కళ్లెదుటే సామాజిక మార్పు

రాజ్యాధికారంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సింహభాగం 

సామాజిక న్యాయ సాధనలో టార్చ్‌బేరర్‌గా నిలిచిన సీఎం వైఎస్‌ జగన్‌

అధికారం చేపట్టిన తొలి రోజు నుంచే ఆ దిశగా అడుగులు

సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక తోడ్పాటుతో పేదరిక నిర్మూలనకు కృషి

ఇంగ్లిష్‌ మీడియం, సీబీఎస్‌ఈ సిలబస్, బైజూస్‌తో ఒప్పందం..

తద్వారా పోటీ ప్రపంచంలో మన విద్యార్థులు దూసుకెళ్లేలా ప్రణాళిక

ఇంతటి కృషి ఇదే ప్రథమం అంటున్న సామాజిక, రాజకీయ విశ్లేషకులు 

సీఎం చర్యలతో వైఎస్సార్‌సీపీకి రోజురోజుకూ పెరుగుతున్న ప్రజాదరణ

అమరావతి: నామినేటెడ్‌ పదవుల నుంచి మంత్రివర్గం వరకు సింహభాగం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే అవకాశం ఇచ్చి.. రాజ్యాధికారంలో వాటా ఇవ్వడం ద్వారా సామాజిక సాధికారత సాధనలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి టార్చ్‌ బేరర్‌గా నిలిచారని సామాజిక, రాజకీయ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. దేశ చరిత్రలో మంత్రివర్గంలో ఏకంగా 70 శాతం పదవులను ఆ వర్గాలకు ఇచ్చింది ఒక్క సీఎం వైఎస్‌ జగనేనని నొక్కి చెబుతున్నారు. సామాజిక న్యాయం నినాదంతో 2007లో ఉత్తరప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన మాయావతి సైతం మంత్రివర్గంలో ఆ వర్గాలకు 40 శాతం మాత్రమే అవకాశం ఇచ్చారని గుర్తు చేస్తున్నారు.

దేశ చరిత్రలో నామినేటెడ్‌ పదవులు, పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు.. మహిళలకు రిజర్వ్‌ చేస్తూ చట్టం చేసి మరీ పదవులు ఇచ్చిన ఘనత ఒక్క సీఎం వైఎస్‌ జగన్‌దేనని స్పష్టం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో అఖండ విజయం తర్వాత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే సామాజిక న్యాయ సాధనకు నడుం బిగించారు.

సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక తోడ్పాటు అందించి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో పేదరికాన్ని నిర్మూలించాలని, ఆ వర్గాల పిల్లలకు ఉన్నత విద్య అందించాలని ప్రణాళిక రచించి,   వాటిని ఆచరణలోకి తెచ్చారు. 2019 జూన్‌ 8న తొలిసారి 25 మందితో ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో (14 మందితో 56 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అవకాశం ఇచ్చి, సామాజిక విప్లవానికి తెరతీసి.. నవశకానికి నాంది పలికారు. ఐదు డిప్యూటీ సీఎం పదవుల్లో నాలుగు (80 శాతం) ఆ వర్గాలకే ఇచ్చారు. దేశ చరిత్రలో తొలి సారిగా ఎస్సీ మహిళను హోం శాఖ మంత్రిగా నియమించారు. శాసనసభ స్పీకర్‌గా బీసీ వర్గాలకు అవకాశం ఇచ్చారు. 

పరిపాలనలో సింహభాగం వాటా 
► స్థానిక సంస్థల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించడంపై టీడీపీ నేతలను హైకోర్టును ఆశ్రయించేలా చంద్రబాబు పురిగొల్పారు. దీనిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో బీసీలకు రిజర్వేషన్‌ 24 శాతానికి తగ్గిపోయింది. రిజర్వేషన్లు తగ్గినా అంతకంటే ఎక్కువ మంది బీసీలకు స్థానిక సంస్థల్లో అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చిన సీఎం.. దాన్ని ఆచరించి చూపి, పదవులు ఇచ్చారు.
► జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో 13 జిల్లా పరిషత్‌లను వైఎస్సార్‌సీపీ చేజిక్కించుకుంటే, అందులో తొమ్మిది జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పదవులను (70 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే కేటాయించారు. 
► మండల పరిషత్‌ ఎన్నికల్లో 648 మండలాలకు గాను వైఎస్సార్‌సీపీ 635 మండల పరిషత్‌ అధ్యక్ష పదవులను దక్కించుకుంటే.. అందులో 67 శాతం పదవులను ఆ వర్గాలకే ఇచ్చారు. 
► 13 కార్పొరేషన్‌లలో వైఎస్సార్‌సీపీ క్లీన్‌ స్వీప్‌ చేస్తే.. ఏడు చోట్ల మేయర్‌ పదవులు బీసీలకు ఇచ్చారు. మొత్తంగా మేయర్‌ పదవుల్లో 92 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికే ఇచ్చారు. 
► 87 మున్సిపాలిటీల్లో 84 మున్సిపాలిటీలను వైఎస్సార్‌సీపీ చేజిక్కించుకుంటే.. వాటి చైర్‌పర్సన్‌ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 73 శాతం ఇచ్చారు.

చట్టం చేసి మరీ నామినేటెడ్‌ పదవుల పంపకం 
► దేశ చరిత్రలో ఎక్కడా లేని రీతిలో రాష్ట్రంలో నామినేటెడ్‌ పదవులు, పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రిజర్వేషన్‌ చేసేలా సీఎం వైఎస్‌ జగన్‌ ఏకంగా చట్టం తెచ్చారు. 
► రాష్ట్రంలో 196 వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీ చైర్మన్‌ పదవుల్లో 76 అంటే 39 శాతం బీసీలకు ఇచ్చారు. మొత్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 60 శాతం పదవులు ఇచ్చారు.
► వివిధ ప్రభుత్వ కార్పొరేషన్‌లలో 137 చైర్మన్‌ పదవుల్లో 53 (39 శాతం) బీసీలకు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మొత్తం 58 శాతం పదవులు ఇచ్చారు. బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్‌లు, ఎస్సీలకు మూడు కార్పొరేషన్‌లు, ఎస్టీలకు ఒక కార్పొరేషన్‌ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.   
► 137 కార్పొరేషన్‌లకు సంబంధించి మొత్తం 484 డైరెక్టర్‌ పదవుల్లో 201.. బీసీలకు (42 శాతం) ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మొత్తం 58 శాతం డైరెక్టర్‌ పదవులు ఇచ్చారు. 56 ప్రత్యేక బీసీ కార్పొరేషన్లు, మూడు ఎస్సీ కార్పొరేషన్లు, ఒక ఎస్టీ కార్పొరేషన్‌లో 684 డైరెక్టర్‌ పదవులన్నీ ఆ వర్గాల వారికే ఇచ్చారు.

సామాజిక మహా విప్లవానికి నాంది 
► తొలిసారి ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో 56 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చి సామాజిక విప్లవాన్ని ఆవిష్కరించిన సీఎం వైఎస్‌ జగన్‌.. ఏప్రిల్‌ 11న పునర్‌వ్యవస్థీకరణ ద్వారా 70 శాతం పదవులు (17) ఆ వర్గాలకు ఇచ్చి సామాజిక మహా విప్లవానికి నాంది పలికారు.
► రాష్ట్ర శాసనమండలి చరిత్రలో తొలిసారిగా ఎస్సీ వర్గానికి చెందిన కొయ్యే మోషేన్‌ రాజును చైర్మన్‌గా, మైనార్టీ మహిళ జకియా ఖానంను డిప్యూటీ చైర్‌పర్సన్‌గా నియమించారు. 
► గత మూడేళ్లలో ఎన్నికలు జరిగిన ఎనిమిది రాజ్యసభ స్థానాల్లో నాలుగు రాజ్యసభ స్థానాలను బీసీలకే ఇవ్వడం ద్వారా సామాజిక న్యాయమంటే ఇదీ అని దేశానికి చాటి చెప్పారు. 
► శాసనమండలిలో వైఎస్సార్‌సీపీకి 32 మంది సభ్యులు ఉంటే.. అందులో 18 మంది (56.25 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలే కావడం గమనార్హం. 
► మొత్తంగా వైఎస్‌ జగన్‌ సంస్కరణల వల్ల ఎన్నిక ఎన్నికకూ వైఎస్సార్‌సీపీకి ప్రజాదరణ పెరుగుతోంది. స్థానిక సంస్థల (పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, కార్పొరేషన్‌) ఎన్నికల్లో 80 శాతానికిపైగా స్థానాల్లో విజయభేరి మోగించింది. తిరుపతి లోక్‌సభ, బద్వేలు, ఆత్మకూరు శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఇదివరకటి కంటే అధికంగా మెజార్టీ రావడం గమనార్హం.   

పేదరిక నిర్మూలన.. విద్యకు బాసట
► పేదరిక నిర్మూలనే లక్ష్యంగా మూడేళ్లలో నవరత్నాలు, సంక్షేమ పథకాల కింద డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన రూ.1,58,375.03 కోట్లలో 80 శాతానికి పైగా నిధులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే చేరాయి. నగదు బదిలీయేతర పథకాల ద్వారా మరో రూ.38,836.57 కోట్ల ప్రయోజనం చేకూర్చారు. 
► అమ్మ ఒడి, పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి పథకాల ద్వారా విద్యావంతులుగా తీర్చిదిద్దే యత్నాలను చిత్తశుద్ధితో చేస్తున్నారు. నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలలను ఆధునికీకరించి.. ఇంగ్లిష్‌ మీడియంను ప్రవేశపెట్టారు. సీబీఎస్‌ఈ సిలబస్‌ను బోధిస్తూ.. బైజూస్‌తో ఉచితంగా కంటెంట్‌ను అందించేందుకు ఒప్పందం చేసుకోవడం ద్వారా ప్రపంచంలో మిగతా దేశాల విద్యార్థులతో పోటీ పడేలా రాష్ట్ర విద్యార్థులను తీర్చిదిద్దాలన్న అంకితభావంతో సీఎం వడివడిగా అడుగులు వేస్తున్నారు. 

తాజా వీడియోలు

Back to Top