డాక్టర్ వైయస్ఆర్ ప్రజల సొత్తు

 వైయస్ రాజశేఖరరెడ్డి కన్నుమూసి మూడేళ్ళు గడిచాక, ఆయన తొమ్మిదేళ్లకింద -2003 వేసవిలో- చేసిన చరిత్రాత్మక ‘ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర డైరీని పుస్తకరూపంలో ఇప్పుడు వెలువర్చారు కాంగ్రెస్ నేతలు. ఆ సందర్భంగా ప్రసంగించిన కాంగ్రెస్ అతిరథ మహారథులు అందరూ ‘వైయస్ మా కాంగ్రెస్ పార్టీ సొత్తు!’ అని నిస్సిగ్గుగా చెప్పుకున్నారు.  గెలుపోటములకు నాదీ బాధ్యతని 2009లో వైయస్ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ పార్టీని గెలిపించి గట్టెక్కించిన తర్వాత మళ్లీ ఆ పార్టీ పెద్దెత్తున ప్రజల తీర్పు కోరుతూ జనం ముందుకు వెళ్లవలసి వస్తున్నదిప్పుడే.  మొన్న హైకోర్టు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిపించమని స్పష్టంగా ఆదేశించిన నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి ఈ అవసరం ఏర్పడింది. 

దాదాపు దశాబ్ద కాలంగా ఆ పార్టీని విజయపథంలో నడిపించగల బొమ్మ ఎప్పుడూ ఒక్కటే- అది వైయస్ రాజశేఖరరెడ్డి బొమ్మే! నిన్న గాక మొన్ననే సంక్షేమ పథకాలపై వైయస్ ముద్ర చెరిపెయ్యకపోతే, కాంగ్రెస్ బతికి బట్టకట్టడం కష్టమని ఆ పార్టీలోని ‘భావజాల నిపుణుడు’ ధర్మాన ప్రసాదరావు సారథ్యంలోని ఓ కమిటీ సిఫార్సు చేసింది. మరుక్షణమే అనేక పథకాలకు సంబంధించిన ప్రచార పత్రాల్లోంచి, కాంగ్రెస్ పార్టీ వేదికల మీంచి వైఎస్ బొమ్మను తొలగించేశారు. వైయస్ బొమ్మ లేకుండా జనం ముందుకెళ్తే -ఓట్ల మాట ఎలాఉన్నా- తరిమితరిమి కొడతారని కాంగ్రెస్ పెద్దలకు అర్థమయిపోయింది. ఈ నేపథ్యంలోనే ‘వైఎస్ మా సొత్తే!’ అంటూ కొత్త పల్లవి ఎత్తుకున్నారు. 

రాజశేఖరరెడ్డిముఖ్యమంత్రిగా ఉన్న ఆరేళ్ల కాలంలో ఆయన ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకానికీ వంకలు పెట్టి, విమర్శించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు -ఫీజు వాపసు పథకంతో సహా- అవే సంక్షేమ పథకాలను కనిపెట్టింది తానేనని డప్పుకొట్టుకోవడం మొదలుపెట్టడం విశేషం. మామూలు మనుషుల జ్ఞాపక శక్తి మీద మన అసాధారణ ‘మేధావుల’ అంచనా ఏమయినప్పటికీ, ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ముందే తేలిపోయిందిప్పుడు. వైయస్‌ఆర్ బొమ్మకే గెలిపించే శక్తి ఉందని నమ్మినందువల్లనే కదా కాంగ్రెస్ పెద్దలు తొందరపడి తొమ్మిదేళ్ల తర్వాత ఆయన పాదయాత్ర డెయిరీని ఢిల్లీలో విడుదల చేశారు!

ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే ఓట్ల్ట సంపాదించిపెడతాయన్న నమ్మకంతోనే కధా చంద్రబాబు ‘విధాన చౌర్యానికి’ తెగబడింది! ఈ రెండు రంగాల్లోనూ పరిస్థితి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకే అనుకూలంగా ఉందని చెప్పక తప్పదు. వై యస్ ఆర్ పథకాల వారసత్వం కూడా ఆ పార్టీకే దక్కుతోంది! అంచేత, కాంగ్రెస్-టీడీపీల నీచమయిన ఎత్తుగడల వల్ల వాటికి ఓట్ల మార్కెట్‌లో పెద్దగా కలిసొచ్చేసూచనలేం కనబడ్డం లేదు! మహానేత వైయస్ ఆర్ ఏనాడో జనం మనిషయ్యారు. ఆయన అనుసరించిన విధానాలూ, అమలుచేసిన పథకాలను అనుసరించే ప్రతి ఒక్కరికీ ఆయన ఆశీర్వాదం లభిస్తుంది. అవేం చెయ్యకుండా మాసొత్తంటే మా సొత్తని గుండెలు బాదుకోవడం వల్ల ప్రయోజనం శూన్యం! 
Back to Top