టిడిపికి ఇంటింటా చేదు అనుభవం

సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లండి. ప్రభుత్వ పథకాల గురించి ప్రచారం చేయండి. రేషన్ కార్డులు, పింఛన్లు గురించి ఆరా తీయండి అంటూ ఇంటింటికీ టిడిపి కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ మంత్రులు, ఎమ్మెల్యేలకు చెప్పారు చంద్రబాబు. అప్పుడే నేతలకు అర్థం అయిపోయింది ఇది సెల్ఫ్ గోల్ అని. కాని ముఖ్యమంత్రి చెప్పాక తప్పుతుందా ఇంటింటికీ వెళ్లి పరాభవాలనెదుర్కుంటున్నారు తెలుగు తమ్ముళ్లు. 

మా పాలన భేష్. మేం ఎంతో చేశాం అంటూ చంద్రబాబు చెప్పే అబద్ధాలకు ఇంటింటికీ టిడిపి కార్యక్రమంలో అడుగుడుగునా చేదు అనుభవమే ఎదురౌతోంది. మీరేం చేసారో చెప్పాలంటూ ప్రతి జిల్లాలోనూ నాయకులను ప్రజలు నిలదీస్తున్నారు. నిలువునా కడిగేస్తున్నారు. రోడ్లు సరిగ్గా లేవని, డ్రైనేజీ వ్యవస్థలు లేవని, ఫించన్లు అందడం లేదు, ఇళ్లు సాంక్షన్ కాలేదని, ఉద్యోగాలు లేవని, ఉపాధి పనులు లేవని ఇలా ప్రతి చోటా ప్రజల నుంచి టిడిపి నేతలకు నిరసనల సెగ తగులుతూనే ఉంది. ఇక మహిళలైతే, ఎమ్మెల్యేలను, మంత్రులను మీడియా ముందే నిలదీయడానికి కూడా వెనుకాడటం లేదు. ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజక వర్గాల్లో అయితే ప్రజలు తెలుగుదేశంపై తిరగబడుతున్నారు.

నాయకులను నడిరోడ్డుమీదే ప్రశ్నిస్తున్నారు. 
నిన్న పశ్చిమగోదావరి జిల్లాలో టిడిపి ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు ఎదుట డ్రైనేజీ సమస్య పరిష్కరించట్లేదంటూ ఓ వ్యాపారి ఆత్మహత్యా యత్నం చేసాడు. మీ కార్యక్రమాలే తప్ప మా సమస్యలు పట్టవా అని నిలదీశాడు. ఇక గ్రామంలో పర్యటించబోగా మూడేళ్లుగా రాని మీరు ఇప్పుడు ప్రచారం కోసం వచ్చారా అంటూ మహిళలు సైతం విమర్శించడంతో ఎమ్మెల్యే నిరాశగా వెనుదిరిగారు. అడుగడుగునా సమస్యల స్వాగతమే రాష్ట్రవ్యాప్తంగా ఎదురౌతోందని టిడిపి ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారు. ఇంటింటికీ టిడిపి కార్యక్రమంలో ఎమ్మెల్యేల పరిస్థితే కాదు మంత్రులుకు సైతం ఇవే అనుభవాలు ఎదురౌతున్నాయి. కర్నూల్లో ఇంటింటికీ టిడిపి కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటి సిఎమ్ ను రుణమాఫీ అందలేదని అడిగాడో రైతు. దాంతో రెచ్చిపోయిన ఆయన నోర్ముయ్, మాట్లాడద్దు అంటూ ఆ రైతుపై విరుచుకు పడిపోయారు. సారాతాగిన నాయాళ్లంటూ ప్రజలనుద్దేశించి డిప్యూటీ సిఎమ్ స్థాయి వ్యక్తి దిగజారి మాట్లాడటాన్ని చూసి ప్రజలు నిరసన వ్యక్తం చేసారు. ప్రతి జిల్లాలో, నియోజకవర్గంలో, గ్రామాల్లో టిడిపికి సదా చుక్కెదురే అయ్యింది. గడప గడపకూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని అక్షరాలా కాపీ కొట్టి మొదలెట్టిన ఈ ఇంటింటికీ టిడిపి చివరికి ఇంటికే టిడిపి అనే విషయాన్ని స్పష్టం చేసింది. ప్రతి ఊళ్లోనూ టిడిపికి చేదు అనుభవాలే ఎదురయ్యాయి. మెత్తానికి బాబు  కాపీ ప్లాన్ ఈ విధంగా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. 

Back to Top