చారిత్రక ఘట్టాన్ని ఆదరించిన పాతపట్నం

శ్రీకాకుళం  30 జూలై 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల మరో ప్రజా ప్రస్థానం చారిత్రాత్మక ఘట్టానికి పాతపట్నం నియోజకవర్గంలోని ధనుపురం వేదికైంది. ఆమె అడుగుపెట్టిన ప్రతిచోటా పూల వర్షం  కురిసింది. పాతపట్నం జనపట్టణంగా మారింది. చెరగని చిరునవ్వుతో, చురుకైన ఆ చూపులో, అలుపెరగని ఆ నడకలో అడుగడుగునా మహానేత దీప్తి, జగనన్నస్ఫూర్తి ప్రస్పుటమయ్యాయి. దీనిని గమనించిన పల్లెలన్నీ శ్రీమతి షర్మిలకు నీరాజనాలు పట్టాయి. రైతుల ఆవేదనను, మేదర్ల అవస్థలను, ఆడపడుచుల ఆర్తనాదాలను, చేనేత కార్మికుల సమస్యల్ని, గీత కార్మికుల ఇబ్బందులను అర్థం చేసుకొని జగనన్న వచ్చి మీ కష్టాలు, కన్నీళ్లు తుడుస్తాడంటూ వారందర్ని అక్కున చేర్చుకున్నారు.  అంతకుముందు 224వ రోజు పాదయాత్ర సారవకోట మండలం దాసుపురంలో ప్రారంభమైంది. ఏజెన్సీని తలపించే ప్రాంతం...ఎత్తు పల్లాల ఘాట్ రోడ్డు...చుట్టూ కొండలు...విసిరేసినట్టున్న గిరిజన గూడేల మధ్య సాగింది.

నవతల జంక్షన్ మీదుగా ధనుపురం చేరుకుంది. ప్రతీచోట గ్రామ పొలిమేరలో డప్పుల వాయిద్యాలతో ఎదురేగి ప్రజలు ఘనస్వాగతం పలికారు. హారతులిచ్చి జగనన్న సోదరిని అక్కన చేర్చుకున్నారు. కొరసవాడలో మేదర్లతో మమేకపై వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. కాగువాడలో చేనేత కార్మికులు, సూర్యనారాయణపురంలో రైతులతో సంభాషించారు. పాతపట్నం గ్రామానికి కిలోమీటర్ దూరం నుంచి భారీగా జనం పాదయాత్రలో పాల్గొన్నారు. గ్రామంలో ఉన్న మహానేత విగ్రహానికి పూలమాల వేసి శ్రీమతి షర్మిల నివాళులర్పించారు. ప్రజలు మాట్లాడాలని పట్టుబట్టడంతో బస్సుపైకి ఎక్కి అభివాదం చేస్తూ ముందుకుసాగారు. పాతపట్నం దాటిన తరువాత ఉన్న కస్తూరిబా గాంధీ బాలిక పాఠశాల విద్యార్థినులు జగన్ సోదరికి రోడ్డు పొడుగున నిల్చోని ఘనస్వాగతం పలికారు.

శ్రీమతి షర్మిల ముచ్చటించడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మారుమూల గ్రామమైన ధనుపురంలో వేలాది మంది అభిమానులనుద్దేశించి ప్రసంగించారు. సుదీర్ఘ పాదయాత్ర విశిష్టతను వివరించి, అధికార పక్ష కుట్రలను, ప్రతిపక్ష నేత చంద్రబాబు కుతంత్రాలను కడిగిపారేశారు. పిల్లనిచ్చిన మామకు వెన్నెపోటు పొడిచారని, నోరు విప్పితే అబద్ధమాడుతారని, నిజం చెప్పడమే తెలియదంటూ బాబుపై విరుచుకుపడిన ప్రతీసారి ప్రజలు కరతాళ ధ్వనులతో హోరెత్తించారు. సుమారు అరగంట ప్రసంగించి స్థానికులను ఆకట్టుకున్నారు. అక్కడి నుంచి కమలమ్మకొట్టు జంక్షన్, కొరసవాడ, కాగువాడ మీదుగా వడివడిగా అడుగులేశారు. దారిపొడవునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వైయస్ఆర్ తనయను కళ్లారా చూడాలన్న ఆరాటం, చేయి కలపాలన్న ఆత్రం, అడుగులో అడుగేసి నడవాలన్న కాంక్ష అందరిలో కన్పించింది. కొరసవాడలో చేనేత, గీత కార్మికులు కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు.

జగనన్న సీఎంగా వచ్చి న్యాయం చేస్తారని భరోసా ఇచ్చారు. దారిపొడవునా మహిళలను పలకరిస్తూ, వృద్ధులతో ఆప్యాయంగా మాట్లాడుతూ, రైతన్నల సమస్యలను తెలుసుకుంటూ, వికలాంగుల సాధకబాధలపై ఆరాతీస్తూ ముందుకు సాగారు. కొనసవాడ, కాగువాడ, ఊరగాం మీదుగా పాదయాత్ర పాతపట్నం చేరింది.

Back to Top