ప్రధాని పర్యటనపై టీడీపీలో వణుకుదేశ ప్రధాని ఓ రాష్ట్రంలో పర్యటనకు వచ్చేందుకు సిద్ధపడుతున్నారు. అంటే ఆ పర్యటన వివరాలు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ముందుగానే అందజేస్తారు. భద్రతా వ్యవహారాల నుంచి, పర్యటన వివరాల వరకూ ప్రతి అంశం రాష్ట్ర హోంశాఖకు, రాష్ట్ర ముఖ్యమంత్రికి, అధికారులకూ స్పష్టంగా తెలుస్తుంది. టీడీపీ ఎంపీ సుజనా చౌదరికి మాత్రం ప్రధాని ఏపీలో ఎందుకు పర్యటిస్తున్నారో అస్సలు తెలియదట. మోదీ ఏ కారణంతో ఆంధ్రాలో అడుగుపెడుతున్నారో అర్థం కావడం లేదని అంటున్నాడాయన. పైగా ప్రధాని మర్యాద కాపాడుకోవాలంటే ఏపీలోకి అడుగుపెట్టొద్దని కూడా వార్నింగ్ ఇస్తున్నాడు. దేశ ప్రధానికి ఓ ఎంపీ ఇస్తున్న ఈధమ్కీ వెనుక కుట్ర కోణాలు ఉన్నాయా అని దేశ ప్రజలకు అనుమానం కలుగుతోంది. 
గతంలో లా దాడులు ప్లాన్ చేసారా?
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో అధికారం పంచుకున్న టీడీపీ రాజకీయ అనివార్యతల వల్ల ఎన్డీయే నుంచి వైదొలగింది. ఆ సమయంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తిరుపతి పర్యటనకు వచ్చారు. అవకాశం కోసం ఎదురు చూసిన టీడీపీ అమిత్ షా కాన్వాయి పై పార్టీ కార్యకర్తలచేతే రాళ్లు రువ్వించింది. దాడికి పాల్పడింది. దీనిపై విచారణకు కూడా ఆదేశించకుండా ఇది కార్యకర్తల మనోభావాలు దెబ్బతినడం వల్ల జరిగిన ఎమోషనల్ చర్య అంటూ కొట్టిపడేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పుడూ అదే తీరుగా ప్రధాని పర్యటనలో పార్టీ కార్యకర్తలతో దాడులను ప్లాన్ చేయిస్తున్నారా అని అనుమానిస్తున్నారు తెలుగు ప్రజానీకం. అందుకోసమే సుజనా చౌదరితో ప్రధానిని ఏపీలో పర్యటించొద్దని ముందస్తు ప్రకటనలు చేయిస్తున్నారని భావిస్తున్నారు. దాడులు జరిగితే మేము ముందే హెచ్చరించామని తప్పించుకోజూడటమే ఈ ప్రకటనల వెనుక ముఖ్యోద్దేశ్యం అంటున్నారు. 
భద్రతా బలగాల వైఫల్యం అని తప్పించుకోవాలనుకుంటున్నారా?
రాష్ట్రంలో ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడి తరహాలో ప్రధానికి ముప్పు వాటిల్లే కుట్రలేమైనా జరగనున్నాయా అన్నది సామాన్యుల్లో కలుగుతున్న అనుమానం. జగన్ వ్యవహారంలో విమానాశ్రయం కేంద్ర పరిధి అని రాష్ట్ర పోలీసు శాఖకు సంబంధం లేదని చేతులు దులుపుకుంది టీడీపీ ప్రభుత్వం. అంతేకాదు దర్యాప్తును తొలి క్షణం నుంచే నీరుగార్చే ప్రయత్నం చేసింది. హత్యాయత్నం చేసిన వ్యక్తిపై విచారణకు బదులు ప్రతిపక్షంపై ఆరోపణలు చేసేందుకే అతి ఉత్సాహం ప్రదర్శించింది. టీడీపీకి మాత్రమే కొమ్ముకాసే మీడియా సైతం అదే పంథాలో వార్తలు ప్రసారం చేసింది. మరి ఇలాంటి ఎల్లో కోటెడ్ పరిస్థితుల మధ్య ప్రధాని పర్యటనలో ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరన్నది తెలుగు ప్రజలను వేధిస్తోన్న ప్రశ్న. 
మోదీ ముందు మోకరిల్లే వాస్తవం మరోసారి ప్రజల ముందు బయటపడుతుందనే భయమా?
బీజేపీతో యుద్ధం అంటూ దీక్షలు చేస్తున్న టీడీపీ అధినేత దిల్లీలో మోదీ ముందు మాత్రం వంగిపోయి, వీర నవ్వులు చిందించిన విషయం ఎవ్వరూ మరిచిపోరు. ధర్మపోరాట దీక్ష లు పెట్టి మోదీనీ, బీజేపీ ప్రభుత్వాన్న తిడుతున్న చంద్రబాబు మోదీ కనిపించగానే భక్తితో చేతులు కలపడాన్ని అందరూ గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. బాబు భయం అంతా టీడీపీ నేతలపై జరుగుతున్న ఐటీ, ఈడీ, సీబీఐ ఎంక్వైరీల గురించీ, కేంద్రం చేతిలో ఉన్న తన కేసుల ఫైళ్ల గురించీ అని తెలియనిది ఎవరికి? అందుకే ఏపీలో బీరాలు పలికి, డాంబికాలు ప్రదర్శించే చంద్రబాబు మోదీ ముందు కుప్పిగంతులు వేయకుండా వినమ్రంగా ప్రవర్తిస్తాడని జాతీయ మీడియానే కోడై కూసింది. దిల్లీ వెళ్లే ప్రధాని కాళ్లు పట్టుకున్నంత పనిచేసిన చంద్రబాబు, ప్రధాని రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం కలవాల్సిన అవసరం ఉంటే ఏంచేయాలన్న మీమాంశలో పడుతున్నాడు. ప్రజల ముందైతే మోదీని ఎన్నైనా అనగలడుగానీ, నేరుగా ఎదురుపడ్డప్పుడు బాబులో అణువంతైనా ఆ వ్యతిరేకత కనిపించదు. ఆటోమేటిక్ గా వెన్ను వంగి, చేతులు సాగిలపడి, ముఖం విచ్చుకుని అన్ని అవయవాలూ తన ఆధీనంలో లేకుండా మోదీకి మోకరిల్లుతాయి. ఇదే జరిగితే ధర్మపోరాట దీక్షల పేరుతో తానే ఆడే డ్రామాలు, మోదీపై యుద్ధం అంటూ చేస్తున్న ప్రేలాపనల్లో వాస్తవాలూ ప్రజలు మరోసారి స్పష్టంగా గ్రహించేస్తారు. స్వరాష్ట్రంలోనే మోదీకి గులాంగిరీ చేసే తన అశక్తతను ప్రజలముందు పెట్టుకోలేకే చంద్రబాబు ప్రధానిని ఏపీ పర్యటనకు రాకూడదంటూ తన పార్టీ నేతలతో చెప్పిస్తున్నట్టుగా ఉంది. 
ప్రధానిని రాద్దని ఎందుకంటున్నారు?
అయినా ఓ ప్రధానమంత్రి స్థాయి వ్యక్తిని రాష్ట్రానికి రావద్దంటూ ఓ ఎంపీ చెప్పడం విడ్డూరమే. ఇదే ప్రధాని ముందు ఈ ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాలకోసం పోరాడాల్సి ఉంది. కానీ ఆ పని ఈరోజు వరకూ సక్రమంగా చేయని ఎంపీ ఏపీకి ప్రధానిని రావద్దని సలహా ఇవ్వడం విచిత్రం. పోనీ ఈ విషయాన్ని స్వయంగా ప్రధానికే నేరుగా చెప్పి ఉండొచ్చు. నిత్యం ప్లకార్డులతో పార్లమెంటు బయట కాలం వెళ్లబుచ్చుతున్న ఈ ఎంపీలు నిజంగా హోదా కోసమే పోరాటం చేస్తుంటే, మోదీ రాష్ట్రానికి అన్యాయం చేసాడని చెబుతున్నది వాస్తమే అయితే మీరు ఆంధ్రప్రదేశ్ కు రావడానికి వీల్లేదని చెప్పి ఉండొచ్చుగా. అంత పౌరుషాన్ని ప్రదర్శించి ఉండొచ్చుగా. లేదు. కేవలం మీడియా ముందు ఏదో అభిప్రాయంలా చెబుతున్న సుజనా చౌదరి ఆక్రోశం అంతా మోదీ మంచీ చెడూ లేకుండా తమ పార్టీ నేతలపై, తనపై ఐటీ దాడులు చేయించాడని. నిజానికి దర్యాప్తు సంస్థులు తమకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా విచారణలు చేపడతాయి. బ్యాంకులకు కుచ్చు టోపీలు పెట్టిన సుజనా చౌదరి పై ఐటీ తనిఖీలు చేస్తే, ఓటుకు కోట్ల కోసం పంచిన సొమ్ముల గురించి ఆరా తీస్తే ప్రధాని చెడ్డ వాడైపోతాడా? సిబిఐ తన కర్తవ్యం నిర్వహిస్తుంటే వీల్లేదని జీవో ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు ప్రధానిని కూడా రాష్ట్రానికి రావద్దంటూ జీవో ఇవ్వాలనుకుంటున్నాడని ఇప్పటికే సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సుజనా చౌదరి అదే మాటను మాట్లాడటం చంద్రబాబు స్క్రీన్ ప్లేలో భాగమే అంటున్నారు. 
రాజకీయాలను ప్రభుత్వంలోకి తేకూడదని సలహా ఇస్తున్న సుజనా
రాజకీయాలు వేరు ప్రభుత్వం వేరు అనే సూక్తి ముక్తావళి వినిపించారు సుజనా చౌదరి. పదవి కోసం తమ పార్టీ అధినేత చంద్రబాబుకు ఈ సూక్తులు సుజనా ఎందుకు వినిపించడం లేదో? లేక ఇతరులకు తప్ప వారి నీతులు సూక్తులు వర్తించవనో? ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రయోజనాలను కాక స్వప్రయోజనాల కోసం మోదీ చుట్టూ ముఫై సార్లు ప్రదక్షిణ చేసినప్పుడు రాజకీయాలు ప్రభుత్వం వేరు అని సుజనా చౌదరి చెప్పి ఉండాలి. ఓటుకు కోట్లు కేసునుండి తప్పించుకునేందుకు హోదాను దిల్లీలో తాకట్టు పెట్టినప్పుడు ఈ నీతులు సుజనా బాబు ముందు వల్లించి ఉండాల్సింది. ప్రభుత్వ పరిపాలనను పక్కనపెట్టి రాజకీయాలు మాత్రమే చేస్తున్న చంద్రబాబును సుజనా ఈపాటికే తన సూక్తులతో దారిలో పెట్టాల్సింది. అది మానేసి ఇప్పుడు ప్రధానమంత్రికి రాజకీయాలు పాలన పై క్లాసు పీకితే ఉపయోగం ఉండదు కదా!!
మంచి చెడ్డా చూడకుండా రైడ్స్ చేస్తున్నారు అంటూ సుజనా చౌదరి ఫీలౌతున్నాడు. అక్రమ ఆస్తులు అనే చెడును చూసే కదా సిబిఐ రంగంలోకి దిగింది. ఆ దర్యాప్తులో సుజనా మంచి బయటపడితే అదే సీబిఐ క్లీన్ చిట్ ఇస్తుంది గదా? జగన్ కేసుల విషయంలోనూ దర్యాప్తు తర్వాత అతడి నిజాయితీ నిరూపణ అవుతోంది కదా! సుజనా చౌదరి అంతటి సుద్దపూస అయితే దర్యాప్తు సంస్థలే ఆ విషయాన్ని ఒప్పుకుంటాయి. మరి మంచి చెడు చూడకుండా రైడ్సు అనడంలో సుజనా ఉద్దేశం ఏమై ఉంటుందని ఆలోచిస్తే టీడీపీ నేతలపై చేస్తే చెడు...వారి ప్రత్యర్థులపై చేస్తే మంచి అన్నది సుజనా మాటలకు అర్థం అయ్యుండొచ్చు. 
 
 
Back to Top