ప్రభుత్వ తప్పులు మాఫీ

 

పట్టపగలే ప్రజాస్వామ్యం మాడి బుగ్గైపోయిన ఘటన చంద్రబాబు పాలనలోనే జరిగింది. అన్నపూర్ణ అని పిలిచే నేల మీద, ధాన్యరాశులను లక్ష్మిగా కొలికే నేల మీద పచ్చని పంటలు దగ్ధమైపోయిన దారుణం చంద్రబాబు హయాంలోనే జరిగింది. ఇలాంటి దహన కాండ ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే లేదు. ఇలాంటి చీకటి రోజును ముందు తరం చూడాలనుకోదు. 2014లో విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించాడు. రాజధాని కోసం 33 వేల ఎకరాల సమీకరణ మొదలు పెట్టాడు. ఏడాదికి మూడు పంటలు పండే మాగాణి భూములను ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతులను భయభ్రాంతులకు గురిచేసి మరీ లాక్కున్నాడు. ఎదురు తిరిగి తమ భూములను ఇవ్వమన్న రైతుల పొలాలు తగలబడ్డాయి. వ్యవసాయ పనిముట్లు మండి మసైపోయాయి. కాదంటే మనుషులూ అలాగే కాలిపోతారనే సంకేతాలు వినవచ్చాయి. ఓ క్రూరమైన కాలాన్ని చవిచూసిన రోజులవి.

పెనుమాక, ఉండవల్లి, వెంకటపాలెం, ఉద్దండరాయుని పాలెం, మందడంలో గడ్డివాములు, కూరగాయల తోటల పందిళ్లు, గుడిసెలు, తుళ్లూరులో చెరుకుతోటలకు నిప్పు పెట్టిన దుండగులెవరో నేటికీ బయటకు రాలేదు. ప్రతిపక్ష పార్టీకి చెందినవారే ఈ పని చేసారంటూ నాడు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులపై కేసులు పెట్టి, విచారణలపేరుతో హింసించింది టిడిపి ప్రభుత్వం. దుస్సంఘటనలు జరిగిన వెంటనే ప్రతిపక్ష పార్టీపై బురదజల్లేందుకు చంద్రబాబు, ఆయన వందిమాగధులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు కదా? తర్వాత మాట మార్చి రైతులే తగులబెట్టుకున్నారని వాఖ్యానించింది. చివరకి దర్యాప్తు పూర్తి చేయకుండానే నాలుగేళ్లు గడిపి, దోషులెవరో చెప్పకుండా కేసును అర్థాంతరంగా మూసేసింది. ఇది వింటే ఇటీవలే జగన్ మీద కత్తితో జరిగిన దాడి విషయం తప్పకుండా గుర్తొస్తుంది. అంతకు మునుపు తుని ఘటనా జ్ఞాపకానికొస్తుంది. వీటన్నిటిలో కామన్ పాయింట్ సంఘటన జరిగిన కొద్ది నిమిషాలకే ప్రభుత్వం ప్రతిపక్షంపై ఆరోపణలు చేయడం.

రాజధానిలో పంటలు తగులబెట్టిన వెంటనే ప్రతిపక్షమే చేసిందని ప్రచారం చేయించారు. తుని రైలు ఘటనకు రాయలసీమ రౌడీలు కారణం అని దర్యాప్తు జరగకముందే చంద్రబాబు ప్రకటించారు. చివరకు జగన్ పై హత్యాయత్నం జరిగినప్పుడు కూడా దాడి చేసింది జగన్ అభిమాని అంటూ క్షణాల్లో తేల్చేసారు. అంటే చంద్రబాబు పాలనలో బాధితులకు న్యాయం జరగడం అనేది కల్ల. నేరమో, ఘోరమో జరిగినప్పుడు కనీస విచారణ లేకుండా ప్రభుత్వం ఏది చెబితే అదే వాస్తవం అనే స్థితిలో పోలీసు వ్యవస్థ ఉంది. నాలుగేళ్లు గడిచాక ఇప్పుడు రాజధానిలో రైతుల పంటలు తగులబెట్టింది ఎవరో కనీసం చెప్పకుండానే, జరిగిన దానికి బాధ్యులను పట్టుకోకుండానే, ఎలాంటి కారణం చూపకుండానే కేసును మూసేసారు.

రితికేశ్వరి మరణం, గోదవరి పుష్కరాల తొక్కిసలాట, విద్యార్థుల ఆత్మహత్యలు, వనజాక్షిపై దాడి, ఓటుకు నోటు - కేసు ఏదైనా సరే ఫలితం ఒకటే. కేసు నీరుగారడం లేక ప్రభుత్వానికి అనుకూలంగా రావడం. అధికారంలో ఉన్నందుకు ప్రభుత్వం చేసే తప్పులకు శిక్ష ఉండటం లేదు. ప్రభుత్వం తాను చేసిన అక్రమాలను చెరిపేసి, సాక్ష్యాలు లేకుండా కేసులను మూసేసి, తప్పులను మాఫీ చేసేసి చట్టానికి దొరక్కుండా తప్పించుకోవాలని చూస్తోంది. ఇది ఎల్లకాలం సాగదు. కేసులు మూతబడతాయి కానీ ప్రజల కళ్లు, నోళ్లూ కాదు. వారు నిజాలు చూస్తున్నారు. వాస్తవాలు మాట్లాడుతున్నారు. బేలెట్ బాక్స్ లో దాని ఫలితాన్ని కూడా అందిస్తారు.

Back to Top