జన హోరు...కరతాళ ధ్వనుల జోరు

ఆమె ఒక అడుగు వేస్తే వేలాది అడుగులు అనుసరిస్తున్నాయి... ఆమె ఒక్కసారి చేయి ఊపితే... వేలాది చేతులు ప్రతిస్పందిస్తున్నాయి... ఆమె పిలుపుకోసం... ఆమె కరచాలనం కోసం... ఆమె పలకరింపు కోసం... ఆమె చిరునవ్వుకోసం ప్రతి ఒక్కరూ పరితపిస్తున్నారు... ఆమె కనిపిస్తే చాలు... కేరింతలు కొడుతున్నారు... ఆమె ప్రసంగిస్తే చాలు కరతాళ ధ్వనులు చేస్తున్నారు.. ప్రత్యర్థులపై ఆమె విరుచుకుపడుతున్నపుడు శహభాష్ అంటూ మద్దతిస్తున్నారు... ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ఆమె నిప్పులు చెరిగినపుడు అవును... అవును... అంటూ వంతపాడుతున్నారు... జగనన్న వస్తారు... రాజన్న రాజ్యం తెస్తారని భరోసా ఇస్తున్నపుడు గుండెలనిండా నిబ్బరాన్ని పొందుతున్నారు. జోరుగా... హుషారుగా సాగిపోతున్న ఆమెను చూసి సంతృప్తిగా ఇళ్లకు చేరుతున్నారు... ఇదీ చిలకలూరిపేటలో షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర తీరు.

గుంటూరు:

పల్లె, పట్టణం అనే తేడా లేకుండా షర్మిలకు అన్ని వర్గాల ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. ఆమె రాకకోసం రోడ్లకు ఇరువైపులా బారులు తీరుతున్నారు. సంప్రదాయ రీతిలో స్వాగతం పలుకుతున్నారు. ఆమె నిర్వహిస్తున్న రచ్చబండలో కాంగ్రెస్ ప్రభుత్వం, దానితో అంటకాగుతున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడి వలన పడుతున్న బాధలను వివరిస్తున్నారు. తమ సమస్యలు పట్టించుకోని ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని షర్మిల సమక్షంలో ప్రతిన బూనుతున్నారు. మహానేత దివంగత డాక్టర్ వైయస్ఆర్ హయాంలో హాయిగా బతికామని చెబుతూ, కుట్రలు, కుతంత్రాలతో శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డిని జైలుకు పంపిన కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతామంటున్నారు.

సోమవారం చిలకలూరిపేట నియోజకవర్గం యడ్లపాడు మండలంలో నిర్వహించిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రజలు బారులుతీరి ఆమెకు ఘనస్వాగతం పలికారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు 14.3 కిలోమీటర్లు సాగిన పాదయాత్రలో రచ్చబండతోపాటు నాలుగు ప్రాంతాల్లో మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను అవిష్కరించారు. అన్ని ప్రాంతాల్లోనూ అదే హోరు....ఆదే జోరు సాగడంతో పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం వెల్లివిరిసింది.

గణపవరం నుంచి యాత్ర ప్రారంభం..
గణపవరం సాంబశివ కాటన్ మిల్లు ఆవరణ నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభమైంది. అక్కడికి మూడు కిలోమీటర్ల దూరంలోని తిమ్మాపురం వరకు సాగిన పాదయాత్రలో దారి పొడువునా పత్తిమిల్లుల్లో పనిచేస్తున్న కార్మికులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. తమ సమస్యలను వివరించారు. పంట పొలాలకు నీరు లేకపోవడంతో ప్రకాశం జిల్లా నుంచి ఇక్కడికి పనుల కోసం తరలివచ్చామని వివరించారు. ఏళ్ల తరబడి ఈ ప్రాంతంలో పనిచేస్తున్నా రేషన్‌కార్డులు, హెల్తుకార్డులు లేవంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తిమ్మాపురం కాలనీలో జరిగిన రచ్చబండలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.

 తాగేందుకు నీరు లేదని, రోజుకు మూడు గంటలకు మించి కరెంటు సరఫరా ఉండటం లేదని, కాలనీలో కనీస సౌకర్యాలు ఉండటం లేదని వివరించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ, చార్జీలు పెంచకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత మహానేత వైఎస్‌కు దక్కుతుందన్నారు. జగనన్న పాలనలో రాజన్న పాలన వస్తుందని, అప్పటి వరకు ఓపిక పట్టాలని కోరారు. అక్కడి నుంచి తిమ్మాపురం చేపల చెరువు సెంటరులో ఏర్పాటు చేసిన బసకు చేరుకున్నారు. మధ్యాహ్నం బస తరువాత సాయంత్రం యడ్లపాడుకు పాదయాత్ర ప్రారంభమైంది.

జాతీయ రహదారికి ఇరువైపులా ప్రజలు బారులుతీరి ఆమెకు స్వాగతం పలికారు. యడ్లపాడు సెంటరులో అధిక సంఖ్యలో హాజరైన ప్రజలందరికీ కనిపించడానికి వీలుగా వాహనం ఎక్కి ప్రజలకు అభివాదం చేశారు. అక్కడి నుంచి మైదవోలు గ్రామం వరకు రోడ్లకు ఇరువైపులా మహిళలు, పిల్లలు, పెద్దలు, వ్యవసాయ కూలీలు ఘన స్వాగతం పలికారు. అనంతరం మర్రి రాజశేఖర్ కమ్యూనిటీ హాలుకు సమీపంలో ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహాన్ని షర్మిల ఆవిష్కరించి ప్రసంగించారు. సమయం వచ్చినపుడు కాంగ్రెస్, టీడీపీలకు బుద్ధిచెప్పాలని ఆక్కడి ప్రజలను కోరారు.

టీడీపీలో బీసీలకు అన్యాయం..
అక్కడి నుంచి లింగారావుపాలెం బీసీ కాలనీలో మహానేత విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం షర్మిల మాట్లాడుతూ టీడీపీలో బీసీలకు ఏ విధంగా అన్యాయాన్ని వివరించారు. వంద సీట్లు ఇస్తానని చెప్పి, 44 సీట్లు ఇచ్చారని, ఇప్పుడుకూడా దాడి వీరభద్రరావు విషయంలోనూ అదే విధంగా వ్యవహరించారని విమర్శించారు. అక్కడి నుంచి లింగారావుపాలెం మెయిన్ సెంటరులో మాజీ ఎమ్మెల్యే సోమేపల్లి సాంబయ్య విగ్రహానికి పూలదండ వేసి నివాళులు అర్పించారు. అక్కడి నుంచి లింగారావుపాలెం నుంచి చిరుమామిళ్ల గ్రామానికి వెళ్లే రోడ్డులో బసకు చేరుకున్నారు.

ఈ కార్యక్రమాల్లో పత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత, జిల్లా పార్టీ కన్వీనర్ మర్రి రాజశేఖర్, అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, గుంటూరు సిటీ కన్వీనరు లేళ్ల అప్పిరెడ్డి, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కావటి మనోహరనాయుడు, మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నర్సయ్య, ఎస్సీఎస్టీబీసీ కన్వీనర్లు సాయిబాబు, హనుమంత్‌నాయక్, దేవళ్ల రేవతి, గుంటూరు సిటీ ట్రేడ్ యూనియన్ కన్వీనర్ రసూల్, నగర యువజన కన్వీనరు మహ్మద్ నససీర్, పార్టీ నాయకులు మహ్మద్ ముస్తాఫా, ఉయ్యూరు వెంకటరెడ్డి, ఆల్తాఫ్, నూర్ మస్తఫా, మౌలాలి యడ్లపాడు, నాదెండ్ల మండల కన్వీనరు చల్లా యజ్ఞాశ్వరరెడ్డి, కాట్రగడ్డ మస్తాన్‌రావు తదితరులు హాజరయ్యారు.

Back to Top