శంకరన్న చెప్పేది సత్యమురా!

సొంత పార్టీ నేతలకు కూడా పక్కలో బల్లెంలా మారిన మాజీ మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నేత పి. శంకర్రావు ఎప్పుడెవరిని తెగడుతారో, ఎవరి పక్షాన మాట్లాడుతారో ఆయనను పుట్టించిన జేజమ్మకు కూడా అర్థం కాదు. ఆయన మాటల్లో ఒక్కోసారి వాస్తవాలు తన్నుకుని బయటికి వస్తుంటాయి. రానున్న ఎన్నికల నాటికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎలాంటి ఉచ్ఛ స్థితికి చేరుతుందో, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి కృషి, పట్టుదల, కార్యదీక్షా దక్షతతో తీసుకువచ్చిన అధికార ఫలాలు అనుభవిస్తూ విర్రవీగుతున్న ప్రస్తుత కాంగ్రెస్‌ పరిస్థితి మరెంత దారుణంగా దిగజారిపోనుందో ఆయన భవిష్యద్దర్శనం చేసి మరీ చెప్పారు. ఈ క్రమంలోనే శంకర్రావు మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

నిజానికి శంకర్రావు చెప్పినా చెప్పకపోయినా రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ క్రమేపీ కొడిగట్టిపోతున్నదన్న వాస్తవం కళ్లకు గడుతోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలతో సహా కేడర్ అంతా‌ ఒక్కొక్కరుగా, పదులు, వందలు, వేల సంఖ్యలో వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ బాట పడుతుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. 2014 నాటికి కాంగ్రెస్‌ పార్టీ నేతలు, మంత్రుల్లో ఎంతమంది ఆ పార్టీలో ఉంటారో, ఎంతమంది గుడ్‌బై చెబుతారో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొని ఉంది. ఇదంతా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, రాష్ట్ర నాయకత్వం ‌స్వయంకృతం అన్నది జ(న)గమెరిగిన సత్యం.

రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ ఉన్న వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి లాంటి సమర్థుడైన జన నాయకుడిని వదులుకుని కాంగ్రెస్‌ పార్టీ తన పతనాన్ని తానే నిర్దేశించుకున్నది. అంతే కాకుండా రోశయ్య, కిరణ్‌ కుమార్‌రెడ్డి లాంటి వెన్నుముక, స్వయం నిర్ణయాధికారం లేని నేతలకు రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టి ఉన్న కాస్త పట్టును ఆ పార్టీ కోల్పోయింది. ‌ఒక వైపున మధ్యందిన మార్తాండునిలా దూసుకొస్తున్న జగన్మోహన్‌రెడ్డి ప్రభంజనం, మరో పక్కన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సమస్యతో రానున్న రోజుల్లో ఈ శతాధిక వత్సరాల వృద్ధ పార్టీ రాష్ట్రంలో కనుమరుగు కానుందని సర్వేలు ఘోషిస్తున్నాయి. కాంగ్రెస్‌ హైకమాండ్ నిర్ణయాలే కాంగ్రె‌స్ పతనాన్ని శాసిస్తున్నాయని దీన్ని బట్టే అర్థమవుతోంది.

‌రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి‌ రోజురోజుకూ ప్రజాదరణ తరిగిపోతోందని శంకర్రావు వాపోయిన విధానం ఆసక్తికరం. పరిస్థితి ఇలాగే కొనసాగితే పార్టీ మనుగడకు ముప్పు తప్పదని ఆయన హెచ్చరించడాన్ని అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వ వైఫల్యాల వల్ల కాంగ్రెస్ పార్టీ ఓటు‌ బ్యాంకు రోజురోజుకూ కుదించుకుపోతోందని వచ్చే ఎన్నికల్లో దరఖాస్తు ఫీజు లేకుండా ఫ్రీగా టిక్కెట్ ఇస్తామన్నా దాన్ని తీసుకొని కాంగ్రెస్‌  తరఫున పోటీచేయడానికి అభ్యర్థులు ఎవరూ ముందుకు వచ్చే పరిస్థితి ఉండే అవకాశం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేయడం వెనుక ఉద్దేశాలు ఏవైనా భవిష్యత్తు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి పూర్తి అనుకూలంగా ఉందన్నది వాస్తవం. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల పార్టీకి, ప్రభుత్వానికి ప్రజలు దూరమయ్యారన్నది శంకర్రావు తీవ్ర ఆవేదన. గతంలో పార్టీకి 34 శాతం ఉన్న ఓటు బ్యాంకు ఇపుడు 19 శాతానికి దిగజారిపోయిందన్నది ఆయన విశ్లేషణ ద్వరా వ్యక్తం చేసిన వ్యథ.

కిరణ్‌ కుమార్‌ రెడ్డి పుణ్యంతో శంకర్రావుకు మంత్రి పదవి ఊడిపోయిన విషయం తెలిసిందే. ఆ బాధను, దుగ్ధను మనసులోనే దిగమింగలేని శంకర్రావు ఇటీవల సొంత పార్టీ నేతలపైనే పదునైన వ్యాఖ్యలు ప్రారంభించారు. సొంత పార్టీలో లోపాలను కూడా ఆయన నిర్మోహమాటంగా కుండబద్దలు కొడుతున్నారు. సీఎం కిరణ్‌ వ్యవహార శైలిని చెండాడడం, మంత్రులపై అవినీతి ఆరోపణాస్త్రాలు ఎక్కుపెట్టడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు. ఎడాపెడా వాయించేస్తున్నారు. తనకు నచ్చని అధికారులపైనా విరుచుకుపడుతున్నారు. తనకు ఎదురుతిరిగిన వారిని కులాన్ని అడ్డుపెట్టుకుని బెదిరిస్తారన్న అపవాదు శంకర్రావుపై ఉంది. నమ్ముకున్న పార్టీలో నిలువనీడ కరువవడంతో అందివచ్చిన అస్త్రాలతో తన వ్యతిరేకులపై దాడి చేస్తున్నారు. 

గతంలో కూడా ఆయన హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి సహా పలువురు మంత్రులపై అవినీతి ఆరోపణలు చేశారు. పదవుల నుంచి దిగిపోవాలని డిమాండ్‌ చేశారు. మరోసారి ఇదే డిమాండ్‌ పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో అవినీతి ఆరోపణలున్న మంత్రులు మహారాష్ట్రలో ఉపముఖ్యమంత్రి రాజీనామాను ఆదర్శంగా తీసుకొని వెంటనే వైదొలగాలని సూచించారు. రాష్ట్రంలో క్షీణిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ ఇమేజ్‌, వెల్లువెత్తనున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభంజనాన్ని ఆయన ప్రజల దృష్టికి తీసుకొచ్చారు.
Back to Top