మహాభిమానం ముందు మండుటెండ వెలవెల

కొత్తగూడెం (ఖమ్మం జిల్లా) : మండుటెండ సైతం నివ్వెరపోయేలా ఖమ్మం జిల్లా కార్మికవాడలు కదం తొక్కాయి. రాజన్న బిడ్డ, జగనన్న సోదరి శ్రీమతి షర్మిల పట్ల మహాభిమానం ప్రదర్శించాయి. సింగరేణి ప్రాంతం జై జగన్ నినాదాలతో మార్మోగింది. శ్రీమతి షర్మిలను చూసేందుకు మహిళలు దారి పొడవునా నిరీక్షించారు. తన కోసం వచ్చిన ప్రతి ఒక్కరినీ శ్రీమతి షర్మిల ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు.

ప్రజల సమస్యలను పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న ప్రభుత్వం తీరుకు నిరసనగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న పాదయాత్ర ఖమ్మం జిల్లాలో 13వ రోజు సోమవారంనాడు 13 కిలోమీటర్లు కొనసాగింది. కొత్తగూడెంలోని భజన మందిరం నుంచి ప్రారంభమైన పాదయాత్ర ఫైవ్ ఇంక్లై‌న్ వరకు సాగింది. భజన‌ మందిరం ప్రాంతంలో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి ఉదయమే పెద్ద ఎత్తున చేరుకున్న మహిళలను శ్రీమతి షర్మిల పలకరించి పాదయాత్ర ప్రారంభించారు.

గాజులరాజం బస్తీ, బూడిదగడ్డ మీదుగా మెయిన్‌ హా‌స్పిటల్ వరకు పాదయాత్ర కొనసాగింది. దారి పొడవునా మహిళలు శ్రీమతి షర్మిలను చూసేందుకు బారులు తీరారు. మెయిన్ హా‌స్పిటల్ ‌ప్రాంతానికి పాదయాత్ర చేరుకోగానే పెద్ద ఎత్తున మహిళలు వచ్చి శ్రీమతి షర్మిలకు స్వాగతం పలికారు. అనంతరం నర్సు క్వార్టర్ల మీదుగా పాదయాత్ర సింగరేణి ప్రధాన కార్యాలయం వద్దకు చేరుకోగానే పలువురు సింగరేణి ఉద్యోగులు రోడ్డుపైకి వచ్చి శ్రీమతి షర్మిలకు అభివాదం చేశారు. అక్కడి నుంచి పాదయాత్ర సుభాష్‌ చంద్రబోస్‌ నగర్ మీదుగా రామవరానికి చేరుకుంది.

రామవరం ప్రధాన సెంటర్‌లో ఏర్పాటు చేసిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండాను శ్రీమతి షర్మిల ఆవిష్కరించారు. అక్కడి నుంచి 14వ నెంబర్ ఏరియా మీదుగా త్రీ ఇంక్లై‌న్ వరకు పాదయాత్ర సాగింది. త్రీ ఇంక్లై‌న్ వద్ద ఏర్పాటు చేసిన వై‌యస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండాను శ్రీమతి షర్మిల ఆవిష్కరించి, మహానేత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. త్రీ ఇంక్లైన్ రహదారి వెంట కార్మికుల కుటుంబాల‌ వారు రోడ్డుపైకి వచ్చి పాదయాత్రికురాలు శ్రీమతి షర్మిలకు స్వాగతం పలికారు.

అనంతరం పాదయాత్ర జిఎం కార్యాలయం మీదుగా ఆనందఖనికి చేరుకుంది. ఈ దారిలో ఆర్‌సిహెచ్‌పిలో పనిచేసే కార్మికులు, జిఎం కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు రోడ్డుపైకి వచ్చి శ్రీమతి షర్మిలకు స్వాగతం పలికారు. ఆనందఖని వద్దకు పాదయాత్ర చేరుకోగానే మహిళలు మంగళహారతులు పట్టి స్వాగతం పలికారు. గౌతంఖని ఓపెన్‌కాస్టులో పనిచేసే కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు శ్రీమతి షర్మిలకు స్వాగతం పలికారు. దారి పొడవునా టిప్పర్‌లలో పనిచేసే డ్రైవర్లు ఆమెకు ఎదురు వచ్చి స్వాగతం పలికారు. వారికి అభివాదం చేస్తూ శ్రీమతి షర్మిల ముందుకు సాగారు. అక్కడి నుంచి ఫైవ్ ఇంక్లై‌న్ వరకు పాదయాత్ర సాగింది. ‌ఫైవ్ ఇంక్లై‌న్ వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో శ్రీమతి షర్మిల సోమవారం రాత్రికి బస చేశారు.

మండుటెండ... మహాభిమానం :
కొత్తగూడెంలో సోమవారం అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఒక వైపు ఎండవేడిమి ఉన్నా మహిళలు శ్రీమతి షర్మిలను చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చి రోడ్డుకు ఇరువైపులా బారులు తీరారు. ఉదయం 9 గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపించినా గాజులరాజం బస్తీ, మెయిన్‌ హాస్పిటల్, సింగరేణి ప్రధాన కార్యాలయం, రామవరం ప్రాంతాలలో పెద్ద ఎత్తున మహిళలు వచ్చి‌ శ్రీమతి షర్మిలకు స్వాగతం పలికారు.

తాజా ఫోటోలు

Back to Top