తెలిసిపోతోంది. ప్రతి ఉప ఎన్నికలోనూ కాంగ్రె‌స్ అభ్యర్థులు ధరావతులు కోల్పోవడం లేక ఘోర పరాజయం పాలు కావడమే అందుకు తార్కాణం. కాంగ్రె‌స్‌ పార్టీ తన వైఫల్యాలను కప్పి పుచ్చుకోవాలనీ, కనీసం ఒక్క ప్రాంతంలోనైనా కొన్ని సీట్లు, ఓట్లు దక్కించుకోవాలనీ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి పరిస్థితిని ఇంత వరకు తెచ్చింది.

ప్రజాస్వామిక సంప్రదాయాల గురించి, ఒక రాష్ట్రాన్ని విభజించాల్సి వస్తే ఏ పరిస్థితుల్లో, ఏ పద్ధతిలో చేయాల్సి ఉంటుందనే విషయం గురించి ప్రజా జీవితంలో ఉన్న మీకు తెలిసే ఉంటుంది. జనాభాలో 75 శాతం ఈ విభజనను వ్యతిరేకిస్తున్నా కేంద్రం రాష్ట్ర విభజన దిశగా తన పథకాలతో ముందుకు సాగుతోంది. తద్వారా తన నియంతృత్వ పోకడలతో ప్రజాస్వామ్యాన్ని పునర్నిర్వచించాలని అది ప్రయత్నిస్తోంది.

ఒక్కసారి గతాన్ని కొంత గుర్తు చేసుకుంటే దేశానికి స్వాతంత్య్రం లభించిన తర్వాతి చరిత్రలో ఎన్నడూ ఇలాంటి రాష్ట్ర విభజన జరగలేదనే విషయం మీకే స్ఫురిస్తుందని భావిస్తున్నాను. అత్యుత్తమ ప్రజాస్వామిక సంప్రదాయాలన్నిటి నుంచి, మునుపటి  ఉదాహరణలన్నిటి నుంచి కాంగ్రెస్ వైదొలుగుతున్న ఈ సమయంలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చేస్తున్న మా పోరాటానికి మీరు మీ సహాయ సహకారాలను అందిస్తారని గట్టిగా విశ్వసిస్తున్నాను.

1905లో నాటి భారత వైస్రాయ్ లా‌ర్డు కర్జన్ చేసిన హేయమైన బెంగా‌ల్ విభజన, దానితో పాటూ బ్రిటి‌ష్ వారి విభజించి పాలించు భావజాలం తెలుగు ప్రజలకు నేడు తిరిగి జ్ఞప్తికి వస్తున్నాయి. నేడు అఖిల భారత కాంగ్రె‌స్ కమిటీ  అనుసరిస్తున్న సూత్రం కూడా అదే. దేశంలోని ప్రజాస్వామిక శక్తులన్నీ ఈ కింది విషయాలపై ఆలోచించాల్సి ఉంది.

1. కొన్ని ఓట్లను, సీట్లను సంపాదించుకోవడానికి కేంద్రం తనకు లభించిన అధికారాలను తన ఇష్టానుసారం అక్రమ లబ్ధిని పొందడానికి వాడుకోవచ్చా?
2. 2009 డి సెంబర్ 9న కేంద్రం రాష్ట్రాన్ని విభజించాలని ఏకపక్షంగా నిర్ణయించింది.‌ అది, కాంగ్రె‌స్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తన పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన కానుక అని ఆ పార్టీ పేర్కొంది. అలాంటి కొలబద్దతో రాష్ట్ర విభజనకు పాల్పడవచ్చా?

3. రాష్ట్రాలను విభజించే అధికారం కేంద్రానికి ఉన్నంత మాత్రాన నిర్దిష్టమైన ప్రాతిపదిక గానీ, సంబంధిత శాసనసభ ఆమోదం గానీ, హేతుబద్ధత గానీ లేకుండా ఇలా రాష్ట్రాన్ని విభజించవచ్చా? ఆంధ్రప్రదేశ్ 1955లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ (ఎస్సార్సీ) చేసిన సిఫారసుల మేరకు జరిగిన పునర్వ్యవస్థీకరణతో ఏర్పడిన భాషాప్రయుక్త రాష్ట్రమనే వాస్తవాన్ని కేంద్రం గుర్తించడం లేదు.

4. దేశంలోని చాలా ప్రాంతాల్లో ప్రత్యేక రాష్ట్రాలను కోరుతున్నారు. కొన్ని శాసనసభలు విభజనకు అనుకూలంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపాయి. అవన్నీ మూలనపడి ఉండగా సార్వత్రిక ఎన్నికలకు ఆరు నెలల ముందు ఏపీ విభజన కోసం మాత్రం కేంద్రం ఉరుకులు పరుగులు పెడుతోంది. ఎందుకు?
5. నేడు కేంద్రం ఇలా ఇష్టానుసారంగా పార్లమెంటు సాధారణ మెజారిటీతో ఏపీని విభజిస్తే, ముందు ముందు వచ్చే   ప్రభుత్వాలకు కూడా అదే నిరంకుశ పద్ధతి ఆనవాయితీగా మారదా?

6. రాష్ట్ర శాసనసభ ఆమోదం లేకుండానే కేంద్ర మంత్రివర్గం 2013 అక్టోబర్ 3న రాష్ట్ర విభజనకు నిర్ణయం ఎలా తీసుకోగలిగింది? అంతకు ముందు శ్రీకృష్ణ కమిష‌న్ నివేదిక... విభజనతో రాష్ట్రం నష్టపోతుందని సూచించింది. ఆ నివేదిక రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి ప్రథమ ప్రాధాన్యాన్ని ఇచ్చింది. దాన్ని దృష్టిలో ఉంచుకుంటే రాష్ట్ర విభజనపై కేబినె‌ట్ నో‌ట్‌కు ప్రాతిపదిక ఏమిటి? అది ఎలా సమంజసం?

1956లో నాటి ఆంధ్ర, హైదరాబాద్ రాష్ట్రాల రెండు శాసనసభలు విడి విడిగా సమావేశమై ఆంధ్రప్రదే‌శ్ రాష్ట్ర ఏర్పాటు తీర్మానాన్ని మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆమోదించాయి. హైదరాబా‌ద్ శాసనసభ మూడింట రెండు వంతుల మెజారిటీతో భాషాప్రయుక్త రాష్ట్రంగా విశాలాంధ్ర (ఆంధ్రప్రదేశ్) ఏర్పాటు తీర్మానాన్ని ఆమోదించింది. 174 మంది సభ్యులు‌ గల హైదరాబాద్ శాసనసభలో తీర్మానంపై ఓటింగ్‌లో పాల్గొన్నవారు 147 మంది. అందులో 103 మంది విశాలాంధ్ర (ఆంధ్రప్రదేశ్) ఏర్పాటుకు అంగీకరించారు.

విశాలాంధ్ర ఏర్పాటు కావాలన్న తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవించి నాటి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ బిడ్డ బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసి, ఆ తీర్మానం నెగ్గడానికి తోడ్పడ్డారు. అదేవిధంగా ఆంధ్ర శాసనసభ కూడా విశాలాంధ్ర తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. 1972లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ పార్లమెంటులో చేసిన ప్రసంగాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది (ఆ ప్రసంగం రాష్ట్ర ఐక్యతపై స్పష్టతను ఇచ్చేదిగా ఉంది).

‌ఇందిర ఇలా అన్నారు... ‘సమైక్య ఆంధ్రప్రదే‌శ్ కోసం దశాబ్దాల తరబడి తెలుగు ప్రజలు పోరాటం సాగించారంటే అందుకు ప్రేరణ బహుశా తెలుగువారి సుదీర్ఘ చరిత్రే కావాలి. ఈ సందర్భంగా నా వ్యక్తిగత అనుభవాన్ని చెప్పమంటారా? రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిష‌న్ నివేదికను బహిరంగ పరచటానికి ముందు నేను దక్షిణాదిన పర్యటించటం జరిగింది. దిక్కులు పిక్కటిల్లేలా నాడు మిన్నంటిన విశాలాంధ్ర నినాదాలు నేటికీ నా చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి... పాత హైదరాబాద్ రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలన్న కొందరి వాంఛను ఆనాడు జయించింది నిజానికి కలిసి ఉండాలనే తెలుగు ప్రజల ఆకాంక్షే’
నేటి కాంగ్రె‌స్ ప్రభుత్వ విధానం రెండవ ప్రపంచ యుద్ధ కాలం నాటి నాజీ భావజాలాన్ని పోలి ఉంది.

జర్మన్ తత్వవేత్త మార్టి‌న్ నీమోల్ల‌ర్ ఆనాడు పలికిన సుప్రసిద్ధమైన మాటలను గుర్తు చేసుకోవడం సందర్భోచితం.
'మొదట వాళ్లు కమ్యూనిస్టుల కోసం వచ్చారు. కమ్యూనిస్టును కాను కాబట్టి నేను
మాట్లాడ లేదు. ఆ తర్వాత వాళ్లు సోషలిస్టుల కోసం వచ్చారు, సోషలిస్టును కాను
కాబట్టి నేను మాట్లాడలేదు. ఆ తర్వాత వాళ్లు ట్రేడ్ ‌యూనియనిస్టుల కోసం
వచ్చారు,  ట్రేడ్ యూనియనిస్టును కాను కాబట్టి నేను మాట్లాడలేదు.‌ ఆ తర్వాత
వాళ్లు యూదుల కోసం వచ్చారు, యూదును కాను కాబట్టి నేను మాట్లాడలేదు.  ఆ
తర్వాత వాళ్లు కేథలిక్కుల కోసం వచ్చారు, కేథలిక్కును కాను కాబట్టి నేను
మాట్లాడలేదు. ఆ తర్వాత వాళ్లు నా కోసం వచ్చారు.  వెనుదిరిగి చూస్తే నా కోసం
మాట్లాడటానికి ఎవరూ మిగల్లేదు.'


కేంద్రం నేడు ఏపీకి చేస్తున్న ఈ అన్యాయంపై మేధావులు, ప్రజాస్వామిక సంస్థలు, రాజ్యాంగాన్ని గౌరవించేవారు మౌనం వహిస్తే, స్పందించకపోతే ఇదే అన్యాయం మరే రాష్ట్రానికైనా జరగొచ్చు. ప్రతి రాష్ట్రంలోనూ జరగొచ్చు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తమకు విజయావకాశాలు లేవనుకున్న ఏ రాష్ట్రాన్నయినా బలహీనపరచడానికి తన అధికారాలను ఇలా విచ్చలవిడిగా ప్రయోగిస్తుంది.

ఈ రాష్ట్రాలన్నీ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ప్రతిపాదనలను అనుసరించి భాషాప్రాతిపదికపై పునర్వ్యవస్థీకరించినవే. కాబట్టి ఒక రాష్ట్రాన్ని విభజించాలన్నా లేదా కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్నా రాష్ట్ర శాసనసభలోనూ, పార్లమెంటులోనూ కూడా మూడింట రెండు వంతుల మెజారిటీని తప్పనిసరి చేస్తూ రాజ్యాంగ సవరణను తేవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

3వ అధికరణకు సవరణను తేవడం రానున్న రోజుల్లో అవసరం. కాగా ఏపీ విభజన బిల్లును పార్లమెంటు ముందు ఎప్పుడు ఉంచితే అప్పుడు దాన్ని వ్యతిరేకించడం తక్షణ ఆవశ్యకత.

కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసే అధికారాలను కేంద్రానికి కల్పించే 3వ అధికరణకు సవరణ  తేవాల్సిన ఆవశ్యకతపై మా పార్టీ తయారుచేసిన సంక్షిప్తమైన నో‌ట్‌ను, ఏపీ రాష్ట్ర విభజన కోసం ఏర్పాటు చేసిన మంత్రుల బృందానికి మా పార్టీ సమర్పించిన లేఖ ప్రతిని కూడా ఈ లేఖకు జోడిస్తున్నాం. ఈ లేఖ మీకు మరింత స్పష్టతనిస్తుంది. ఏపీ విభజన ప్రతిపాదన వలన కలిగే దుష్ఫలితాల వివరాలు కూడా అందులో ఉన్నాయి.

ఇది అత్యంత కీలక సమయం. ప్రజాస్వామ్యం ఒక వంచనాత్మాక సౌధం వాకిట నిలిచిన సమయం. మనం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించి, దాని పవిత్రతను కాపాడాల్సి ఉంది. ప్రజాభీష్టమే విజయం సాధించాలి తప్ప కొందరు నేతల లెక్కలు కావు.

సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం సాగుతున్న పోరాటానికి సౌహార్ద్రతను ప్రకటించి, పార్లమెంటులో ఆ బిల్లును ఓడించాలని, ప్రజాస్వామ్య పరిరక్షణకు చేతులు కలపాలని మీ అందరినీ మరో మారు కోరుతున్నాను.

Back to Top