ఏడి‘పింఛన్‌’

  • సామాజిక పింఛన్ల మంజూరులో అర్హులకు అన్యాయం
  • జన్మభూమి కమిటీలకు లంచం ఇస్తేనే ప్రభుత్వ పథకాలు
  • అధికార పార్టీ నేతలు చెప్పిందే న్యాయం..చేసిందే చట్టం

వైయస్‌ఆర్‌ జిల్లా: ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో వివక్ష కొనసాగుతోంది. వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటుందనుకున్న సామాజిక పింఛన్లు అర్హులకు అందడం లేదు. అధికార పార్టీ నేతలు ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తూ అప్రజాస్వామికంగా జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి, వారికి పెత్తనం కట్టబెట్టడంతో పచ్చ చొక్కాలకే ప్రభుత్వ పథకాలు పరిమితమవుతున్నాయి. ఎన్‌టీఆర్‌ పింఛన్లు అర్హులకు అందడం లేదు. మైదుకూరు  నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల చేతుల్లో అధికారులు పనిచేస్తున్నారు. వారు చెప్పిందే...వేదం.. చేసిందే చట్టం. కాంట్రాక్టులు, ప్రభుత్వ సబ్సిడీ యంత్రాలు అధికార పార్టీ నాయకులకు వస్తున్నాయంటే ఆశ్చర్యం లేదు. చివరకు ప్రభుత్వం ఫించన్లు అందించే విషయంలో కూడా ఉద్యోగులు అధికార పార్టీ నాయకుల మాటలే వింటున్నారు. ఇందుకు నిదర్శనం మైదుకూరు మండలం లెక్కలవారిపల్లె గ్రామంలో ఫించన్లు మంజూరైన రీతే. 

ఈ పంచాయతీలో జన్మభూమి కమిటీ సభ్యురాలుగా ఉన్న అంకిరెడ్డిపల్లె పార్వతమ్మ భర్త అంకిరెడ్డిపల్లె చిన్నకొండారెడ్డి. ఈమెకు 65 సంవత్సరాలు ఉన్నట్లు ధృవపత్రాలను మంజూరు చేసి పింఛన్‌ అర్హత సాధించింది. నిజానికి ఓటర్ల జాబితా ప్రకారం 51 సంవత్సరాల వయసు  ఉంది. ఇక రేషన్‌ కార్డులో భర్త ఒక రేషన్‌ కార్డు తయారు చేసుకోగా, భార్య తనబిడ్డలతో మరో రేషన్‌ కార్డు పొందింది. ఒక రేషన్‌ కార్డులో 2009లో ఇచ్చిన ప్రకారం పార్వతమ్మ వయస్సు 42 అనగా ప్రస్తుతం ఆమె వయస్సు 50 సంవత్సరాలుగా ఉంది. కానీ భర్త రేషన్‌ కార్డులో అంకిరెడ్డిపల్లె చిన్నకొండారెడ్డి  70 సంవత్సరాలు, భార్య 1946లో పుట్టినట్లు ఆధార్‌ కార్డులో వివరాలు నమోదు చేసుకొని íపింఛన్లు మంజూరు చేసుకున్నారు. ఈమె 2014లోనే 65 సంవత్సరాలు ఉన్నట్లు íపింఛన్‌ కోసం ధరఖాస్తు చేసుకున్నారు. అదే పంచాయతీలో ఓబిల్ల చిన్న ఓబులేసు అంగవైకల్యంతో ఉన్నట్లు డాక్టర్లు సర్టిఫికెట్‌ ఇచ్చారు. ఈయనకు పింఛన్‌ పొందే అర్హత ఉన్నా..వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కావడంతో పింఛన్‌ మంజూరు చేయలేదు. కేవలం అధికార పార్టీ నాయకుల చేతుల్లో మండల అభివృద్ధి అధికారులు పనిచేస్తున్నారు. అర్హత లేని సర్టిఫికెట్లను ప్రభుత్వ అధికారులకు చూపించి ఫించన్‌ మంజూరు చేయించుకోవడంలో అంతర్యం ఏమిటని ప్రజలు పేర్కొంటున్నారు. కేవలం జన్మభూమి కమిటీలోని సభ్యులు చెప్పిన వారికే ఫించన్లు మంజూరు అయ్యాయని అర్హులైన వారికి పింఛన్లు మంజూరు కాలేదని ఆ పంచాయతీ సర్పంచ్‌ లెక్కల శివప్రసాద్‌రెడ్డి పేర్కొంటున్నారు. ఈ విషయంపై ఎంపీడీవో విజయకుమారిని విరవణ కోరగా ఆధార్‌ కార్డులో వయస్సు సరిగ్గా ఉండటంతోనే పింఛన్‌ మంజూరు చేశామని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. అర్హులకు ఫించన్లు అందకుండా అధికార పార్టీ వారికే కట్టబెట్టి ప్రభుత్వ అధికారులు స్వామి భక్తిని చాటారు.  

కర్నూలు జిల్లాలో డిసెంబర్‌ పింఛన్ల స్వాహా
నోట్ల రద్దు నేపథ్యంలో సామాజిక భద్రత పింఛన్‌దారులకు గండికొట్టింది. నగదు కొరత నేపథ్యంలో 2016 డిసెంబర్‌ నెల పింఛన్లను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పింఛనుదారులకు నగదు రూపంలో కాకుండా ఆ మొత్తాన్ని బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలనే నిబంధనను అడ్డుపెట్టుకొని కొందరు కార్యదర్శులు కనికట్టు చేశారు. టీడీపీ నేతల అండతో జిల్లా వ్యాప్తంగా రూ. 6 కోట్ల పింఛన్‌ సొమ్మును నొక్కేశారు. ఇలా లబ్ధిదారుల సొమ్మును స్వాహా చేస్తూ పచ్చ చొక్కాల మాటున జరుగుతున్న అన్యాయానికి అంతమెప్పుడో అని ప్రజలు శాపనార్థాలు పెడుతున్నారు.
Back to Top