పసిగోడు


తొమ్మిది నెలలు అమ్మ గర్భంలో అపురూపంగా పెరిగిన శిశువు. ఆనందంగా జన్మించి అమ్మ ఒడిలో ఆడుకోవాల్సిన శిశువు. పుట్టుకకే పోరాడాల్సి వచ్చింది. పుడుతూనే తల్లిని పోగొట్టుకోవాల్సి వచ్చింది. పుట్టగానే ఆపదలను చవిచూడాల్సి వచ్చింది. ఎక్కడో కాదు.... ’’సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్’’... ’’ఆనంద ఆంధ్రప్రదేశ్’’..... ’’పదేళ్లు ఆయుష్షును పెంచే అమరావతి’’ ఉన్న ఆంధ్రప్రదేశ్ లో. విశ్వనగరం అని చెప్పే రాజధాని నగరం ఉన్న జిల్లాలో జరిగిన సంఘటన రాష్ట్రం సిగ్గుతో తలవంచుకునేలా చేసింది. అంతర్జాతీయ స్థాయి నిర్మాణాలు, అత్యున్నత ప్రమాణాలు, అభివృద్ధిలో కళ్లు చెదిరే లెక్కలూ మాట్లాడే రాష్ట్రంలో పసిగోడును వినే నాథుడే లేడు.
అంబులెన్స్ వెళ్లే వీలులేక గర్భిణీ మృతి
తిరుపతిలో లక్ష్మీ అనే గర్భిణీ స్త్రీ అంబులెన్సు వెళ్లే దారి లేక ఆటోలో ప్రయాణిస్తుండగా, దారిలోనే కాన్పు జరిగింది. మగబిడ్డ పుట్టాడు. కానీ ఆ తల్లి మాత్రం సరైన వైద్య సహాయం అందక మరణించింది. ఒక్క లక్ష్మీ మాత్రమే కాదు, రాష్ట్రంలో ఇలా ఎందరో లక్ష్ములు ఉన్నారు. ఆపదలో ఆదుకునే ఆపద్బంధు లేక అన్యాయంగా అశువులు బాస్తున్నారు. పాలకులు చెప్పే తల్లీబిడ్డా ఎక్స్ ప్రెస్ ఎక్కడుందో? పురిటి నొప్పులతో అల్లాడే వేళ అది ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు. 
ఇదేనా స్త్రీ శిశు సంక్షేమం
అంబులెన్సు కూడా లేని అధ్వాన్న ఆంధ్రప్రదేశ్. దీన్నే అభివృద్ధి అంటూ పొగుడుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మీరు భేష్. పుట్టిన బిడ్డకు కూడా మీ గురించి చెప్పమంటూ ఆశా వర్కర్లను ఆదేశిస్తున్న మీరు, గర్భిణీలకు పురిటి నొప్పుల సమయంలో సాయం చేయమని మాత్రం చెప్పరు. అత్యవసర సమయాల్లో వైద్య సేవలు అందేలా మాత్రం చేయరు. అంబులెన్సులు, 108లు అందుబాటులో ఉంచరు. సరైన రోడ్డు సదుపాయాలు ఏర్పాటు చేయరు. రాష్ట్రంలో ఇప్పటికి ఎన్నో సార్లు ఇలాంటి సంఘటనలు జరిగాయి. నడిరోడ్డుమీద కాన్పులు జరిగాయి. తల్లీ బిడ్డల్లో ఎవరో ఒకరు ప్రాణం పోగొట్టుకున్న సంఘటనలు ఇంకా మీ టెక్నాలజీ లో నెంబర్ వన్ గా ఉన్న ఈ రాష్ట్రంలోనే జరుగుతున్నాయి. సంతృప్తిలో నెంబర్ వన్ స్థానం తెచ్చుకున్న మీ పాలనలోనే పురిటిలో పసివాళ్ల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయ్. 
ఎలుకల పాలైన ప్రాణాలు
ఆరోగ్యాంధ్రప్రదేశ్ అని సీఎమ్ చంద్రబాబు మైకు ముందు ఉపన్యసిస్తుంటారు. అదే సమయంలో ప్రభుత్వాసుపత్రిలోని ఇంక్యుబేటర్ లో పసికందు ఆర్తనాదం రాష్ట్రం నలుమూలలా ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఎలుకలకు బలైన ఆ పసిగోడు ఆ పాలకుడి చెవులకు చేరదు. ఎలుకను పట్టేందుకు పాతికవేలు ఇవ్వగల ఉదారత్వం ముందు ప్రజల ఆరోగ్యం ఏపాటిది? 
వినండి బిడ్డలారా... ఈ మహోజ్వల పాలన గురించి పుట్టగానే మీ చెవిలో చెప్పేందుకు పూతనలను పంపుతున్నారు. తమ కర్కోటక ప్రభుత్వాన్ని కరుణా సముద్రం అని నమ్మించబోతున్నారు. పాలుతాగే పసిపాపల వద్ద కూడా విషం కక్కే ఆలోచనలు చేస్తున్నారు. ఈ రాక్షస పాలన ఉన్నంత కాలం, ఈ దగాకోరు పాలకులున్నంత కాలం పసిగోడు వినేవాడు లేడు. పసిపాపల బోసినవ్వులు విరియాలన్నా, చిన్నారుల ముఖాలు చిరునవ్వులు చిందాలన్నా, ప్రజల బతుకుల్లో చీకటి తొలగాలన్నా రాష్ట్రంలో మార్పుకు నాంది పలకాలి. నవ నాయకత్వానికి, ప్రజాసంక్షేమ వారసత్వానికి అధికారం దక్కాలి. అప్పుడే ఈ రాష్ట్రంలో మూగ వేదనకు పరిష్కారం దక్కుతుంది. పసి హృదయాల్లో సంతోషం వెల్లివిరుస్తుంది.  
Back to Top