మతిలేని దేవినేని

 

ఎపి నీటిపారుదల శాఖామంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు కు రాష్ట్రంలో మూలనపడ్డ ప్రాజెక్టులకంటే ప్రతిపక్ష నేతపై విరుచుకు పడటమే ఎక్కువ ఇష్టం. ఆయన తన శాఖకు సంబంధించి పనుల్లో పురోగతి గురించి ఒక్కనాడూ ప్రజలకు వివరించరు. కేవలం ప్రతిపక్ష నాయకుడిని తిడుతూనో, దుయ్యబడుతూనో కనిపిస్తారు. అంతే మరి వైఎస్ జగన్ ను తిట్టడం ద్వారా ప్రభుత్వ అసమర్థతకు ముసుగేయడం అనే మంత్రిత్వ శాఖనే ముఖ్యమంత్రి చంద్రబాబు దేవినేని ఉమకు కట్టబెట్టార్ట. ఆ పని మాత్రం సజావుగా చేస్తున్నాడు దేవినేని.

 

నదుల అనుసంధానం, ప్రాజెక్టుల అభివృద్ధి, పోలవరం పరుగులు, పులివెందుల్లో కృష్ణాజలాలూ ఇవేవీ జగన్ కు కనిపించడం లేదా అంటూ అమాయకంగా అడుగుతున్నాడు దేవినేని. జగన్ కు ఇవన్నీ కనిపించాల్సిన అవసరం లేదు కానీ ప్రజలకు మాత్రం కనిపించాల్సిన అవసరం చాలా ఉంది. చంద్రబాబు నిజంగా ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే, రాయలసీమకు బాబు నిష్పక్షపాతంగా నీళ్లు వదిలింది వాస్తవమే అయితే అది జగన్ కు కనిపించకపోయినా రాయలసీమ ప్రజానీకానికైతే కనిపిస్తుంది. కళ్లార్పకుండా అబద్ధాలు ఆడగల చంద్రబాబు, ఆయన్ను మించికళ్లలోకి చూస్తే మతిలేని మాటలు మాట్లాడే దేవినేని వీళ్లకు వైఎస్ జగన్ పై విమర్శలు తప్ప వ్యవసాయ రంగానికి నష్టం చేస్తున్న ప్రాజెక్టుల జాప్యం గురించి పట్టనే పట్టదు.

పులివెందులకు నీళ్లిచ్చామని చెలరేగిపోతున్న టిడిపి నేతలు వాస్తవాలను మాత్రం ప్రజలముందుకు రాకుండా జాగ్రత్తలు పడుతున్నారు.

పచ్చనేతలు పాతిపెడుతున్న నిజాలివి....

నిన్నా మొన్నటి వరకూ ఖరీప్ సీజన్ లో వర్షాలు లేక తీవ్ర కష్టాలు ఎదుర్కొని పంటలు సాగుకాక రైతులు చితికిపోయి ఉన్నారు. కనీసం ఈ రబీ సీజ్ లో అయినా పంటుసాగు సాధ్యమేనా అనుకుంటూ కంటనీరు ఒలికిస్తున్నారు కడపజిల్లాకు చెందిన అన్నదాతలు.

కడప జిల్లా మొత్తం మీద 2100 చెరువులు ఉన్నాయి. వీటిలో 100 ఎకరాలకు సాగునిచ్చే చెరువులు 299 కాగా, 100 లోపు ఎకరాలకు నీరు అందించే చెరువులు 1841 ఉన్నాయి.

ఇన్ని చెరువులు ఉండగా చంద్రబాబు ప్రభుత్వం నీరు నింపింది నిండా 40 చెరువులకు మాత్రమే. అదికూడా ప్రధానంగా చిత్రావతి, తెలుగు గంగ పరిధిలోని చెరువుల్లో మాత్రమే నీటిని నింపారు.

శ్రీశైలం రిజర్వాయిర్ నుంచి వచ్చే నీటి విడుదల భారీగా తగ్గించారు. దీనివల్లే జిల్లాలోని చెరువులకు వస్తున్న నీరు తగ్గిపోయింది.

శ్రీశైలం రిజర్వాయిర్ నుంచి కృష్ణా జలాలను తరలించి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోని చెరువులనూ నింపి రబీసీజన్ లో రైతులను ఆదుకుంటామని ముఖ్యమంత్రి పల్కిన ప్రగల్భాలు నీటి మూటలే అయ్యాయి.

జిఎన్ఎస్ఎస్, తెలుగు గంగ, కేసీ కెనాల్ కు చెందిన ఇరిగేషన్ అధికారులతో మంత్రి సోమిరెడ్డి మంతనాలైతే చేసాడు కానీ రైతులకు నీటిని మాత్రం విడుదల చేయించలేదు.

శ్రీశైలం నుంచి ఎంత నీరు వస్తోంది, పోతిరెడ్డిపాడు వద్ద నిల్వ ఎంత ఉంది, గండికోటలో నిల్వ ఎంతుందో సమీక్ష మాత్రం జరిపి మిన్నకుండిపోయారు.

చిత్రావతి రిజర్వాయిర్ పరిధిలోని సింహాద్రిపురం, తొండూరు, పులివెందుల, పొద్దుటూరు, మైదుకూరు, జమ్మలమడుగు ప్రాంతాల్లోని చెరువులకు మాత్రమే నీరు విడుదల చేసిన ప్రభుత్వం మొత్తం జిల్లాకు కృష్ణా జలాలు పంపిణీ చేసామంటూ ప్రచారం చేసుకుంటోంది.

కేసీ కెనాల్ పరిధిలో రెండు నెలలుగా నీరు వస్తున్నా చివరి ఆయకట్టు ప్రాంతాలైన ఖాజీపేట మండలంలోని చెరువుల్లో చుక్కనీరు లేకుండా పోయింది. ఎన్నో మండలాలు కరువు కోరల్లా అల్లాడుతున్నాయి.

రావులపల్లి, దుంగలగట్టు, కనేనలవాగు, చెముళ్లపల్లి చెరువులునీరందక ఈ ప్రాంతాల్లో రైతులు పంట వేయాలో వద్దో తెలియక సతమతం అవుతున్నారు.

లక్షలాది ఎకరాల్లో పంటల సాగు ప్రశ్నార్థకమై రైతన్నల కన్నీళ్లు నేలలో ఇంకుతుంటే పులివెందులకు నీళ్లిచ్చాం, కడపను సస్యశ్యామలం చేసాం కనిపించడం లేదా అంటూ దేవినేని దగుల్బాజీ మాటలు మాట్లాడటం వారి అహంకారానికి నిదర్శనం. అద్దంలో చంద్రుణ్ణి చూపి పిల్లలను మోసం చేయగలరేమో, అడుగడుగునా కరువు బారిన పడి కన్నీళ్లు చిందిస్తున్న కడప రైతాంగాన్ని 'కమ్మని' మాటలతో మోసగించలేరు. అందుకే జగన్ అడిగే ప్రతిమాటా ప్రభుత్వానికి  శరాఘాతం అవుతోంది. అబద్ధాలను కల్పించి ప్రతిపక్ష నేతపై ఆ మంత్రుల దండును ఉసిగొల్పుతోంది. ఎన్ని పిల్లిమొగ్గలేసినా పులివెందులకు కృష్నా జలాలు ఎంతవరకూ వచ్చాయో, ఆ నీళ్ల వెనక చంద్రబాబు ఓటు రాజకీయం ఎంతుందో తెలియని అమాయకులు రాయలసీమలో ఎవరూలేరని దేవినేని తెలుసుకుంటే మంచిది.

 

తాజా వీడియోలు

Back to Top