దోపిడీలో దొరతనం

– ఆన్‌లైన్‌ పేరిట ట్యాక్సులు మోపే కుట్ర
– సెల్‌ సిగ్నల్‌ లేని గ్రామాల్లో మొబైల్‌ బ్యాంకింగా
– ఈ–పాస్‌ మిషన్లతో సామాన్యులు రేషన్‌కు దూరం
– మిగులుతున్న సరుకులకు లెక్క చూపని ప్రభుత్వం
– ఫిబ్రవరి నెలలోనే 19 లక్షల మంది దూరం

సంక్షోభంలో కూడా లాభాలు వెతుక్కోవడం చంద్రబాబుకు తెలిసినంతగా ఎవరికీ తెలియదనేది అందరికీ తెలిసిన వాస్తవం. అందునా లాభాలంటే రాష్ట్ర ప్రయోజనాలు అనుకునేరు.. కాదండీ బాబు.. సొంత ప్రయోజనాలు. బాబు చేసే పనికీ ఒక లెక్కుంటది.. ఆయన మాట్లాడే ప్రతి మాట వెనుక రేపటి అవసరం దాగుంటది.. ప్రారంభించే ప్రతి కార్యక్రమం వెనుకా లాభ నష్టాలు బేరీజు వేస్తాడు. హీ ఈజ్‌ టూ కాలిక్యులేటెడ్‌. ముఖ్యంగా జనం సొమ్మంటే బాబుకు చాలా మోజు. ఆయన సీఎం అయ్యిందే రాజభోగాలు అనుభవించేటందుకు. అలా అని అంతటితో ఆగుతాడా అంటే లేదు.. మళ్లీ రాబోయే ఎన్నికలకు డబ్బులు కావొద్దు. అందుకు దోచుకోవద్దూ.. అందుకే ఈ స్కాములు.. స్కీములు. 

టెక్నాలజీని అడ్డం పెట్టుకుని దోపిడీ          
టెక్నాలజీ పేరు చెప్పి అవినీతిని అరికడతానని రేషన్‌ దుకాణాల్లో ప్రవేశ పెట్టిన ఈపాస్‌ మెషీన్ల వెనుకా కనిపించని దోపిడీ దాగి ఉంది. ఈ–పాస్‌ అమలైన చోట కుటుంబ సభ్యుల వేలిముద్ర, ఐరిస్‌ పడకపోతే సరుకులు నిలిపివేస్తున్నారు. ఇలా మిగిలిన సరుకుల విలువ కోట్లలో ఉంటోంది. ఈ–పాస్‌ పద్ధతిపై సరుకులు సరఫరా చేసే పనిని విస్తృతం చేసేందుకు వివిధ కంపెనీలకు చెందిన సిమ్‌లు వినియోగిస్తోంది. ఏ నెట్‌వర్క్‌ బాగుంటే ఆయా ప్రాంతాల్లో ఆయా కంపెనీలకు చెందిన సిమ్‌లు ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 28,434 చౌకదుకాణాల్లో ఉపయోగిస్తున్న సిమ్‌లకు నెలకు రూ. 125 చొప్పున రూ.35,54,250 ప్రభుత్వం చెల్లిస్తోంది. ఆయా కంపెనీల సిమ్‌లకు ప్రతినెలా అద్దెల రూపంలో రూ.125 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇలా డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించి కోటి ఆరు లక్షల 62 వేల 750 రూపాయలు విడుదల చేస్తూ పౌరసరఫరాల కమిషనర్‌ కొద్ది రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఒక్క ఫిబ్రవరి నెలలోనే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 19.92 లక్షల మంది రేషన్‌కు దూరమయ్యారు. ఈ పాస్‌లు పనిచేయక విసుగు చెంది కొందరు చౌకదుకాణాల ముఖం చూడటం మానేశారు. వేలిముద్రలు గుర్తించడం లేదని చాలా మంది వృద్ధులు రోజుల తరబడి నిరీక్షిస్తున్నా రేషన్‌ అందడం లేదు. ఇలాంటి వారికి వీఆర్‌వో సంతకంతో సరుకులు అందాలని ప్రభుత్వం ఆదేశిస్తున్నా ఆ విధంగా చర్యలు తీసుకోవడం లేదు. ఇలా మిగిలిస్తున్న రేషన్‌ సరుకులకు లెక్కాపత్రం లేనే లేదు. 

నగదు రహితమూ అందుకే.. 
నోట్ల రద్దు నేపథ్యంలో నగదు రహిత ప్రచారాన్ని భుజాలకెత్తుకున్న చంద్రబాబు ప్రభుత్వం మరో కోతల కుట్రకు వ్యూహాలు సిద్ధం చేసింది. అసలే గ్రామాల్లో సెల్‌ఫోన్లకు సిగ్నళ్లు లేక జనం అల్లాడుతుంటే చంద్రబాబు మాత్రం నగదు రహితం అంటూ పబ్లిసిటీ కోసం తాపత్రయ పడుతున్నాడు. గ్రామాల్లో బ్యాంకుల సేవలు అంతంతమాత్రంగానే ఉన్నాయని తెలిసినా మూర్ఖంగా జనాన్ని ముంచడానికి సిద్ధమయ్యాడు. గ్రామాల్లో ఎంతమందికి అకౌంట్‌లు ఉంటాయో తెలిసిన విషయమే. ఆ ఉన్నవారు కూడా బ్యాంకింగ్‌ సేవలను రుణాలను తీసుకోవడానికి తప్ప వినియోగించరన్నదీ అందరికీ తెలుసు. మరి అలాంటప్పుడు గ్రామీణ ప్రజలంతా మొబైల్‌ బ్యాంకింగ్‌ సేవలను వినియోగించాలని ఫత్వా జారీ చేశాడు. మామూలు ఫోన్లకే సిగ్నళ్లు లేని గ్రామాల్లో సెల్‌ఫోన్లు ఎంతమందికి అందుబాటులో ఉంటాయో తెలియనిది కాదు. 

దత్తత గ్రామాలకే అతీగతీ లేదు..
ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థను మెరుగు పరిచేందుకు ప్రత్యేకంగా ప్రభుత్వం 50 గ్రామాలను దత్తత తీసుకుంది. అక్కడా పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఆన్‌లైన్, మొబైల్‌ బ్యాంకింగ్‌లో అనేక సమస్యలను ఇప్పటికే గుర్తించారు. వీటిని పరిష్కరిరచకపోతే అమలు సాధ్యం కాదని వారు తేల్చి చెబుతున్నారు. అనేక గ్రామాల్లో బ్యాంకులే లేవు. బ్యాంకులున్నా జనానికి వాటిలో ఖాతాలు లేవు. అత్యవసరంగా జన్‌ధన్‌ ఖాతాలను ప్రారభించుకోవాలనుకున్నా అందుకు బ్యాంకర్ల నుంచి సహకారం లభించడం లేదు. ఇందుకు పశ్చిమగోదావరి జిల్లాలోని కె.అన్నవరం గ్రామం ఒక ఉదాహరణ. ఈ దత్తత గ్రామంలో 1500 వరకు కుటుంబాలున్నాయి. వాటిలో కేవలం 300 కుటుంబాలకు మాత్రమే బ్యాంకు ఖాతాలున్నాయి. ఖాతాలున్న వారికీ వారి ఆధార్‌ నంబర్లు ఆయా ఖాతాలకు అనుసంధానం కాలేదు. ఇవన్నీ సవ్యంగా ఉన్న చోట్లా ఆన్‌లైన్‌ లావాదేవీల నిర్వహణకు వీలుగా ఈ–పోస్‌ మిషన్లు దుకాణదారులందరూ ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు రావడం లేదు. ఈ మిషన్ల ధర ఎక్కువగా ఉండడం ఒక కారణమైతే, మిషన్ల వల్ల తమ ఆర్థిక లావాదేవీలు బహిర్గతమవుతాయనే ఆందోళన కూడా మరో కారణం. అంతేకాకుండా ఆన్‌లైన్‌ చెల్లింపులకు బ్యాంకులు వసూలు చేస్తున్న ట్యాక్సులకు కూడా భయపడి దుకాణదారులు ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికిప్పుడు తాత్కాలికంగా ట్యాక్సుల విషయంలో ఉపశమనం కలిగించినా సుధీర్ఘకాలం ఇలాగే ఉండే అవకాశం మాత్రం ఉండదనేది సుస్పష్టం. 

స్మార్ట్‌ ఫోన్లు లేవు.. ఇంటర్నెట్‌ రాదు 
ఆన్‌లైన్, మొబైల్‌ బ్యాంకింగ్‌ సేవలకు విధిగా స్మార్ట్‌ ఫోన్లు ఉండాలి. గ్రామీణ ప్రజల వద్ద ఇప్పటికీ మామూలు ఫోన్లే ఉంటున్నాయి. స్మార్ట్‌ ఫోన్‌ల ధరలు ఎక్కువగా ఉండటం ఒక కారణమైతే.. వాటిని వినియోగించడం ప్రజలకు తెలియకపోవడం మరో కారణం. స్మార్ట్‌ ఫోన్‌ ఉన్నా ఇంటర్నెట్‌ సమస్య ఉండనే ఉంది. పైగా ఆన్‌లైన్‌ లావాదేవీలన్నీ డబ్బుతో కూడుకున్నవి కావడంతో అకౌంట్‌ల నుంచి డబ్బు కట్‌ అయిపోతే పనులు మానుకుని బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. వేల కోట్లు అప్పులు తీసుకుని ఎగవేసే వారిని ప్రభుత్వాలు చూసీ చూడనట్టు వదిలేసి కష్టపడి సంపాదించిన డబ్బుతో అమ్మినా కొన్న వస్తువులపై ట్యాక్సుల భారం మోపి ఖజానా నింపుకోవాలనుకోవడం.. ఆధార్‌ను అనుసంధానం చేసి వాటితో ఆస్థులపై నిఘా వేయడం సిగ్గుమాలిన చర్యే.. కష్ట జీవులను అవమానించడమే అవుతుంది. 
Back to Top