‌చంద్రబాబు యాత్రా స్సెషల్

బ్రాహ్మీ ముహూర్తంలో చంద్రబాబుకు ఓ దివ్యమైన ఆలోచన తట్టింది. తత్ఫలితంగా మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. వంద రోజుల పాటు ఈ యాత్ర సాగుతుంది. గాంధీ మహాత్ముని జయంతిని దానికి వేదికగా చేసుకున్నారు.

ఎన్డీటీవీ సర్వే తేల్చిన ఫలితాలను చూసి బెంబేలెత్తిన బాబుకు ఎందుకో మధ్యంతర ఎన్నికలు రావచ్చేమోననే అనుమానం ఏర్పడినట్లు తెలుస్తోంది. అవి వచ్చేలోగా ప్రజల్లో ఓ రౌండ్ తిరిగొస్తే మేలని ఆయన భావిస్తున్నారంటున్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్‌మోహనరెడ్డి సునామీని తట్టుకోవడానికి ఇంతకు మించిన మార్గం లేదనేది ఆయన యోచనగా చెబుతున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయనకు కేవలం 18శాతం మంది మాత్రమే ఓటు వేసినట్లు ఎన్డీటీవీ సర్వేలో వెల్లడికావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పూర్వ ప్రాభవాన్ని పొంది, విశ్వసనీయతను పెంచుకోవడానికి ఇంతకు మించిన మార్గం లేదని బాబు అనుకుంటన్నట్లు సమాచారం.

2009 తర్వాత జరిగిన అన్ని ఎన్నికలలోనూ తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బలే తగిలాయి. ఒక్క చోట విజయలక్ష్మి కనుచూపుమేరలో కనిపించలేదు.

జగన్‌మోహన్ రెడ్డిని పదేపదే విమర్శించడం దీనికి ప్రధాన కారణమని కొందరు చెప్పిన మేరకు ఆయన వాస్తవాన్ని గ్రహించినట్లు కనిపిస్తోంది. గత మూడు నెలలుగా ఆయన పేరును బాబు ఎక్కడా ప్రస్తావించని అంశాన్ని రాజకీయ పరిశీలకులు ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటున్నారు.

వాన్‌పిక్ భూముల అంశంపై ఆయన చేపట్టిన యాత్రకు స్థానికులే పెద్దగా స్పందించకపోవడం ఆయనకు మింగుడుపడలేదు. ఈ పరిస్థితినుంచి బయటపడడానికి వీలుగా, ప్రజల సమస్యలు తెలుసుకుని నేనున్నానంటూ గుర్తుచేయడానికి చేసే ప్రయత్నంలో భాగంగా వంద రోజుల యాత్రకు నడుంకట్టారని అంటున్నారు.

2003లో నక్సలైట్ల దాడినుంచి తప్పించుకున్న బాబు ఆ కట్లతో ఎన్నికలకు వెడితే ఓట్లు కట్టలుకట్టలుగా పడతాయని భావించినది మొదలు ఆయన ఓటమి పర్వానికి తిరుగే లేకపోయింది. అప్రతిహతంగా ఓటమి పాలవుతూనే ఉన్నారు. ఈ సందర్భంలో కట్టె పుల్ల, పుల్లల మోపు కథ గుర్తుకు తెచ్చుకోవాలి. కట్టె పుల్ల మాదిరిగా కాక, అన్ని పుల్లలనూ ఓచోట చేర్చి కట్టకడితే ఎదురుండదనుకున్న 2009 ఎన్నికల్లో మహా కూటమి ప్రయోగం వికటించింది. అధికారంలోకి రాకపోగా తెలుగుదేశం మినహా భాగస్వామ్య పక్షాలను దారుణంగా దెబ్బతీసింది. 2012 మే నెలలో ఉప ఎన్నికలు ఆ పార్టీకి తీవ్ర పరాభవాన్నే మిగిల్చాయి.

వీటన్నిటికీ విరుగుడుగా వంద రోజుల యాత్ర చేపట్టి, అధికార కాంగ్రెస్ పార్టీ పాలనను దునుమాడాలనీ, వైఫల్యాలను ఎండగట్టాలనీ, తద్వారా ప్రజలకు దగ్గర కావాలనీ చంద్రబాబు ఉబలాట పడుతున్నారు. ఆయన ఉబలాటం తీరుతుందా లేదా కాలమే నిర్ణయించాలి.

Back to Top