వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ బస్సు యాత్రలో ఎన్నో విషయాలు ప్రజలకు చేరుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా పట్టి సీమ రేవు దగ్గర రైతులతో రచ్చ బండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పట్టి సీమ- పోలవరం ప్రాజెక్టుల గురించి విశ్లేషణాత్మకంగా, సరళంగా ప్రజలకు వివరించారు.
కమీషన్ల కోసమే ..కాంట్రాక్టర్ల ద్వారా దక్కే కోట్ల రూపాయల కమిషన్ల కోసమే చంద్రబాబు ప్రభుత్వం పట్టి సీమ పథకాన్ని చేపట్టింది. రైతుల ప్రయోజనాల్ని తుంగలో తొక్కి ధనార్జనే ధ్యేయంగా ముందుకు పోతోంది. పోలవరం తో రాష్ట్ర ప్రజలందరికీ ప్రయోజనాలు చేకూరితే, పట్టిసీమతో చంద్రబాబు కు మాత్రమే ప్రయోజనం లభిస్తుంది. పట్టిసీమ మీద పెట్టిన శ్రద్ధ లో పదో వంతు పోలవరం మీద పెడితే ప్రాజెక్టు త్వరలో్ పూర్తి అవుతుంది. ఏడాదికి రూ. 4,000 కోట్ల పనులు చేస్తే పూర్తయ్యే పోలవరం పనుల్ని పక్కన పెట్టేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఈ 10 నెలల కాలంలో కేవలం రూ. 100 కోట్ల మేర పనులు చేసిందంటే దీన్ని బట్టి పోలవరం మీద ఉన్న శ్రద్ధ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. నెల నెలా పోలవరం గడువను పెంచుతూ పోతున్న చంద్రబాబు...పోలవరం ప్రాజెక్టుని విస్మరిస్తే భవిష్యత్తులో చరిత్ర హీనుడిగా మిగిలిపోవటం ఖాయం.
నీరు రాకముందే నష్టాలు ఆరంభంగోదావరి ట్రిబ్యునల్ అవార్డులోని 7(ఇ) ప్రకారం పోలవరం ప్రాజెక్టుకి సీడబ్ల్యూసీ అనుమతి లభించిన వెంటనే, కుడికాల్వకు ఎప్పుడు నీరు మళ్లిస్తారనే విషయంతో నిమిత్తం లేకుండా 80 టీఎమ్ సీల్లో 35 టీఎమ్‌సీల నీటిని ఎగువ రాష్ట్రాల కర్నాటక, మహారాష్ట్ర వాడుకొనే స్వేచ్చ లభిస్తుంది. అదే విధంగా 7(ఎఫ్) ప్రకారం కుడికాల్వకు మళ్లించే అదనపు నీటిలో మరో 35 టీఎమ్‌సీల నీటిని తీసుకొని పోవచ్చు. అంటే గోదావరి నుంచి కృష్ణా కు చుక్క నీరు చేరకముందే.. 70టీఎమ్‌సీల నికర జలాల్ని కోల్పోయే ప్రమాదం ఉంది.
డబ్బుల మోసాలుపట్టిసీమ టెండర్ల లోనూ డబ్బులెత్తే మోసాలు జరిగాయి.. కేవలం ఇద్దరే కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొన్నారు. దగ్గరుండీ మిగతా కాంట్రాక్టర్లు రాకుండా భయపెట్టారు. 21.9శాతం ఎక్కువకు టెండర్ కోట్ చేసిన పట్టిసీమ కాంట్రాక్టర్ కు.. ప్రాజెక్టుని ఏడాదిలో పూర్తి చేస్తే 16.9శాతం బోనస్‌గా ఇస్తామని సర్కార్ హామీ ఇవ్వటం ముమ్మాటికి డబ్బులెత్తే చర్య అనుకోవాలి. పోలవరం కుడి కాల్వ పనులు, 1,800 ఎకరాల భూ సేకరణ, రామిలేరు, తమ్మిలేరు వాగులపై ఆక్విడెక్టు వంటి పనులకే రెండేళ్ల సమయం పడుతుంది. మరి ఏడాదిలోగా పనులు పూర్తవుతాయని చెప్పటం ఎంత వరక సబబు.
గోదావరి ఎడారే..!గోదావరి మీద ఎగువ ప్రాంతమైన తెలంగాణ లో కడుతున్న ఏడు ఎత్తిపోతల పథకాలు పూర్తయితే 70 వేల క్యూసెక్కుల నీటిని లిఫ్ట్ చేయటం జరుగుతుంది. పట్టి సీమ ద్వారా మరో 8,500 క్యూసెక్కుల నీటిని పంప్ చేస్తారు. అంటే మొత్తం 80 వేల క్యూసెక్కుల నీటిని తోడినట్లయితే దిగువన ఉన్న ఉభయ గోదావరి జిల్లాల పంట పొలాలకు నీరు ఎక్కడ నుంచి వస్తుంది. వరద లేనప్పుడు గోదావరి లో ఏడెనుమిది వేల క్యూసెక్కుల మించి నీరు ఉండటం లేదు. వరద సమయంలో 10వేల క్యూసెక్కుల నీరు ప్రవహించినా ఎగువన అదే పనిగా నీటిని తోడేస్తే దిగువకు చుక్క నీరు అందదు. అంటే పట్టి సీమ పుణ్యమా అని ఉభయ గోదావరి జిల్లాల పంట పొలాలు ఎడారులుగా మారటం ఖాయం.