నారా జిత్తులు - కొత్త పొత్తులు



టీటీడీపీ ఎర - జాతీయ స్థాయి వల

వైయస్ఆర్ సీపీ ని దెబ్బతీయడమే లక్ష్యంగా కాంగ్రెస్ తో దోస్తీ

 తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల మధ్య పెరుగుతున్న అనుబంధం రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో దీపావళి టపాకాయలా పేలుతోంది. ఈ పొత్తు వ్యవహారంపై టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లోని వారితో సహా విపక్షాలకు చెందిన వారు కూడా విమర్శల బాంబులు పేలుస్తున్నారు. అయితే ఈ పొద్దు పొడుపు అనేది, దేశవ్యాప్తంగా బిజెపి వ్యతిరేక కూటమి ఏర్పాటు కోసం అంటూ పైకి చెపుతున్నా, చంద్రబాబు రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా, చాలా దూరా(దురా)లోచనతో వేసిన అడుగే అనే వాదనలు వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో చంద్రబాబును మించిన అవకాశవాది లేరన్నది ఎంత సత్యమో, కేంద్రంలో అధికారమే పరమావథిగా కాంగ్రెస్ కూడా ఎంతకైనా దిగజారడానికి సిద్దపడిన సంగతి అంతే వాస్తవం. ఈ రెండింటి పర్యవసానమే తెలంగాణా ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలన్న నిర్ణయం అనేది వినడానికి బాగానే అనిపిస్తున్నా, దీని వెనక బాబు  బహుముఖ వ్యూహం ఉన్నట్లుగా తెలుస్తోంది.

తెలంగాణా ఫలితాలు, బిజెపి వ్యతిరేక పవనాలు, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో తన ప్రభుత్వం, తనపైనా రోజురోజుకు పెరుగుతున్న అసంతృప్తి, అవినీతి ఆరోపణలు, వైయస్ఆర్ కాంగ్రెస్ బలోపేతం అవుతుండటం, వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర తదితర అంశాలన్నిటినీ క్రోడీకరించుకుని బాబు ప్లాన్ ఎ, ప్లాన్ బి ఫార్ములాలతో పొత్తులకు సై అంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ రెండు ప్లాన్ లు కూడా రాష్ట్రంలో తన రాజకీయ ప్రత్యర్థి వైయస్ఆర్ కాంగ్రెస్, ఆ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బగొట్టి బలహీన పర్చాలన్న తంత్రంలో భాగమే అని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

కాంగ్రెస్ తో కలవడం ద్వారా సొంత రాష్ట్రంలో (ఏపీలో) వైయస్ఆర్ కాంగ్రెస్ ను ఇబ్బందుల పాలు చేయడమనేది ప్లాన్ ఏ లో భాగం. ఆపార్టీకి జాతీయస్థాయి నాయకుల మద్దతు ప్రధానంగా కాంగ్రెస్, బిజెపిల్లో దేని మద్దతు లేకుండా చేయాలన్నది బాబు లక్ష్యం. తద్వారా ఇక్కడి నుంచి జాతీయస్థాయిలో చక్రం తిప్పే స్థాయి తనకు మాత్రమే ఉందని చాటుకోవడం.  ఇందుకోసం ప్రత్యేక హోదా అంటూ పోరాటం చేస్తున్న వైయస్ఆర్ కాంగ్రెస్ కు ఆ మైలేజి రాకుండా చూడటమే కాకుండా, ఏమి చేసినా తనతోనే అన్న బిల్డప్ కోసం వేసిన రాజకీయ ఎత్తుగడ. ఇదేలాసాధ్యమో ఒకసారి చూద్దాం.

చంద్రబాబు నాయుడు చరిత్ర చూస్తే, వామపక్షాలు, బిజెపితో అనేక సార్లు ఇప్పటికే పొత్తులు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేశారు. రాష్ట్ర విభజన సందర్భంగా బిజెపి వస్తేనే రాష్ట్రానికి మేలు జరుగుతుందంటూ ఆపార్టీతో జత కట్టి అధికారంలోకి రావడమే కాకుండా, నాలుగేళ్లు ఆ పార్టీతో అంటకాగుతూ, తన అవసరాలన్నిటినీ (రాజకీయంగా, పారిశ్రామికంగా ఇతరత్రా స్వార్థ ప్రయోజనాలన్నిటిని) పొందిన తరువాత ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రత్యేక హోదా ఇవ్వని కారణంగా బయటకు వస్తున్నామంటూ బిజెపికి కటీఫ్ చెప్పారు. ఇదే సమయంలో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దాని అధ్యక్షులు తెలుగుదేశం , చంద్రబాబు వైఫల్యాలు, అవినీతి అక్రమాలపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయడమే కాకుండా, గతంలో కంటే బలోపేతం అయ్యారు. లోకసభ ఎన్నికల అనంతరం రాష్ట్రానికి ఏ పార్టీ ప్రత్యేక హోదా ఇస్తే ఆ పార్టీకే తమ మద్ధతు అని వైయస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టంగా ప్రకటిస్తున్నారు. అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న బిజెపి ఇవ్వలేదు  కాబట్టి, తదుపరి అధికారంలోకి వస్తుందనుకుంటున్న కాంగ్రెస్ ఇస్తానని స్పష్టంగా చెపుతున్న నేపథ్యంలో ఎన్నికలయ్యాక వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమికి మద్థతు ఇవ్వక తప్పని పరిస్థితి (అది కూడా ప్రత్యేక హోదా ప్రకటించిన తరువాతనే).

తెలుగుదేశం రాజకీయ ఎత్తుగడలకు ఈ ప్రకటనే నాందిగా మారింది. లోకసభ ఎన్నికల తరువాత జాతీయ స్థాయిలో వైయస్ఆర్ సీపీకు ఎక్కడా ప్రాతినిధ్యం లేకుండా చేయాలన్న తలంపుతో కాంగ్రెస్ తో పొత్తుకు సిద్ధపడిందనే విశ్లేషణలు వస్తున్నాయి. కాంగ్రెస్ కూటమి ప్రత్యేక హోదా ప్రకటిస్తే అప్పటికే కూటిమిలో భాగస్వామిగా ఉన్న తమదే ఆ క్రెడిట్ అని చెప్పుకోవచ్చని, అప్పుడు  వైయస్ఆర్ కాంగ్రెస్ అనివార్యంగా ప్రత్యామ్నాయ వాదనలను వెతుక్కోవాల్సిన రాజకీయ సంకట స్థితిని కల్పించాలన్నది, టిడిపి, చంద్రబాబు వ్యూహంలో భాగంగా ఉన్నట్లుగా చెపుతున్నారు.

కిందపడ్డా పైచేయి నాదే చెప్పుకునే చంద్రబాబు ఇందుకోసం తొలుత తెలంగాణ ఎన్నికల్లో వీలైనంత వరకు త్యాగం చేయడంతోపాటు, ఒకవేళకూటమి గెలిస్తే, గతంలో కర్నాటక ,ఇప్పుడు తెలంగాణలో నేను ఏది చెపితే అదే అంటూ , ఏపీలోని విపక్షాల మనోధైర్యాన్ని దెబ్బతీయడమే కాకుండా, తనకు పాజిటివ్ ఇమేజిని పెంచుకోవచ్చన్నది బాబు ఆలోచన.

ఇదంతాప్లాన్ ఏ లో భాగంగా అమలు చేస్తున్నది. ఒకవేళ ఇది విఫలమైతే ప్లాన్ బి ని కూడా సిద్ధంగా ఉంచుకుని ఎలాగైనా సరే వైయస్ఆర్ కాంగ్రెస్ ను దెబ్బతీయాలని ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లుగా చెపుతున్నారు.

తెలంగాణా ఫలితాలు ఎలా ఉన్నా, త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ కు అధిక సంఖ్యలో ఎంపి సీట్లు, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా కూడా తన ఆధిపత్యమే కొనసాగేలా బాబు ఇప్పటి నుంచి పునాదులు వేసుకుంటున్నట్లుగా కనపడుతోంది. దేశ వ్యాప్తంగా ప్రస్తుతమున్న పరిస్థితుల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే కు వ్యతిరేక పవనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే కాంగ్రెస్ నేతృత్వంలోనే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటం అనివార్యంగా ఉంది, అందుకనే ఇప్పటి నుంచి ఆ సంకీర్ణంలో తానే కీలకమంటూ ఎవ్వరూ హోదా ఇవ్వకున్నా సొంతగా పెద్దన్న బాధ్యతలను నెత్తినవేసుకుంటున్నారు. ఇలా వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగినా, కేంద్రం నుంచి సహాయ నిరాకరణ ఉండేలా ఇప్పటి నుంచే ప్లాన్ వేస్తున్నారు. వీటితో పాటు కేంద్రంలో తన అనుయాయూలకు ఇటీవలి వరకు సమకూరినవన్నీ (బిజెపి ప్రభుత్వంలో పొందినవి అంటే పదవులు, పనులు, పలుకుబడి వంటివి) కొనసాగేలా చూసుకోవడం వంటి వాటికి గట్టి ఫౌండేషన్ వేసుకుంటున్నారు. ఇదీ బాబుగారి ప్లాన్ బి

ఇలా ఏది జరిగినా తనకు అనుకూలంగా మార్చుకోవాలన్న రాజకీయపుటెత్తుగడలతో బాబు ముందుకు పోతున్నారు. వీటి ఫలితాలెలా ఉంటాయో వేచి చూడాల్సిందే! 
 
Back to Top