ఒక్కసారి జగన్‌ను ఆశ్వీరదించండి. ఒక్కసారి అవకాశం ఇవ్వండి

వైయ‌స్ఆర్‌సీపీ గౌర‌వాధ్య‌క్షురాలు వైయ‌స్ విజ‌య‌మ్మ‌

 

‘మనుషులను చూసే కొద్దీ... వాళ్ల బాధలను చూసే కొద్దీ... వాళ్ల కష్టాలను చూసే కొద్దీ తనలో ప్రేమను జగన్‌ రోజు రోజుకూ పెంచుకోగలుగుతున్నాడు. జగన్‌ చిన్నవాడై నందున అందరినీ అవ్వా, తాతా, అక్కా, చెల్లీ అని పిలుస్తాడు. ఎవరికి ఏ అవసరం వచ్చినా సొంత మనిషిలా ప్రేమను అందిస్తున్నాడు. ఒక భరోసా ఇస్తున్నాడు. ఆ భరోసా కోసం ఆ ఆప్యాయత చూపుతున్నాడు. అందుకనే తమవాడిలా భావిస్తున్నారు.’

 

‘ఒక నాయకుడ్ని నిలబెట్టింది ఓదార్పుయాత్ర.. పాదయాత్ర ఆ నాయకుడ్ని స్థిరపరిచింది. స్టేబుల్‌గా చేసింది. నవరత్నాలతో ఫలానిది చేస్తానని వాళ్లకు ధైర్యం కలిగించాడు. ఓదార్పునిస్తున్నాడు కాబట్టి వాళ్లు నమ్ముతున్నారు.’
    – వైఎస్‌ విజయమ్మ

ప్రశ్న: నమస్కారం విజయమ్మ గారు... మీకు ముందుగా అభినందనలు. ఇడుపులపాయలో పాదయాత్ర మొదలైనప్పుడు ఇలా పూర్తి అవుతుందని విశ్వాసంతో ఉన్నారా? ఇదివరకు మీరెలా ఫీలయ్యారు?
వైఎస్‌ విజయమ్మ: స్టార్ట్‌ చేసిన పనిని ఈ ఇంట్లో ఎవరూ పూర్తి చేయకుండా ఆపలేదు. జగన్‌ పూర్తి చేస్తాడనే నమ్మకం నాకు మొదటి రోజు నుంచే ఉంది.

ప్రశ్న: ఇప్పుడు గర్వంగా ఫీలవుతున్నారా... మీది పాదయాత్రల కుటుంబంగా మారిందా...? రాష్ట్ర స్థాయిలో గానీ దేశ స్థాయిలో గానీ బహుశా నాకు తెలిసి ఒకే కుటుంబం నుంచి ముగ్గురు ప్రముఖులు పాదయాత్ర చేసిన సందర్భం లేదు. మీరెలా ఫీలవుతున్నారు?
విజయమ్మ: ఒక ఇంట్లో ముగ్గురు పాదయాత్ర చేయడం నిజంగా చరిత్రలో ఎక్కడా ఉండదని అనుకుంటా. మహాత్మాగాంధీ చేశారు గానీ ఒకే ఇంట్లో ముగ్గురు చేయడం చరిత్రలో ఇదే తొలిసారి అనుకుంటా. ఈ పాదయాత్ర నిజంగా చరిత్రాత్మకం. ముగ్గురి లక్ష్యం కూడా ఒకటే ప్రజలతో కలిసి మమేకమవడం. ఒకటే గమ్యం.. ఒకటే లక్ష్యం.. ప్రజల కోసం ప్రజలతో ఉండాలనేదే.

ప్రశ్న: పాదయాత్ర ఆరంభించినప్పుడు నేను మా అబ్బాయిని ప్రజలకే అప్పగిస్తున్నా అని అన్నారుగా.. ఇప్పుడు ప్రజల్లో ఎలాంటి స్పందన ఈ పాదయాత్రలో చూశారు?
విజయమ్మ:వైఎస్సార్‌ సీపీ మొదటి ప్లీనరీలో జగన్‌ను నేను ప్రజలకు అప్పజెప్పడం జరిగింది. నా బిడ్డ కాదు ఇక మీ బిడ్డ.. జగన్‌ను మీ చేతుల్లో పెడుతున్నానని చెప్పి ప్రజలకు అప్పగించడం జరిగింది. ప్రజలు కూడా అదేవిధంగా ఆయన్ను అక్కున చేర్చుకున్నారు. ఓదార్పు యాత్ర అయినా పాదయాత్ర అయినా అదే అభిమానం చూపారు. ఇంట్లో వాళ్లంతా ఇన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారంటే ఇది పరుగు పందెం కాదు. ఇది ఇంత అని కొలమానం కూడా కాదు. ప్రజల్లో ఎంత మందితో కలిశాడు? ఎంతమందితో మమేకమయ్యాడు? వాళ్ల సమస్యలు విని ఎంతమందికి విశ్వాసం కలిగించాడు? అనేది ముఖ్యం.

ప్రశ్న: షర్మిల, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, జగన్‌ పాదయాత్రలకు మధ్య పోలిక గురించి ఎప్పుడైనా అనుకుంటుంటారా?
విజయమ్మ:ఒక్కొక్కరి పాదయాత్రలో ఒక్కో వైవిధ్యం ఉంది. రాజశేఖర్‌రెడ్డి గారు పాదయాత్ర చేసిన నాటి పరిస్థితులే ఇప్పుడు కూడా పునరావృతమై ప్రజలు అవే ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి జగన్‌ పాదయాత్ర చేయాల్సిన అవసరం వచ్చింది. కరువుతో ప్రజలు మగ్గిపోతున్నారు. చాలా మంది వలసలు పోతున్నారు. మైక్రో ఫైనాన్స్,  ఇతర సమస్యలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఎక్కడ చూసినా కష్టాల్లో కూరుకుపోయారు. కరెంటు బకాయిలు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. చంద్రబాబు ఏ హామీనీ అమలు చేయలేదు కాబట్టి జగన్‌ ప్రజల్లోకి  వెళ్లాడు.అసెంబ్లీలో తన వాణి వినిపించగలిగినంత వినిపించాడు. ఇది మనమంతా చూశాం.

ప్రశ్న: పాదయాత్రలో కొన్ని ఆశ్చర్యంగా అనిపిస్తాయి. వృద్ధులు ఏదైనా ఇబ్బందులు చెప్పుకునేందుకు వస్తే మనమైతే టచ్‌ చేయడానికి కూడా వెనుకాడతాం. ఆయన (జగన్‌) వారితో మమేకమై ఆప్యాయంగా మాట్లాడుతున్నారు. చాలా మందిని పరామర్శిస్తున్న తీరు అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. అనుకూలురా? వ్యతిరేకులా? అనే అంశంతో సంబంధం జగన్‌ ఇదంతా చేయగలుగుతున్నాడు. ఈ ఓర్పు, ఇలా డీల్‌ చేసే పద్ధతి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందని అనుకుంటున్నారు? 
విజయమ్మ:మనుషులను చూసే కొద్దీ... వాళ్ల బాధలను చూసే కొద్దీ... వాళ్ల కష్టాలను చూసే కొద్దీ తనలో ప్రేమను జగన్‌ రోజు రోజుకూ పెంచుకోగలుగుతున్నాడు. జగన్‌ చిన్నవాడైనందున అందరినీ అవ్వా, తాతా, అక్కా, చెల్లీ అని పిలుస్తాడు. ఎవరికి ఏ అవసరం వచ్చినా సొంత మనిషిలా ప్రేమను అందిస్తున్నాడు. ఒక భరోసా ఇస్తున్నాడు. ఆ భరోసా కోసం ఆ ఆప్యాయత చూపుతున్నాడు. అందుకనే తమవాడిలా భావిస్తున్నారు. అదే తరహాలో వాళ్లు కూడా అప్యాయత చూపుతున్నారు. 

ప్రశ్న: తల్లిగా ఎలా ఫీలవున్నారు. పాదయాత్ర కంప్లీట్‌ అవుతున్న తీరు...వీటన్నింటిపై.. 
విజయమ్మ: నిజంగా నేను జగన్‌ను చూసినప్పుడు ఇంతమంది ప్రజలకు ఓదార్పు కాగలుగుతున్నాడు. ఇంతమందికి ధైర్యం చెప్పగలుగుతున్నాడు అని సంతోషం అనిపిస్తుంది. 

ప్రశ్న: పాదయాత్రకు గండి కొట్టడానికి కూడా ప్రయత్నాలు జరిగాయంటారా?
విజయమ్మ: పాదయాత్రకు గండి కొట్టడానికి మధ్యలో రకరకాల నిందలు... మనిషిని ఎంత సాబటేజ్‌ చేయాలంటే అంత చేసే కార్యక్రమం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్లు. అలాంటి పరిస్థితుల్లో కూడా అన్నీ ఎదుర్కొంటూ ప్రజల మధ్యలోనే ఉన్నాడు.  అన్ని కాలాలు ప్రజల మధ్యలోనే గడిపాడు. ఎండా... వాన... అనకుండా తడుచుకుంటూ ముందుకు వెళ్లాడు. చెప్పాలంటే వాళ్ల నాన్న పోయినప్పటి నుండి తొమ్మిది సంవత్సరాలుగా జగన్‌ ఏ రోజూ ఇంట్లో ఉన్నది లేదు. ప్రజలు ఎదుర్కొనే ప్రతి సమస్యలోనూ, ప్రతి ఇబ్బందిలోనూ పాలు పంచుకుంటూనే ఉన్నాడు. సమైక్య ఉద్యమం, ప్రత్యేక హోదా, ప్రజల ఇతర సమస్యలపై రెండు రోజులు, మూడు రోజులు, ఏడు రోజులు దీక్షలు చేస్తూ తను కడుపు మాడ్చుకుంటూ ప్రజల కోసం ప్రజలతోనే ఉంటూ వచ్చాడు. 

ప్రశ్న: ఆ కేసు దర్యాప్తు తీరు సరిగా లేదు. ఎన్‌ఐఏకి అప్పగించాలని  చాలా పోరాటం జరిగిన తర్వాతా వచ్చిన ఆదేశాలపై సహకరించక పోవడం పట్ల మీరు ఎలా స్పందిస్తారు?
విజయమ్మ: వాళ్ల ప్లానింగ్‌ లేకపోతే సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆరోజు రాజశేఖర్‌రెడ్డి గారు ఆయన (చంద్రబాబు)పై అలిపిరిలో దాడి జరిగినప్పుడు వెళ్లి పరామర్శించి దేవుడు కాపాడాడు... గాడ్‌ గ్రేస్‌ అని చెప్పి ఆ తర్వాత ఆరోజు గాంధీ విగ్రహం వద్ద ధర్నా కూడా చేశారు. అలాంటి సంస్కృతి ఎక్కడ? ఇలాంటి సంస్కృతి ఎక్కడ? సంఘటన జరిగిన గంటలోనే డీజీపీ అలా మాట్లాడాల్సిన అవసరం ఏముంది...? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? నాకు బాధ అనిపిస్తుంది.. నవ్వు కూడా వస్తుంది ఆయన మాట్లాడుతుంటే. అందరూ ఖండిస్తుంటే, ఖండించేవారంతా తన  మీద దాడి చేస్తున్నారని మాట్లాడారు ఆయన (చంద్రబాబు) ఆ రోజు. బాధ్యత కలిగిన సీఎంగా ఉంటూ ఖండించకపోగా అలా మాట్లాడారు.

ప్రశ్న: కోడి కత్తి దాడి అని ఎద్దేవా చేస్తూ పత్రికల్లో రాయించడం, ఆయన మాట్లాడటం పట్ల మీరెలా ఫీలవుతున్నారు? 
విజయమ్మ: నేనైతే వారి విజ్ఞతకే వదిలేస్తా..

ప్రశ్న: మంచివారికి రాజకీయాల్లో అంతగా పనికి రాదని కూడా అంటుంటారు కదా...?
విజయమ్మ: మంచి.. మంచేనండీ. ఎక్కడున్నా మంచి మంచే. రాజశేఖరరెడ్డి గారు మంచి చేశారు కాబట్టే ఇన్ని కోట్ల మంది గుర్తుపెట్టుకోగలిగారు ఆయన్ను. ఆయనకు స్థానమిచ్చారు. ఈరోజు అందరి ఇళ్లల్లో దేవుడి పక్కన ఆయన ఫొటోలు పెట్టుకుని పూజలు చేస్తా ఉన్నారు. ఈరోజు పెళ్లి చేసుకుంటుంటే నేరుగా ఆయన ఫోటో ఎదుట కార్డు పెట్టేసి వస్తారు. అంతటి స్థానం ఆయనది. ఎప్పుడూ మంచికి మంచి ఉంటుందని నేననుకుంటా.

ప్రశ్న: రాజకీయాల్లో మంచితనం ఒక్కటే సరిపోతుందా? మీ ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న చంద్రబాబు రోజూ అబద్ధాలు ఆడతారని, మోసాలు చేస్తారని జగన్‌ లేదా వైఎస్సార్‌ సీపీ నేతలు విమర్శిస్తుంటారు. మరి అబద్ధాలు, మోసాలను ఎదుర్కోగలిగిన సత్తా ఉంటుందా మంచితనానికి?
విజయమ్మ: సత్యం ఎదుర్కొంటుంది. అంతిమ విజయం సత్యానిదే, నిజానిదే.

ప్రశ్న: అయినప్పటికీ ఆయన(చంద్రబాబు) పొత్తులు పెట్టుకోవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకున్నారు, మొన్నటి దాకా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఇప్పుడేమో పవన్‌కల్యాణ్‌ గారిని రమ్మంటున్నారు. మీకేమనిపిస్తోంది?
విజయమ్మ:ఎవరెవరు కలుస్తారు, ఎవరెవరు ఉంటారనేది వాళ్ల వాళ్ల ఇష్టాలను బట్టి ఉంటుంది. మనం చెప్పాల్సిన పనిలేదు. ప్రజలు గమనిస్తూ ఉంటారు. చంద్రబాబు మొన్నటి వరకు బీజేపీతో కలిసి ఉన్నారు. ప్రత్యేక హోదా అవసరం లేదన్నారు. ప్రధాన శత్రువుగా భావించిన కాంగ్రెస్‌తో కలిసి తెలంగాణాలో పోటీచేశారు.

ప్రశ్న: మీరెప్పుడైనా ఊహించారా ఈ పరిణామాన్ని? మీరంతా ఒకప్పుడు కాంగ్రెస్‌కు వెన్నుదన్నుగా ఉన్నారు. రాజశేఖరరెడ్డి గారు అంటేనే కాంగ్రెస్‌ అనే పరిస్థితి. ఇప్పుడేమో చంద్రబాబే కాంగ్రెస్‌లోకి వెళ్లి, తెలుగుదేశం కాంగ్రెస్‌లోకి వెళుతుందని, మీరేమో కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చి జగన్‌ గారు సొంత పార్టీ పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఏనాడైనా ఊహించారా?
విజయమ్మ: సంబంధాలైతే ఆయన(చంద్రబాబు)కు ఎప్పుడూ ఉన్నాయి కాంగ్రెస్‌తో.. అంతర్గత సంబంధాలు ఎప్పుడూ ఉండనే ఉన్నాయి. జగన్‌పై కేసులు పెట్టినప్పుడైనా, ఇంకోటైనా ఇవన్నీ కలిసే చేశారు. కలిసి రాసుకున్నారు. అంటే ఎందుకు చెబుతున్నానంటే కేసు వేసినప్పుడు ఎర్రన్నాయుడు, శంకర్రావు వేసింది సేమ్‌. కాబట్టి ఇంటర్నల్‌గా వాళ్లకు ఎప్పుడూ సంబంధాలు ఉన్నాయి. ఓపెన్‌గా ఇలా కలుస్తారని మాత్రం నేననుకోలేదు. ఇలా ఓపెన్‌గా కలవడానికి జగన్‌ పాదయాత్రే కారణమనుకుంటా అంతే. ఆ జనాన్ని చూసి, జగన్‌ పాదయాత్రను చూసే ఇది జరిగిందని నేననుకుంటా.

ప్రశ్న: పాదయాత్ర ప్రభావం ప్రజల్లో ఎలా ఉంటుందని మీరనుకుంటున్నారు. ప్రజల్లో పార్టీ విజయానికి ఏ రకంగా దోహదపడబోతోంది?
విజయమ్మ: ఒక నాయకుడ్ని నిలబెట్టింది ఓదార్పుయాత్ర.. పాదయాత్ర ఆ నాయకుడ్ని స్థిరపరిచింది. స్టేబుల్‌గా చేసింది. నవరత్నాలతో ఫలానిది చేస్తానని వాళ్లకు ధైర్యం కలిగించాడు. ఓదార్పునిస్తున్నాడు కాబట్టి వాళ్లు నమ్ముతున్నారు.

ప్రశ్న: నవరత్నాల్లో మీకు నచ్చిన అంశం ఏమిటి? 
విజయమ్మ: జగన్‌ ఓదార్పుయాత్రకు వెళ్లినప్పుడు ఇద్దరు పిల్లలుంటే ఒకరినే చదివిస్తాం, ఒకరిని పనికి పంపిస్తామన్నారట. అందుకని అమ్మఒడి పథకం ఆలోచన వచ్చింది. 

ప్రశ్న: విజయమ్మగారు గతసారి కచ్చితంగా గెలుస్తారని అంతా అనుకున్నారు. సర్వేలు వచ్చాయి. రెండు, మూడు నెలల ముందు మార్పులను పసిగట్టడంలో సఫలం కాకపోవడం వల్లనే అలా జరిగిందా, అలాంటి అనుభవాల నేపథ్యంలో ఈసారి ఎట్లా చేస్తారు. చంద్రబాబు వ్యూహాలను ఎలా ఎదుర్కొంటారు. జగన్‌ గారికి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు.
విజయమ్మ: అప్పుడు మోదీ ప్రభావం ఉంది. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ చేస్తానని, ఉద్యోగాలు ఇస్తానని, ఉద్యోగం రాకపోతే నిరుద్యోగులకు రెండువేలు నిరుద్యోగభృతి ఇస్తానని చాలా అబద్ధాలు చెప్పాడు. మాయలు చూపించాడు. అంతేకాకుండా తనకేదో అనుభవం ఉంది. తానేదో చేస్తానని చెప్పాడు. మళ్లీ డబ్బులు ఒకటి.

ప్రశ్న: మరి ఈసారి ఎలా ఎదుర్కోబోతున్నారు. ఇప్పుడు ఆయనకు అధికారం వచ్చింది. అధికారాన్ని ఢీకొనాల్సిన పరిస్థితి వచ్చింది కదా. మరి ఈసారి జగన్‌గారు ఎలా ఎదుర్కోవాలనుకుంటున్నారు.
విజయమ్మ: రాజశేఖరరెడ్డిగారు ఎన్నో కార్యక్రమాలు చేశారు. చెప్పినవి, చెప్పనవి కూడా చేశారు. ఈరోజు కూడా మాట తప్పే కుటుంబం కాదు, మాటపై నిలబడే కుటుంబమే. జగన్‌ తప్పకుండా చేస్తాడన్న నమ్మకం కూడా వచ్చింది. ఆ నమ్మకాన్ని పాదయాత్ర ద్వారా కల్పించుకోగలిగాడు. కాబట్టి నేననుకుంటా వాళ్లు ఎన్ని మాయ మాటలు చెప్పినా ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడైతే రైతులకు ఏదీ జరగలేదు. రుణమాఫీ చేస్తానన్నాడే కానీ వారిని బ్లాక్‌లిస్టులో పడేశాడు. డ్వాక్రా వాళ్లకు ఏమీ చేయలేదు. వాళ్లు కూడా బ్లాక్‌లిస్టులో పడిపోయారు. ఏమి చేసుకునే పరిస్థితి లేదు. ఒక ప్రాజెక్టు తెచ్చింది లేదు. ఒక ఇండస్ట్రీ తెచ్చింది లేదు. పోనీ రాజధాని కట్టాడా అంటే అదీ లేదు. మరి రైతుల భూములన్నీ లాక్కుని వ్యక్తిగతంగా వాళ్లు అభివృద్ధి అయ్యారు.

ప్రశ్న: జగన్‌లో ఉన్న మంచి లక్షణాలు అనండి, గొప్ప లక్షణాలనండి ఎట్లా చెబుతారు.
విజయమ్మ:జగన్‌ ఒకటే.. ధైర్యంగా ఫేస్‌ చేస్తాడు. చాలెంజ్‌గా తీసుకుంటాడు. అది ఎంతవరకైనా పోతాడు. ప్రజల కోసం నిలబడతాడు. మనిషి ఎంతకాలం బతికాడనేది కాదు. మనం ఎలా బతికామనేది ముఖ్యమనే ప్రిన్సిపల్స్, నైతిక విలువలకు గౌరవమిస్తాడు. మన పార్టీలోకి ఎవరు వచ్చినా కూడా రాజీనామా చేసి రావాల్సిందే. నంద్యాల ఎలక్షన్‌లో కూడా పాపం అప్పుడే గెలిచిన చక్రపాణిరెడ్డిని రాజీనామా చేసి రావాల్సిందేనన్నాడు. అట్లాంటి నైతికతకు విలువనిస్తాడు. ఏదంటే అది.. ఎక్కడదంటే అక్కడ దిగజారే మనస్తత్వం కాదు. స్ట్రెయిట్‌గా పోరాడతాడు. అది బలమో, బలహీనతో రాజశేఖరరెడ్డి గారికి, జగన్‌కు.

అసెంబ్లీలో జరిగిందేమిటి?
ప్రశ్న: అసెంబ్లీని వదిలేసి రోడ్డు వెంబడి నడుస్తున్నాడని, తిరుగుతున్నారని కొంతమంది అంటున్నారు కదా.. 
విజయమ్మ: నాయకులు ఎవరైనా ప్రజలకు జవాబుదారీ. అకౌంటబులిటీ ప్రజలకు. కాబట్టి ప్రజల పక్షంగా జనం సమస్యలపై పోరాడేందుకు అసెంబ్లీ వేదికగా ఉండాలి. కానీ వేదికగా లేదు. ఎందుకంటే జగన్‌  ప్రజా సమస్యల గురించి నిలదీస్తే కావాలనే ఇబ్బంది పెట్టేవారు. ఓ పది మందిని నిలబెట్టి తిట్టించేవారు. అయినా కూడా వాళ్ల నాన్నను తిట్టినా, తనను తిట్టినా జగన్‌ ఎప్పుడూ స్పందించే వాడు కాదు. చాలా కష్టంగా అసెంబ్లీని జరగనిచ్చే వాళ్లు. విపక్ష ఎమ్మెల్యేలను పెద్దగా మాట్లాడించే వాళ్లు కాదు. అట్లాంటి పరిస్థితుల్లో కూడా అసెంబ్లీకి పోతూనే ఉన్నారు. కానీ అసెంబ్లీలో జరిగిందేందంటే 23 మంది విపక్ష ఎమ్మెల్యేలను కొనుక్కోవటం. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం. ఇది చాలదన్నట్లుగా వారికి మంత్రి పదవులు ఇవ్వడం.. అంటే విలువలు, నైతికత ఏవీ లేవు. స్పీకర్‌ కూడా వారికి వంత పాడుతూ ఉండటం.. ఇలాంటప్పుడు అసెంబ్లీలో ఉన్నా కూడా ఏమీ చేయలేని పరిస్థితి. దీంతో విధి లేకనే జగన్‌ పాదయాత్రను చేపట్టారు.

ప్రశ్న: జగన్‌గారిలో మీరు చూసిన బలహీనతలు ఏమిటి, అరే ఈ పని చేయకుండా ఉండి ఉంటే బాగుండును, ఆయనలో ఈ మార్పు వస్తే బాగుండును అన్న సందర్భాలు ఏమైనా కనిపించాయా.
విజయమ్మ: అంటే లాస్ట్‌ టైమ్‌.. అంటే అందరూ చెప్పారు. రైతులకు రుణమాఫీ 50 వేలు చెప్పి ఉంటే జగన్‌ గెలిచిపోయే వాడు. వచ్చేసే వాడు. తనైతే బాధపడటం లేదు. చేయలేనిదానికెందుకు. అమ్మా నువ్వూ, నేనే కదా ఉండింది. మన పార్టీ నుంచి 67 మందిని ప్రజలు గెలిపించారు. కేవలం ఐదు లక్షల మెజార్టీనే కదా. తను శాటిస్‌ఫైడ్‌. బలహీనత అంటే.. తనేమీ కుంగిపోలేదు. అట్లా కుంగిపోయే మనస్తత్వం కూడా కాదు.

ప్రశ్న: తొమ్మిదేళ్లు ప్రతిపక్షంలో ఉండటమంటే తమాషా విషయం కాదు. 2011 నుంచి పోరాటంలోనే ఉన్నారు. మీకెప్పుడూ ఈ పోరాటం ఏమిటి ఈ గోల ఏమిటి అని విసుగెప్పుడూ రాలేదా?
విజయమ్మ: విసుగు అంటే.. కష్టమనిపిస్తాది. బాధ అనిపిస్తాది. బాధల్లో నుంచే ముందుకు వెళతాఉన్నాము. ధైర్యంగా ముందుకు పోతా ఉన్నాము. తన ఇంటెన్షన్, తన మోటివేషన్‌ ప్రజలకు చేయాలనే. తపన ఉంది.. వాళ్ల నాన్న లాగా బాగా చేయాలని, మనం స్వార్థం వదిలేసి ఇతరుల కోసం చేయాలనుకున్నప్పుడు దేవుడు కూడా హానర్‌ చేస్తాడని నేననుకుంటున్నా.

ప్రశ్న: రాబోయే ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయని అనుకుంటున్నారు. 
విజయమ్మ: వస్తే మంచి మెజార్టీనే వస్తాదని అనుకుంటున్నా. 120 దాకా వస్తాయని అనుకుంటున్నా.

ప్రశ్న: జగన్‌గారి పాదయాత్రను మార్నింగ్‌ వాక్, ఈవెనింగ్‌ వాక్‌ అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు?
విజయమ్మ: పాదయాత్ర అనేది ప్రజలతో మమేకం కావడం. ప్రజల కష్టాలు తెలుసుకోవడం. వాళ్లకు ధైర్యం కల్పించడం, అదే లక్ష్యం. జగన్‌ లక్ష్యం కూడా అదే. షర్మిలమ్మ పాదయాత్ర, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర కూడా ప్రజల కష్టాలు తీర్చడమే లక్ష్యంగా సాగిందే. ఇది పరుగు పందెం కాదు కదా.

ప్రశ్న: వస్తున్న ఆదరణను ఎలా మెటీరియలైజ్‌ చేసుకుంటారు? చంద్రబాబు వ్యూహాన్ని ఎదుర్కోగలమని అనుకుంటున్నారా.. మీరేమంటారు?
విజయమ్మ: ప్రజలంతా గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఏం చేసినాడని ఓటేస్తారు? రైతులకు రుణమాఫీ చేశాడని ఓటెయ్యాలా? డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేశాడని ఓటెయ్యాలా? ఏదైనా ప్రాజెక్టు కట్టాడని ఓటెయ్యాలా? రాజధాని కట్టాడని ఓటెయ్యాలా?

ప్రశ్న: ఆయన పులివెందులకు నీళ్లిచ్చానని అంటున్నాడు.
విజయమ్మ: పైనుంచేమైనా కురిపిచ్చాడా అని అడుగుతున్నా. రాజశేఖర్‌రెడ్డి ప్రాజెక్టులు కట్టాడు కాబట్టి ఇప్పుడు అవి కట్టాం ఇవి కట్టాం అని చెబుతున్నారు. నీళ్లిచ్చాక కుళాయి తిప్పాడు అంతే. పోలవరం విషయానికొస్తే రాజశేఖర్‌రెడ్డి చేసిన కాలువలు కనిపిస్తున్నాయి గానీ, పోలవరం ఎక్కడైనా కనిపిస్తోందా? పోలవరం అనుమతులన్నీ రాజశేఖర్‌రెడ్డి హయాంలో వచ్చినవే.

ప్రశ్న: కేంద్రం చేయాల్సిన ప్రాజెక్టు ఈయన చేతికి తీసుకోవడం వివాదాస్పదంగా మారుతోంది.. ఒక అభిప్రాయం ఉంది.
విజయమ్మ: కేంద్రమే చేసి ఉంటే ఈ పాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ఉండునేమో. ఈరోజు శ్వేత పత్రాల్లో ఏమని ప్రకటిస్తాడు? సంవత్సరానికోసారి ఆస్తులను ప్రకటిస్తున్నాడు. అవి ఎప్పుడో 30 ఏళ్ల కింద లెక్కలు కట్టి చెబుతున్నవే. ఎవరికి మంచి చేశానని శ్వేత పత్రాలు విడుదల చేస్తున్నాడని అడుగుతున్నా. 

ప్రశ్న: చంద్రబాబు ఆస్తులపై మీరు కోర్టుకు వెళ్లారు గానీ మీ పోరాటం సఫలమైనట్టు లేదుగా?
విజయమ్మ: జరుగుతాయి. అన్నీ జరుగుతాయి. చట్టం ప్రకారం జరుగుతాయి. అన్నీ మేనేజ్‌ చేసే స్థితిలో ఆయన ఉన్నాడు. దేనికైనా సమయం వస్తుంది.

ప్రశ్న: హైకోర్టు విభజన కూడా జగన్‌పై కేసును గురించే ఉపన్యాసం ఇస్తున్నారు?
విజయమ్మ: హైకోర్టు విభజన జగన్‌ ఏమైనా అడిగారా? రాష్ట్రాన్ని విడగొట్టింది కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం పార్టీలే. ప్రత్యేక హోదా హక్కు ఉంటే అది కూడా తెచ్చుకోలేదు. నాలుగున్నరేళ్లలో ప్యాకేజీ తేలేదు. ఈరోజు స్పెషల్‌ స్టేటస్‌ ఇస్తామంటే చంద్రబాబు అడగనే లేదని బీజేపీ వాళ్లు ఇప్పుడు చెబుతున్నారు. నాలుగున్నర సంవత్సరాల్లో స్టేటస్‌ తెచ్చింది లేదు. ఏం పూర్తి చేశాడని ఓట్లేస్తారు. పదేళ్లు మనకు హైదరాబాద్‌లో ఉండే అవకాశం ఇచ్చినప్పుడు కోర్టు, రాజధాని, సెక్రటేరియట్‌ ఇవన్నీ బాగా నిర్మించుకుని వెళ్లి ఉండవచ్చు. ఇప్పుడేమో తాత్కాలిక భవనాల పేరుతో కట్టారు. ఇవి శాశ్వత భవనాలకంటే ఎక్కువగా వ్యయం చేశారని చెబుతున్నారు. కాంట్రాక్టర్లకు మేలు చేశారు. కోర్టు బదిలీ వలన మనకే నష్టం. మూడేళ్ల నుంచి సీబీఐ కోర్టులో కేసు జరుగుతా ఉంది. ఈ కేసు విచారించిన జడ్జి ఏపీకి వెళ్లిపోయారు. ఒక జడ్జి వెళ్లిపోతే కొత్త జడ్జి మళ్లీ మొత్తం కేసు వినాలట. అంటే కేసు మళ్లీ మొదటికి వస్తుంది. దీనివలన జగన్‌కే నష్టం.

ప్రశ్న: మరి జనం చంద్రబాబు చెప్పే అబద్ధాలు నమ్ముతారా? జగన్‌ చెప్పే నిజాలు నమ్ముతారా?
విజయమ్మ: నిజాలు నమ్మే టైమొచ్చింది. అబద్ధం రుచిగా ఉంటుంది కాబట్టి లాస్ట్‌ టైమ్‌ ఆయన సీఎం అయ్యారు.

ప్రశ్న: ప్రధాని మోదీ, చంద్రబాబు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మోదీ అవినీతి జరిగిందని అంటున్నారు. ఈయనేమో కేంద్రం మోసం చేసిందంటున్నారు. దీన్నెలా చూస్తారు?
విజయమ్మ: ఎందుకు కలిసున్నారో తెలియదు. మొన్న మహారాష్ట్ర మంత్రి భార్యను టీటీడీ మెంబరును చేశారు. మరి వీళ్ల మధ్య ఏం జరుగుతోందో తెలియదు.

ప్రశ్న: పదే పదే గోబెల్స్‌లాగా చెబితే నమ్మేవారు ఉంటారా?
విజయమ్మ: ఆయన అవకాశవాది. నాలుగున్నరేళ్లు బీజేపీతో కలిసి ఉన్నాడు. వారికి వంతపాడాడు. వారితో కలిసున్నన్నాళ్లు వారిని పొగిడాడు. అప్పుడు మమ్మల్ని తల్లి కాంగ్రెస్‌ పిల్లకాంగ్రెస్‌ అన్నాడు. ఇప్పుడు బీజేపీ జగన్‌ కలిసి ఉన్నారు అంటున్నాడు. వాళ్లు నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూంటారు. ఏమైనా మాట్లాడేస్తారు?

ప్రశ్న: జనం ఇవన్నీ గమనించరా?
విజయమ్మ: ఇవన్నీ ఇప్పుడు గమనిస్తున్నారని నేననుకుంటున్నా. 

ప్రశ్న: తెలంగాణ ఎన్నికల ఫలితాల మీద మీ కామెంటు?
విజయమ్మ: చంద్రబాబు కలిసి కాంగ్రెస్‌కు నష్టం చేశాడని అనుకుంటున్నా. లేకపోతే కాంగ్రెస్‌కు మరో 10 సీట్లు వచ్చి ఉండేవేమో.

ప్రశ్న:జనంలో అంత వ్యతిరేకత వచ్చిందంటారా? నేను హైదరాబాద్‌కు చాలా చేశానని చెప్పాడు కదా? 
విజయమ్మ: హైదరాబాద్‌కు ఏం చేశాడు ఆయన. 

జగన్‌ వ్యక్తిత్వం ఏమిటి.. జగన్‌ పట్టుదల ఏమిటి.. వాళ్ల నాయన చేసింది చేయగలుగుతాడు అనే నమ్మకం పాదయాత్రలో తెచ్చుకున్నాడు. చేయగలుగుతాడనే విశ్వాసం ప్రతి ఒక్కరిలో ఉంది. ఆ నమ్మకం తెచ్చుకున్నాడు.

నిజంగా ఈ కుటుంబానికి ప్రజలతో ఉన్న అనుబంధం 45 సంవత్సరాలది. రాజశేఖరరెడ్డి గారు వెళ్లిన తరువాత కూడా ప్రజలు ఈ కుటుంబాన్ని వదిలిపెట్టలేదు. చంద్రబాబు గారికి ప్రజల్లో ఎప్పుడూ గొప్పగా ఉందని అనుకోను. కానీ, మేనేజ్‌మెంట్, మేనుప్లేట్‌ బాగా చేస్తారు. మీడియా.. పది చానల్స్‌ పెట్టుకుని గోబెల్స్‌ ప్రచారం బాగా చేస్తారు. చేయకపోయినా చేసినట్టు చూపిస్తారు. అది ఎంతో కాలం నిలబడదు. ప్రజలకు కూడా అర్థమవుతుందని నేననుకుంటున్నా.

పాదయాత్రపై ప్రజల అభిమానం పొంగిపొర్లుతాంది అనుకుం టున్నాం. ఒక జిల్లా బాగా జరిగింది అనుకుంటే ఇంకో జిల్లా ఇంకా ఎక్కువగా జరుగుతాంది. చాలామంది ఒంగోలు వరకూ బాగా ఉంటుంది, ఆ తర్వాత తగ్గుతుంది అన్నారు. విజయవాడ, గుంటూరు ఏ జిల్లాలో అయినా సరే.. శ్రీకాకుళం వరకూ ఒక జిల్లాకు మించి మరో జిల్లాలో పాదయాత్ర బ్రహ్మాండంగా జరిగింది. ఎక్కడ చూసినా జనం ఉంటున్నారు.

రాజశేఖర్‌రెడ్డి 20 సంవత్సరాల పోరాటంలో వారానికి ఐదు రోజులు తిరుగుతూనే ఉండేవారు. వారానికి రెండ్రోజులే ఇంటి దగ్గర ఉండేవారు. వైఎస్సార్‌ సీఎం అయ్యేనాటికి ఏ జిల్లాకు ఏం చెయ్యాలి, ఏ వర్గానికి ఏం చెయ్యాలి అనేది ఆయన దగ్గర బ్లూప్రింట్‌ ఉంది. షర్మిలమ్మ పాదయాత్ర చేసినప్పుడు జగన్‌ జైలుకు వెళ్లిన పరిస్థితుల్లో ఈ కుటుంబం ఎప్పుడూ ప్రజలతోనే ఉందని తెలియచెప్పడం కోసం, జగన్‌ లోపల ఉన్నా కూడా అన్నీ జరుగుతాయి అని భరోసా ఇవ్వడం కోసం ఆ రోజు షర్మిలమ్మ యాత్ర చేయాల్సి వచ్చింది. ఇప్పుడు పాదయాత్ర ద్వారా జగన్‌ గ్రాస్‌రూట్‌ లెవెల్‌ దాకా వెళ్లడం ద్వారా ప్రజల కష్టాలు తెలిసొచ్చాయి. తనకు కూడా ఒక బ్లూప్రింట్‌ తయారయిందనుకుంటున్నాను. 

ఆంధ్రప్రదేశ్‌కు నష్టం ఎప్పుడో జరిగిపోయింది. రాజశేఖర్‌రెడ్డి గారు ఈ లోకం నుంచి వెళ్లిపోయినప్పుడే నష్టం జరిగిందనుకుంటున్నాను. నిజంగా నాకంటే రాష్ట్ర ప్రజలే దురదృష్టవంతులని చెపుతా. ఆయనే బతికుంటే ఇప్పటికే అన్ని ప్రాజెక్టులు పూర్తయ్యి ఉండేవి. రాష్ట్రానికి ఎటువంటి కొరత లేకుండా అన్నీ ఉండేవి. అలాంటిది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు ఏమీ మిగలలేదు. 

జగన్‌ గ్రాస్‌ రూట్‌ దాకా వెళ్లాడు
ప్రశ్న: గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, షర్మిలమ్మ పాదయాత్ర చేశారు. ఇప్పుడు జగన్‌ పూర్తిచేశాడు. ఒకవిధంగా మీ కుటుంబం పాదయాత్ర కుటుంబంగా పేరుపొందింది. భవిష్యత్‌లో జగన్‌కు మీరు ఇచ్చే సలహా ఏమిటి? 
విజయమ్మ: రాజశేఖర్‌రెడ్డి 20 సంవత్సరాల పోరాటంలో వారానికి ఐదు రోజులు తిరుగుతూనే ఉండేవారు. జగన్‌ లోపల ఉన్నా కూడా అన్నీ జరుగుతాయి అని భరోసా ఇవ్వడం కోసం ఆ రోజు షర్మిలమ్మ యాత్ర చేయాల్సి వచ్చింది. అప్పుడు ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కూడా షర్మిలమ్మ బయటకు రావాల్సి వచ్చింది. గతంలో జగన్‌ యాత్రలు గ్రాస్‌ రూట్‌ లెవల్‌లోకి వెళ్లలేదు. ఓదార్పు యాత్ర ఎక్కడెక్కడ అవసరమో అక్కడ చేశాడు. అదే విధంగా దీక్షలు కూడా కొన్ని చోట్ల మాత్రమే చేశారు. కాని ఇప్పుడు పాదయాత్ర ద్వారా జగన్‌ గ్రాస్‌రూట్‌ లెవెల్‌ దాకా వెళ్లారు. నవరత్నాల్లో ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, అమ్మ ఒడి వంటి పాత పథకాలతో పాటు కొత్తగా మద్యపాననిషేధం, రైతు భరోసా పథకం వంటివి కూడా తీసుకున్నారు. అప్పుడు రాజశేఖర్‌రెడ్డి గారు యాత్ర సందర్భంగా రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తానని ఎలాగైతే చెపుతూ వచ్చారో ఇప్పుడు జగన్‌ నవరత్నాలని చెపుతూ తనను తాను ఎస్టాబ్లిష్‌ చేసుకుంటూ ఆ యాత్ర ద్వారా ప్రజల్లో నమ్మకాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. 

ప్రశ్న: చంద్రబాబు కాంగ్రెస్‌ను వ్యతిరేకించే రోజుల్లో నవనిర్మాణ దీక్షలంటూ ఆ పార్టీని తిట్టేవారు. ఇప్పుడు బీజేపీని వ్యతిరేకిస్తూ ధర్మపోరాట దీక్షలు చేస్తున్నాడు. ఈ రెండింటిని మీరు ఎలా చూస్తారు? 
విజయమ్మ: నవ నిర్మాణమూ లేదు ధర్మపోరాటమూ కాదు. అధర్మపోరాటమని చెపుతాను. కనీసం రాజధాని అయినా కట్టివుంటే నవనిర్మాణం చేశాడనుకోవచ్చు. 

ప్రశ్న: చంద్రబాబు ఓటుకు నోటు కేసుతో అప్పటికప్పుడు హైదరాబాద్‌ను విడిచి రావడం వల్ల రాష్ట్రానికి ఏమైనా నష్టం జరిగిందనుకుంటున్నారా? 
విజయమ్మ: ఆంధ్రప్రదేశ్‌కు నష్టం ఎప్పుడో జరిగిపోయింది. చంద్రబాబు ఏమీ తయారు చేయలేదు. నిజంగా చంద్రబాబు గెలిచినప్పుడు నేను అనుకున్నా.. జగన్‌ గెలిచి ఉంటే బాగుండేది.. రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా రాజధాని నిర్మించాడు అని చరిత్రలో పేరు నిలిచిపోయేది కదా అనుకున్నాను. ఇప్పుడు చూస్తే రాజధానిని జగనే కట్టాలనుకుంటున్నా. 

ప్రశ్న: చంద్రబాబు పాలనపై ప్రజల్లో పూర్తిగా విసుగువచ్చిందంటున్నారు. జగన్‌ పట్ల ఎటువంటి ఆదరణను ఈమధ్య కాలంలో మీరు గమనిస్తూవచ్చారు? 
విజయమ్మ: ప్రజల్లో ఆదరణ లేకపోతే అంతమంది వచ్చే అవకాశమేలేదు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, గతంలో రాజశేఖర్‌రెడ్డిగారు ఏమి చేశారు.. తాను ఇప్పుడు అధికారంలోకి వస్తే ఏమి చేస్తాడో చెపుతుంటే ప్రజలు శ్రద్ధగా ఆలకిస్తున్నారు. ఎండ తీవ్రంగా ఉన్నా, వాన కురుస్తున్నా ఎక్కడా జనం వెనుదిరిగిన సందర్భంలేదు. అది ఎంతో అభిమానం ఉంటే తప్ప అలా వినడానికి అవకాశం ఉండదు. 14 నెలలుగా పాదయాత్రలో స్థానిక సమస్యలు తప్ప ప్రతీ రోజు చెపుతున్న అంశాన్నే చెపుతున్నాడు అని తెలిసినా టీవీల్లో వినే అవకాశం ఉన్నా సరే ఎందుకు ఆయన కోసం ఎదురు చూస్తున్నారు? ఆయన కోసం ఎందుకు కాసుకుకూర్చున్నారు? ఇంత శ్రద్ధగా వింటూ అభిమానం, ప్రేమ చూపిస్తున్నారంటే తప్పకుండా జగన్‌ను వారు నమ్ముతున్నారని నేను అనుకుంటున్నాను. 

ప్రశ్న: కొందరు కొత్తగా ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి వచ్చిన సన్నివేశాలని, ఇప్పుడు జగన్‌ గారి సన్నివేశాలతో పోలుస్తుంటారు. మీరు అప్పటి నుంచి చూస్తున్నారుగా.. ఇప్పుడు జగన్‌ ఇన్ని సభల్లో మాట్లాడుతున్న తీరును పోల్చిచూస్తే మీకు ఏమనిపిస్తోంది? 
విజయమ్మ: ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే ఎన్నికలు వచ్చి భారీ మెజార్టీతో ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కారు. తొమ్మిది నెలలు అంటే ఏమంత కష్టం కాదు. జగన్‌ వచ్చి దాదాపు తొమ్మిదేళ్లయ్యింది. జగన్‌కు ఉన్న సమస్యలు ఆయనకు లేవు. జగన్‌కు ఉన్న ఇబ్బందులు, కష్టాలు ఆయనకు లేవు. చిన్నవాడు అయినా ఇవన్నీ ఎదుర్కొన్నాడు. రాజశేఖర్‌రెడ్డిగారంటే అన్నీ జమాయించుకొని రాగలుగుతాడన్న ధైర్యం ఉండేది. కానీ జగన్‌ చిన్నవాడు అయి ఉండటమో.. కొడుకు కావడం వల్లనేమో కానీ ఆందోళన ఉండేది. ఆందోళన ఒకపక్క ఉన్నా సరే అధిగమించగలడనే ధైర్యం ఇప్పుడు వచ్చింది. ముందుకు పోగలడన్న నమ్మకం వచ్చింది. 

ప్రశ్న: పాదయాత్ర ముగింపు సందర్భంగా ఒక తల్లిగా, పార్టీ గౌరవ అధ్యక్షురాలిగా మిరిచ్చే సందేశం? 
విజయమ్మ: ప్రజలకు నేను ఒకటే చెపుతున్నా.. రాజశేఖర్‌రెడ్డిగారిని చూశారు. ఇప్పుడు జగన్‌ను తొమ్మిదేళ్లుగా చూస్తున్నారు. రాజశేఖర్‌ రెడ్డిగారు ఏ విధంగా మాట తప్పరో.. అదే విధంగా జగన్‌ కూడా మాటతప్పడని ఆయన పక్షాన నేను మీకు హామీనిస్తున్నాను. మాట కోసమే సోనియా గాంధీని ఎదిరించి పార్టీ నుంచి బయటకు రావడం జరిగింది. నాన్న కోసం చనిపోయిన కుటుంబాలను పరామర్శిస్తాను అని ప్రజలకు ఇచ్చిన మాట కోసం వారిని ఎదిరించి బయటకు రావడం జరిగింది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడని మీ ద్వారా ప్రజలందరికీ హామీనిస్తున్నాను. తప్పకుండా జగన్‌ ముఖ్యమంత్రి అవుతాడని విశ్వసిస్తున్నాను. మీరందరూ కూడా విశ్వసించండి. ఒక్కసారి జగన్‌ను ఆశ్వీరదించండి. ఒక్కసారి అవకాశం ఇవ్వండని ప్రజలందరినీ చేతులెత్తి కోరుతున్నాను.  

ప్రశ్న: ఆ భరోసానే విజయం వైపునకు తీసుకెళుతుందని భావిస్తున్నారా? 
విజయమ్మ: ఎవరికైనా సరే నేనున్నాను.. అని రాజశేఖర్‌రెడ్డి భరోసా ఇచ్చేవారు. ఇప్పుడు ఆ భరోసా లేదని అందరూ అనుకుంటున్నారు. నేను ఈరోజు ప్రజలకు హామీ ఇస్తున్నాను. రాజశేఖరరెడ్డిగారు నాకు లేకపోవచ్చు కానీ, రాజశేఖర్‌రెడ్డి లాంటి భరోసా జగన్‌ ఇవ్వగలుగుతాడు అని ప్రజలకు హామీనిస్తున్నాను. 

జగన్‌పై హత్యాయత్నం అనగానే భయం వేసింది
ప్రశ్న: నాడు పాదయాత్రలో రాజశేఖరరెడ్డికి సడన్‌గా రాజమండ్రి వద్ద అనారోగ్యం ఇబ్బంది తలెత్తింది. నేడు జగన్‌పై హత్యా యత్నం జరిగింది. ఈ రెండింటినీ అప్పుడెట్లా చూశారు. ఇప్పుడెట్లా చూశారు?
విజయమ్మ: అప్పుడంటే అనారోగ్యం, డీహైడ్రేషన్‌ వల్ల ఇబ్బంది వచ్చింది. అయితే దానికి భయపడాల్సిన అవసరం లేదు. వైద్యం జరుగుతుంది. వారం రోజులు కాకపోతే పది రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. వైఎస్‌ వారం రోజులు రాజమండ్రిలో విశ్రాంతి తీసుకొని తర్వాత పాదయాత్ర పూర్తి చేశారు. జగన్‌పై హత్యా ప్రయత్నం జరగడం భయమేసింది. నిజానికి వాళ్లు అన్ని ప్రయత్నాలూ చేశారు. కేసులు పెట్టారు...జైల్లో పెట్టారు.. బెయిల్‌ రాకుండా చూశారు.. ఇది చేయలేదనకుండా అన్నీ చేశారు. అన్ని వ్యవస్థలను తమ చేతుల్లోకి తీసుకొని ఇబ్బందులు పెట్టారు. జగన్‌ ప్రజల్లో ఉంటున్నారని అంతిమంగా హత్యాప్రయత్నం చేశారు. దేవుని దయ, ప్రజల ఆశీర్వాదం, ప్రార్థనలు తనకు మెండుగా ఉన్నాయి కాబట్టి జగన్‌ తప్పించుకోగలిగాడు అని నేను అనుకుంటున్నా. పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా రెక్కీ నిర్వహించారని వింటున్నాం. 

తాజా వీడియోలు

Back to Top