కడుపు కాల్చుతున్న ఈ–పాస్‌లు

– రేషన్‌ కోసం లబ్ధిదారుల పడిగాపులు
– హాల్‌ టిక్కెట్ల తప్పులతో గ్రూప్‌–2 అభ్యర్థుల పాట్లు
– సెల్‌ సిగ్నలే లేని గ్రామాల్లో నగదు రహితమా..?
– ఈ పాస్‌ మెషీన్లు పబ్లిసిటీ కోసమే.. 

నిద్ర లేచింది మొదలు టెక్నాలజీ.. విజన్‌.. చేపల పులుసు .. బెండకాయ ఫ్రై... అని జనాలను పీక్కు తింటున్న చంద్రబాబు పిచ్చికి జనం రేషన్‌ దుకాణాల ముందు గంటలకొద్దీ క్యూ కట్టాల్సి వస్తుంది. గ్రూప్‌–2 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులు హాల్‌టిక్కెట్‌ వస్తుందా.. పరీక్ష రాసే యోగ్యత ఉంటుందా అని నానా హైరానా పడిపోతున్నారు. కోచింగ్‌ సెంటర్ల కోసం పెట్టిన ఫీజులు.. సంవత్సరాల తరబడి పడ్డ కష్టం.. వృథా అవుతుందేమోనని పరీక్ష గురించి ఆలోచించడం మాని అసలు రాసే అవకాశం వస్తుందో లేదోనని హడలెత్తి పోతున్నారు. ఫిబ్రవరి 26న పరీక్ష ఉన్నా ఇప్పట్నుంచే ఆందోళన చెందుతున్నారు. టెక్నాలజీకే నేను బాబును అని చెప్పే చంద్రబాబు ప్రవేశ పెట్టిన ఈపాస్‌ మిషన్లు అటు రేషన్‌ లబ్ధిదారులను.. ఇటు రేషన్‌ దుకాణదారులకు నరకం చూపిస్తున్నాయి. ఒకప్పుడు రేషన్‌ వచ్చిన రెండు రోజుల్లో అందరికీ సరుకులందేవి. ఎవరికి నచ్చిన టైములో వారొచ్చి రేషన్‌ తీసుకుపోయేవారు. అయితే అవినీతిని అరికడతానని 70 ఎంఎం సినిమా చూపించిన బాబు ఈపాస్‌ ధాటికి జనానికి హారర్‌ మూవీ కళ్లముందు కనిపిస్తుంది. రెండు రోజులతో పోయేదానికి నెలఖరుదాకా సరుకులు అందని దుస్థితి. కూలీనాలీ చేసుకునేవారు కూడా పనులు మానుకుని పడిగాపులు కాయాల్సిన పరిస్థితి. వీళ్లందర్నీ చూసి అప్పుల కోసం వచ్నినోళ్లలాగా ఏందీ గోల అని రేషన్‌ దుకాణదారులు కసురుకోవడం షరా మామూలైంది. 

అసలే గ్రామాల్లో సెల్‌ఫోన్లకే సిగ్నళ్లు లేక జనాలు ఇంటి సూరిలో ఫోన్‌లు పెట్టుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో బాబు ఈ పాస్‌ మిషన్లు పట్టుకుని రేషన్‌ షాపు నిర్వాహకులు సిగ్నల్‌ కోసం ఏటి గట్టుకు పరుగు పెడుతున్నారు. ఇప్పటికే దాదాపు రెండేళ్లయింది ఈ పాస్‌ మిషన్లు ప్రవేశపెట్టి. అయినా బాలారిష్టాలు దాటలేదు. రాష్ట్రంలో 1.38 కోట్ల తెల్లరేషన్‌ కార్డు దారులున్నారు. ఈ పాస్‌ మిషన్ల కారణంగా ప్రతినెలా లక్షలాది మంది పేదలు రేషన్‌కు దూరమవుతున్నారు. ఈపాస్‌ మిషన్ల కారణమైతేనేం.. రేషన్‌ కార్డుల్లో తప్పులైతనేం అన్నింటికీ కలిపి ఈనెలలో 19.92లక్షల మంది రేషన్‌కు దూరమయ్యారు. ఈపాస్‌ మిషన్లకు సిగ్నల్‌ ఉన్నా వృద్ధుల చేతివేలిముద్రలు గుర్తించకపోవడంతో పెద్ద తలనొప్పిగా మారింది. అయిలే అలాంటి వారందరికీ వీఆర్వో సర్టిఫికెట్‌ ఇస్తే రేషన్‌ పంపిణీ చేయాలని ఉన్నా క్షేత్రస్థాయిలో జరగడం లేదు. పైగా వీటన్నిటికీ మించి డీమానిటైజేషన్‌ తర్వాత నగదు రహిత లావాదేవీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ అయిన బాబు దెబ్బకు ఇంకొన్ని కొత్త చిక్కులొచ్చిపడ్డాయి. సెల్‌ఫోన్లకే సిగ్నళ్లు లేవు మొర్రో అంటే పట్టించుకోడు కానీ డబ్బులకు సరుకులు ఇవ్వద్దని ఆర్డర్‌ ఇచ్చేశాడు. ఈ నిర్ణయం మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టుంది. గంటలకొద్దీ రేషన్‌ కోసం క్యూలో నిలబడలేక చాలా మంది మానుకుంటుంటే బాబు నగదు రహిత పిచ్చి కారణంగా ఇంకొంత మంది.. వేలి ముద్రలు గుర్తించడం లేదని వృద్ధులు రేషన్‌ తీసుకోవడమే మానేశారు. నిజానికి బాబు విమాన ఖర్చులు తగ్గించుకున్నా రాష్ట్రమంతా సంతోషంగా రేషన్‌ తీసుకోవచ్చు. 

గందరగోళంగా గ్రూప్‌–2 హాల్‌ టిక్కెట్ల జారీ
చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక వెలువడిన తొలి సర్కారు కొలువుల పరిస్థితి దారుణంగా మారింది. గ్రూప్‌–2 హాల్‌ టిక్కెట్ల జారీలో ఏర్పడిన అవకతవకలతో అభ్యర్థులు నానా హైరానా పడుతున్నారు. ఈనెల 26న స్క్రీనింగ్‌ కూడా జరగబోతోంది. కానీ హాల్‌ టిక్కెట్ల జారీలో జరుగుతున్న పొరపాట్లను ఇంతవరకు సరిదిద్దనేలేదు. పైగా ఇదెక్కడి గోలరా బాబూ అని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నా ఇవన్నీ మామూలేనని చల్లగా సెలవిస్తున్నారు. 982 పోస్టులకు 6,57,010 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా చదువు మీద దృష్టి పెట్టలేక.. పరీక్ష హాల్‌ టిక్కెట్‌ టెన్షన్‌ తట్టుకోలేక సతమతం అవుతున్నారు. తొందర్లోనే సరిదిద్దుతామని ఏపీఏపీఎస్సీ చైర్మన్‌ ఉదయ్‌భాస్కర్‌ చెబుతున్నా అభ్యర్థులు మాత్రం అసహనంగానే ఉంటున్నారు. రాకరాక నోటిఫికేషన్‌ వస్తే సాంకేతిక కారణాలతో ఎక్కడ దూరం కావాల్సి వస్తుందోనని భయపడుతున్నారు. 
Back to Top