శుద్ధ’ అబద్ధం

– నీరుగారిన ‘ఎన్‌టీఆర్‌ సుజల పథకం’
– రూ.2కు 20 లీటర్ల నీరు హుళక్కేనా?
–దాతలను ప్రోత్సహించడంలో ప్రభుత్వం  విఫలం
 –ప్రవేటు ప్లాంట్లదే జోరు

విజయవాడ: ‘‘ప్రతి ఇంటికి పరిశుభ్రమైన నీటిని సరఫరా చేస్తాం. ఎన్‌టీఆర్‌ సుజల పథకం ద్వారా ప్రతి ఇంటికి రూ.2కే 20 లీటర్ల మినరల్‌ వాటర్‌ కాన్‌ సరఫరా చేస్తాం’’. ‘‘ ఫ్లోరైడ్‌ బాధిత ప్రాంతాలను, ఉప్పునీటి ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాలకు ప్రత్యేక తాగునీటి సౌకర్యం కల్పిస్తాం’’. ఇది ఎన్నికల ముందు ఏ మీటింగ్‌కు వెళ్లినా చంద్రబాబు చెప్పిన మాటలు. ఆయన మాటలు నమ్మి ప్రజలు ఓట్లు వేసి అధికారంలోకి కూర్చోబెట్టి మూడేళ్లు గడుస్తున్నా ఎక్కడా కూడా ఎన్‌టీఆర్‌ సుజల పథకం కనిపించడం లేదు. గ్రామీణులకు మినరల్‌ వాటర్‌ అటుంచి, జనరల్‌ వాటర్‌ కూడా దొరకడం లేదు. ఫిబ్రవరి ప్రారంభంలోనే గ్రామాల్లో తీవ్ర నీటి కష్టాలు మొదలయ్యాయి. నీటి కోసం ప్రశ్నిస్తున్న ప్రజలను పోలీసులు అరెస్టు చేసి జైళ్లలో పెడుతున్నారు.  ప్రతి ఇంటికి ఎన్టీఆర్‌ సుజల స్రవంతి ప«థకం ద్వారా 20 లీటర్లు స్వచ్ఛమైన నీటిని రెండు రూపాయలకు అందిస్తామన్న బాబు వాగ్ధానం  మాటలకే పరిమితమైంది.

మూడో సంతకానికి మంగళం
2014లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత పలు ఫైళ్లపై సంతకాలు చేశారు. అందులో మూడో సంతకం ఎన్‌టీఆర్‌ సుజల పథకం ఉంది. ఈ పథకాన్ని 2014 సంవత్సరం అక్టోబర్‌ 2న లాంఛనంగా ప్రారంభించారు. అయితే రాష్ట్రంలో అరకొరగా అప్పట్లో ప్రారంభించి..ఆ తరువాత మూసేశారు. పలు గ్రామాల్లో అనధికార వాటర్‌ ప్లాంట్ల ద్వారా 20 లీటర్ల క్యాన్లు పది నుంచి ఇరవై రూపాయలకు విక్రయించుకుంటున్నారు. చాలా గ్రామాల్లో ఈ పథకం ద్వారా ఏర్పాటైన ప్లాంట్లు ప్రయివేట్‌పరం చేశారు.  దీంతో గ్రామీణులకు  స్వచ్ఛమైన తాగునీరు అందటం లేదు. 

కృష్ణా జలాల వాటర్‌ స్కీమ్‌ పూర్తయ్యేదెన్నడో
గుంటూరు జిల్లా ప్రజలకు తాగునీటిని అందించేందుకు 2014లో ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ ఆధ్వర్యంలో కృష్ణా జలాల వాటర్‌ స్కీమ్‌  సుమారు రూ.70 కోట్ల అంచనా విలువలతో ప్రారంభించారు.  ఈ పథకం పూర్తి అయితే మొవ్వ, పామ్రరు, పెదపారుపూడి మూడు మండలాలకు సురక్షిత తాగునీరు అందుతుంది. కాని పథకం ప్రారంభించి మూడేళ్లు గడుస్తున్నా పనులు పూర్తికాక పోవడంతో ప్రజలకు సురక్షిత తాగునీరు గగనమైంది. ఎన్‌టీఆర్‌ సుజల పథకం కింద వాటర్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు దాతలను ప్రోత్సహించడంలో ప్రభుత్వం, అధికారులు విఫలమవుతున్నారు. అధికార పార్టీ నేతలు సైతం ముందుకు రావడం లేదు. కమీషన్లు వచ్చే పనులకు పోటీ పడుతున్న టీడీపీ నేతలు ఇలాంటి కార్యక్రమాలకు వెనుకడుగు వేస్తున్నారు.
 
కలుషిత నీరే శరణ్యం
గ్రామాల్లో తాగునీరు లేక ప్రజలు రోగాల బారీన పడుతున్నారు.  ఎక్కువ శాతం  చెరువు, బోర్‌ ద్వారా వచ్చే నీటినే తాగునీటిగా వినియోగిస్తున్నారు. చెరువుల కొన్ని చోట్ల కలుషితం కావటం వలన పంట కాలువలు సైతం కలుషితంగా మారుతున్నాయి. దీంతో తాగునీటి చెరువులు స్వచ్ఛమైన నీరు రాక అవికూడా  కలుషితం కాక తప్పటం లేదు. దీంతో పంచాయతీలు చెరువులను శుభ్రం చేయటం ప్రారంభించినా  తలకు మించిన భారంగా మారుతున్నాయి. ఫిల్టర్‌బెడ్లు బాగు చేసి రక్షిత మంచినీటి పధకం ద్వారా నీరు విడుదల చేసినా  అవి పెద్దగా ఫిల్టర్‌ కావటం లేదు. దీంతో  చాల గ్రామాల్లో ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

రూపాయికి లీటర్‌ నీళ్లు
గ్రామాల్లో తాగేందుకు నీళ్లు దొరక్కపోవడంతో ప్రజలు కొనుగోలు చేసి తాగాల్సిన దుస్థితి నెలకొంది. తాగునీరు కొనుగోలు చేయటం పేదలకు భారంగా మారింది. పట్టణాల నుంచి వ్యాన్లు, ఆటోలపై తాగునీరు వస్తుంది. 20 లీటర్ల వాటర్‌ క్యాన్‌ రూ. 20 చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. తాగునీరు కొనలేని పేదలు చెరువులో ∙నీరు తాగి రోగాల బారీన పడుతున్నారు. ప్రభుత్వమే సొంతగా  మినీ వాటర్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసి  ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ప్లాంట్‌ నడిపితే కొంత వరకు పేద ప్రజలకు తాగునీరు అందించే అవకాశం ఉంటుంది. లేని పక్షంలో స్పచ్ఛమైన నీరు అనే పదానికి  సైతం గ్రామీణులు దూరం కావాల్సిందే. ఈ విషయమై అధికారులు ప్రజా ప్రతినిధులు తగు విధమైన చర్యలు తీసుకుని ప్రజలకు సురక్షిత తాగునీరు అందించే కృషి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.  
Back to Top