‘ఉపాధి’కి మంగళం

– ఉపాధి హామీ పథకం అమలుపై నీలినీడలు
– నిధుల మళ్లింపులకు చంద్రబాబు వ్యూహ రచన
– ఉపాధి దొరక్క వలస బాట పడుతున్న పల్లెలు

పదేళ్ల ప్రజావ్యతిరేక పాలనకు చరమగీతం పాడుతూ తెలుగు ప్రజలు మహానేత వైయస్సార్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. అప్పటికి రాష్ట్రంలో ఎన్నో సమస్యలు. అందులో ప్రధానమైనది రాయలసీమలో ఆకలిచావులు. ఏ ఒక్కరూ ఆకలితో బాధ పడకూడదనే తన ఆశయాన్ని కేంద్రానికి వివరించిన వైయస్సార్‌.. ప్రతిష్ఠాత్మక ఉపాధి హామీ పథకాన్ని మొట్టమొదట రాయలసీమలోనే ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకున్నారు. 2005, ఫిబ్రవరి 2.. భారతదేశ చరిత్రలోనే నిలిచిపోయిన పథకాల్లో ఒకటైన ఉపాధి హామీ పథకం ప్రారంభమైనరోజు. వైయస్సార్‌ అభ్యర్థన మేరకు నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్, యూపీఏ చైర్‌ పర్సన్‌ సోనియాగాంధీలు అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లి(బండమీదపల్లి)లో పథకాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఉపాధిహామీ దేశమంతటా విస్తరించింది. మహానేత కనబర్చిన ప్రత్యేక శ్రద్ధ వల్ల దేశంలోని మిగతా రాష్ట్రాలకంటే ఏపీలోనే పథకం విజయవంతంగా నడిచింది. పేద కూలీలకు పట్టెడన్నం దొరికినట్లయింది. ఏపీలో ఈ పథకం జోరు చూసిన తర్వాతే ఉపాధి హామీని 100 రోజుల నుంచి 150 రోజులకు పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.

అయితే మహానేత అకాలమరణంతో పేదవాడికి కూడుపెట్టే ఈ పథకం క్రమంగా నిర్వీర్యమవుతూ వచ్చింది. ప్రస్తుతం అధికారంలోఉన్న టీడీపీ సర్కారు ఉపాధి హామీపై కించిత్‌ శ్రద్ధయినా చూపకపోవడంతో మళ్లీ అనంతపురం లాంటి కరువు, ఆకలి చావులు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ నమోదవుతున్నాయి. నిధుల లేమి పేరుతో ఇప్పటికే దాదాపు 6000 మందికిపైగా ఫీల్డ్‌ అసిస్టెంట్లు తొలగింపునకు గురైయ్యారు. పథకం ప్రారంభమైన ఒక్క అనంతపురం జిల్లాలోనే 4 లక్షల మంది కూలీలు ఇతర ప్రాంతాలకు వలస పోయారంటే ఎంతగా నిర్వీర్యమైందో వేరే చెప్పాల్సిన పనిలేదు. అసలే కరువుతో అల్లాడే ప్రజలకు అండగా ఉండి ఉపాధి కల్పించాల్సిన ముఖ్యమంత్రి ఉపాధి హామీ నిధులను ఇతర కార్యక్రమాలకు మళ్లించి ఆకలి చావులకు కారకుడవుతున్నాడు. పుట్టిన ఊర్లో ఉపాధి దొరక్క పక్క రాష్ట్రాలకు కూలీలు వలస వెళ్తున్నా పట్టించుకోని నిస్సహాయ పాలనతో జనాన్ని పట్టించుకోవడం మానేశాడు. 

ఉపాధి నిధులకు ఎసరు..
నిధులను ఎలా దారి మళ్లించాలో చంద్రబాబుకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. బడ్జెట్‌లో నిధులు ఒక పథకానికి కేటాయిస్తే తీరా వినియోగంలోకి వచ్చేసరికి దేనికి ఖర్చు పెడతారో సంబంధిత శాఖ అధికారులకు కూడా స్పష్టత ఉండదు. మొన్నటికి మొన్న అమరావతి రాజధాని నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను దారి మళ్లించి కృష్ణా పుష్కరాలకు కేటాయించాడు. ఇప్పుడు బాబు కన్ను ఉపాధి హామీ పనుల మీద పడింది. ఉపాధి పథకం కేవలం కూలీలకు పని కల్పించడం కోసం మాత్రమే కాదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొత్త భాష్యం చెప్పాడు. ఉపాధి నిధులను వినియోగించే అంశంపై సచివాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించి వారికి మార్గనిర్దేశం చేశారు. ‘పల్లెవనం’ అనే కొత్త పథకం సృష్టించి గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, స్థిరాస్తులు, పేదలకు మెరుగైన జీవనం సమకూర్చడం, పంచాయతీరాజ్‌ సంస్థలను బలోపేతం చేయడం వంటి లక్ష్యాలను ఈ పథకం ద్వారానే నెరవేర్చాలని హితోపదేశం చేశారు. నిన్నటి వరకు చెట్టు– నీరు పేరుతో హడావుడి చేసిన బాబు ఇప్పుడు నగర వనాల స్ఫూర్తితో ’పల్లెవనం’ పేరుతో గ్రామాల్లో  మొక్కలు నాటి పెంచే కార్యక్రమాన్ని చేపట్ట నున్నట్లు చెప్పారు. ఈ ఏడాది రూ.6 వేల కోట్ల వరకు ఉపాధి నిధులు ఖర్చు చేశామన్నారు. 

ఉపాధి పనుల్లోకి డ్వాక్రా మహిళలా..
డ్వాక్రా సంఘాలను కూడా ఉపాధి కూలీ పనులకు చేర్చడం ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.7,200 కోట్లు ఉపాధి నిధులను వినియోగించాలనే లక్ష్యాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు నిర్దేశించారు. నాలుగు లక్షల పంట కుంటలు, 2 లక్షల వర్మీ కంపోస్ట్‌ యూనిట్లు, 3 వేల కిలోమీటర్ల మేర రోడ్లకు ఇరువైపులా మొక్కల పెంపకం, 4 వేల అంగన్‌వాడీ కేంద్రాలకు శాశ్వత భవనాలు, 6 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు, 2.50 లక్షల ఇళ్లు, 70 మినీ స్టేడియాలు నిర్మాణ లక్ష్యాలుగా పెట్టుకున్నట్టు సీఎం వెల్లడించారు. 90 లక్షల మంది డ్వాక్రా సభ్యులను ఉపాధి పథకంలో భాగస్వాములను చేస్తే, ప్రతి కుటుంబానికి నెలకు రూ.10 వేల ఆదాయం కచ్చితంగా వచ్చే అవకాశం ఉందన్నారు. అధికారం చేతిలో ఉంది కదా అని చంద్రబాబు బడ్జెట్‌ నిధులను ఆయా పనులకు సక్రమంగా వినియోగించకుండా పక్కదారి పట్టించడం డ్వాక్రా మహిళలతోపాటు, ఉపాధి కూలీలను మోసం చేయడమే. అన్ని అదనపు కేటాయింపులు కలుపుకుని ప్రస్తుతం ఉపాధి కూలీల వేతనం దాదాపు రూ.200 వరకు ఉంది. అయితే చంద్రబాబు తీసుకున్న ఈ నిధుల కేటాయింపుల ద్వారా ఉపాధి కూలీలకు నష్టం చేకూరుతుందనేది మాత్రం వాస్తవం. 
Back to Top