కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం..అన్నీ చంద్రబాబు

రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో ఏదో జరగరానిది జరుగుతోంది. గూడుపుఠాణి
నడుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ కంపెనీల వెంటబడడం వెనక ఏదో
ఉంది. అధికారులు,
మంత్రులకు
ఎలాంటి ప్రమేయం లేకుండా అన్నీ తానే అయి నడిపిస్తుండడం అనుమానాస్పదంగా ఉంది.. తరచూ
వినిపిస్తున్న మాటలివి. చాలాకాలంగా ఇవి అటు ప్రజల్లోనూ, ఇటు రాజకీయ పక్షాలలోనూ తీవ్ర చర్చనీయాంశాలుగా
ఉన్నాయి. ఇవన్నీ ఇప్పటి వరకు సందేహాలే మంత్రుల కమిటీ సిఫార్సులను చూస్తే
ముఖ్యమంత్రి గారి అదనపు చొరవ స్పష్టంగా బైటపడిపోయింది. అంతేకాదు మంత్రుల కమిటీ
సిఫార్సులకు ముఖ్యమంత్రి ముందే ఆమోదముద్ర వేసేయడం, ఆ తర్వాత  ఫైలు అధికారుల వద్దకు వెళ్లడం, దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)
ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు వ్యాఖ్యలు చేయడం చూస్తే ఈ వ్యవహారంలో ఏదో తప్పు జ‌రుగుతుంద‌ని
తెలుస్తుంది.

అవును అన్నీ ఆయనే చూస్తున్నారు...

సింగపూర్ కంపెనీలతో ముఖ్యమంత్రే నేరుగా ఫోన్‌లో సంప్రదింపులు జరుపుతున్నారని, ఆర్థిక అంశాలన్నీ ఆయనే చూస్తున్నారని మంత్రుల
కమిటీ సిఫార్సులలో స్పష్టంగా ఉంది. వాటితో పాటు పరిష్కారం కాని ఇతర అంశాలపై
చంద్రబాబు సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌తో ఫోన్‌లో సంప్రదింపులు జరిపినట్లు మంత్రుల
కమిటీ సిఫార్సులలో పేర్కొన్నారు. ఆ సిఫార్సులకు ఆమోదం తెలుపుతూ ముఖ్యమంత్రి సంతకం
కూడా చేశారు. అయితే ముఖ్యమంత్రి ఆమోదించిన స్వయంగా సంతకం చేసిన మంత్రుల కమిటీ
సిఫార్సులను యథాతథంగా ఆమోదించడానికి మౌలిక వసతుల అథారిటీ సమావేశం అంగీకరించలేదు.
సచివాలయంలో ఈ అథారిటీ సమావేశం జరిగిన సంగతి తెల్సిందే. ఈ సమావేశంలో చోటు చేసుకున్న
కొన్ని పరిణామాలు శనివారం వెలుగులోకి వచ్చాయి.

ఇదేం తీరు మండిపడ్డ సీఎస్

మంత్రుల కమిటీ సిఫార్సులను ముఖ్యమంత్రి ఆమోదించిన తరువాత అధికారులతో కూడిన
అథారిటీ సమావేశానికి పంపించడమేమిటని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్
మండిపడ్డారు. మంత్రుల సిఫార్సులకు  ముఖ్యమంత్రి ఆమోదం తెలిపిన తరువాత
అధికారులతో కూడిన అధారిటీ ఏ విధంగా ఆమోదం తెలుపుతుందో చెప్పాలని సీఆర్‌డీఏ అధికారులను
సీఎస్ నిలదీశారు. సీఆర్‌డీఏ చట్టం ప్రకారం సీఆర్‌డీఏ చైర్మన్‌గా బాబు ఉన్నందున ఆయన
ఆమోదించిన అంశాలను అధారిటీ ముందుకు ఎలా  తీసుకువస్తారని సీఎస్ ప్రశ్నించారు.
ఇప్పటికిప్పుడు అధారిటీ ముందుకు తీసుకువచ్చి కేబినెట్‌కు వెళ్లాలి, ఆమోదించాలని పీకలమీద కూర్చుంటే కుదరదని సీఎస్
స్పష్టం చేశారు. మంత్రివర్గ సమావేశం ముందుకు తీసుకు వెళ్లాలంటే సీఎస్‌తో సంబంధం
లేకుండా నేరుగా సీఆర్‌డీఏనే  కేబినెట్ ముందుకు తీసుకువెళితే మంచిదని సీఎస్
చురక అంటించారు. సంబంధిత శాఖల అభిప్రాయాలను తీసుకోకుండా అధారిటీ సమావేశం ముందుకు
ఎలా  తెస్తారని సీఎస్ ప్రశ్నించారు.

సీఎం ఆమోదించిన అంశాలపై అభిప్రాయసేకరణా?

సీఎస్ సీరియస్ అవడంతో ఏం చేయాలో సీఆర్‌డీఏ అధికారులకు తోచలేదు. చివరకు సంబంధిత
శాఖలకు ఫైలు సర్క్యులేట్ చేసి అభిప్రాయాలను తీసుకుంటామని చెప్పారని సమాచారం.
దీనిపై సీఎస్ స్పందిస్తూ సంబంధిత శాఖలు ఫైలుపై ముఖ్యమంత్రి ఆమోదించిన అంశాలకు
వ్యతిరేకంగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తే ఏమి చేస్తారంటూ సీఆర్‌డీఏ అధికారులను
ప్రశ్నించారు. మంత్రుల కమిటీ, సీఆర్‌డీఏ సమావేశంలో పాల్గొని ఆ నిర్ణయాలకు అనుగుణంగా సంతకాలు చేసి ఇప్పుడు
ఫైలు సర్క్యులేట్ చేస్తే గతంలో తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా అభిప్రాయాలను
వ్యక్తం చేస్తారా అని సీఎస్ ప్రశ్నించారు. సీఎస్ ప్రస్తావించిన అంశాలపై సీఆర్‌డీఏ
అధికారులు నీళ్లునమిలారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి-2001 చట్టం ఏమి చెబుతోంది  అందుకు అనుగుణంగా
నిబంధనలు పాటించారా?
లేదా? అనే అంశాలను పరిశీలించాల్సి ఉందని, అంతే కాకుండా న్యాయ సలహా తీసుకోవాల్సి ఉందని
సీఎస్ స్పష్టం చేశారు.

న్యాయ సలహా తీసుకోవాలని నిర్ణయం...

సీఎం ఆమోదించిన మంత్రుల కమిటీ సిఫార్సులతో పాటు సింగపూర్ ప్రైవేట్ కంపెనీల
కన్సార్టియం సమర్పించిన రాయితీ, అభివృద్ధి అగ్రిమెంట్ ముసాయిదాపై సీఎస్ పలు సందేహాలను వ్యక్తం చేశారు. ఆ
సందేహాలను నివృత్తి చేసే బాధ్యతలను కొంత మంది అధికారులకు సీఎస్ అప్పగించారు. అంతే
కాకుండా న్యాయ శాఖ అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా సీఎస్ కోరారు. దీనిపై న్యాయ
శాఖ స్పందిస్తూ తొలుత అడ్వకేట్ జనరల్ అభిప్రాయం తీసుకోవాలని, అనంతరం న్యాయ శాఖ అభిప్రాయాన్ని
తెలియజేస్తుందని పేర్కొన్నారు. ఇష్టానుసారం వ్యవహారాలకు ఆమోదం తెలపడానికి సిద్ధంగా
లేనని సీఎస్ స్పష్టం చేశారు.

 

Back to Top