ఆంధ్రలోనూ బాబుగారి కొనుగోళ్లు?

బలం లేకపోయినా స్థానిక కోటా ఎమ్మెల్సీకి పోటీ
ఆంధ్రారేవంత్లను రంగంలో దింపారా?
కండబలం, అర్ధబలంతోనే జడ్పీ ఎన్నికల్లో విజయాలు
కుంభకోణాల డబ్బుతో ఎమ్మెల్సీ స్థానాల కోసం యత్నాలు
 
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారం పూర్తికాగానే ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూలు వచ్చింది.  స్థానిక సంస్ధల ప్రతినిధులు ఎన్నుకునే ఎమ్మెల్సీల విషయంలో చంద్రబాబు వేగంగా పావులు కదుపుతున్నారు. తెలంగాణలో బలంలేకపోయినా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఎమ్మెల్సీ స్థానం దక్కించుకుందామని ప్రయత్నించిన తెలుగుదేశం నాయకులు కన్నంలో దొరికిపోయిన సంగతి తెల్సిందే. ఆ వ్యవహారంలో తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్రెడ్డి ఇప్పటికే ఊచలు లెక్కబెడుతున్నారు. నేడో రేపో చంద్రబాబునూ ఏసీబీ అధికారులు విచారణకు పిలవవచ్చని మీడియాలో కథనాలు వస్తున్నాయి. అసలు సూత్రధారి చంద్రబాబే అనేందుకు ఏసీబీ వద్ద తగినన్ని ఆధారాలు ఉన్నాయని తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఇప్పటికే స్పష్టంచేశారు. అయినా చంద్రబాబు తన నైజాన్ని వదులుకోవడానికి సిధ్ధంగా లేరు. తమ పార్టీకి మెజార్టీ లేని ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో స్థానిక సంస్థల ప్రతినిధుల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక కోసం అభ్యర్థిని నిలిపారు. అంటే తెలంగాణలో ప్రజా ప్రతినిధులను కోట్లు కుమ్మరించి కొనాలనుకున్నట్లే ఆంధ్రలో స్థానిక సంస్థల ప్రతినిధులను కొనాలనుకుంటున్నారా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
 
స్థానిక సంస్థల ప్రతినిధులు ఎన్నుకునే ఎమ్మెల్సీల విషయంలో ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో చంద్రబాబు నాయుడు తన అభ్యర్థుల్ని ఎందుకు నిలిపాడో సమాధానం చెప్పాలి. తెలుగుదేశం పార్టీకి మెజార్టీయే లేని జిల్లాల్లో ఏరకంగా, ఏ మార్గంలో గెలవదలుచుకున్నారో చెప్పాలి. ఎవరినైనా ప్రలోభపెట్టి మాత్రమే మీరు గెలవాలనుకున్నారని దీనిని బట్టి స్పష్టమౌతోంది. ఎంతమంది రేవంత్రెడ్డిలను రంగంలోకి దింపారో చెప్పండి.
 
ఈ రెండు జిల్లాల్లో స్థానిక సంస్థలకు వైయస్ఆర్సీపీ నుంచే అత్యధికంగా ఎంపీటీసీలుగానీ, జెడ్పీటీసీలు గానీ ఎన్నికయ్యారు. వైయస్ఆర్సీపీ బీ ఫార్మ్ మీద గెలిచిన స్థానిక సంస్థల అభ్యర్థులను...  రేవంతరెడ్డికి రూ. 5 కోట్లు ఇచ్చి పంపించి కొనుగోలుకు ప్రయత్నించినట్టుగానే ఆంధ్రప్రదేశ్లోనూ కొనుగోలు చేయడానికి సిద్ధపడబట్టే ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని నిలబెట్టారన్నది వాస్తవం కాదా?
 
మీ డబ్బు సంచులను చూసుకుని మాత్రమే, గొర్రెల మాదిరి కొనుగోలు చేయవచ్చు అన్న దురాలోచనతో మాత్రమే మీరు ప్రకాశం, కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని నిర్ణయించిన మాట నిజం కాదా?
 
ఇదే జిల్లాల్లో జెడ్పీ ఛైర్మన్ల ఎన్నిక సందర్భంలో ఓటు ఉన్నవారిని వేయకుండా అడ్డుకుని, ముళ్ళ కంచెలు కట్టి ఒకరకంగా పశుబలాన్ని ప్రదర్శించి, కొంత మందిని మీ డబ్బు మూటలతో కొనుగోలు చేసి, జిల్లాకి పది మంది రేవంత్ రెడ్డిలను పంపి గతంలో ఎన్నికలను మేనేజ్ చేసుకున్న విషయం నిజం కాదా?
 
ఏడాది కాలంలో ఎన్నో కుంభకోణాలకు పాల్పడ్డారు. పట్టిసీమలో ముడుపులు దండుకున్నారు... జీవో నెంబరు 22 ద్వారా జలయజ్ఞం కాంట్రాక్టర్ల నుంచి ఎస్కలేషన్ చార్జీల పెంపునకు అనుమతివ్వడం ద్వారా కమిషన్లు కొట్టేశారు. కొన్ని డిస్ట్రలరీలకు అనుమతించడం ద్వారా, సింగపూర్కు  పది వేల ఎకరాలు సంతర్పణ ద్వారా, గ్యాస్ బేస్డ్ విద్యుత్ కేంద్రాలకు వచ్చే రెండేళ్ళలో రూ. 2300 కోట్లు దోచి పెట్టడం ద్వారా, అంతర్జాతీయ మార్కెట్లో బొగ్గు ధరలు సగానికి సగం తగ్గినా తగ్గిన ధర  ప్రకారం కాకుండా భారీగా ఉన్న పాత ధరకు రెట్టింపు బొగ్గు కొనుగోలు చేయండి అని ప్రైవేట్ సంస్థలకు అనుమతులు ఇవ్వటం ద్వారా, గ్రామగ్రామాన ఇసుక మాఫియాను ప్రోత్సహించటం ద్వారా, బెరైటీస్లో మీ మైనింగ్ డాన్ల కమిషన్లను 30 నుంచి 35 శాతం వరకు ఉండేలా చూడటం ద్వారా... ఇలా రోజుకో కుంభకోణం ద్వారా మీరు ఇప్పటికే వేల కోట్లు మూటగట్టుకున్నది నిజం కాదా? పారిశ్రామికవేత్తలకు రూ. 2070 కోట్లు అడగకుండానే ఇవ్వటం ద్వారా అందులో 30 శాతం చిన బాబు కమిషన్ల రూపంలో వందల కోట్లు వెనకేసుకోవటం నిజం కాదా? ఇలా సంపాదించిన అవినీతి సొమ్ముతోనే చట్టసభల్లో ఎమ్మెల్సీలను గొర్రెలు కొన్నట్టు కొనాలని మీరు ప్రయత్నిస్తున్నారు. 
 
రాష్ట్రం కాని రాష్ట్రంలో 18 మంది ఎమ్మెల్యేలను రూ. 90 కోట్లు అవినీతి సొమ్ము పెట్టి కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన మీరు, ఇక ఏపీలో ఎన్ని వందల కోట్లు పెట్టి ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో ఓట్ల కొనుగోలుకు సిద్ధమయ్యారో ప్రజలకు బాగానే అర్థమౌతోంది. 
 
ఇవన్నీ చూస్తుంటే- చంద్రబాబు మనిషీ మారలేదు,  బుద్ధీ మారలేదు. ఆయన వైస్త్రాయ్ ఉదంతం  నాటి నుంచి నేటి వరకు ఈ సిగ్గు మాలిన రాజకీయాలే చేస్తున్నారని స్పష్టమౌతోంది. 
 
వైఎస్ఆర్ కాంగ్రెస్ రాజకీయాల్లో మార్పు కోసం, మంచి కోసం ప్రయత్నిస్తున్న పార్టీ. విలువలు గల రాజకీయాలను ప్రోత్సహించే పార్టీ.  కాబట్టే, మెజార్టీ లేని జిల్లాల్లో ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ పెట్టడం లేదు.  మెజార్టీ ఉన్న జిల్లాల్లో మాత్రమే పోటీ పెడుతున్నారు. స్థానిక సంస్థల అభ్యర్థుల్ని గొర్రెల్లా కొనుగోలు చేసే విధానానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పూర్తిగా వ్యతిరేకం. 
 
కృష్ణా, విశాఖ జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నికను వేర్వేరుగా జరపాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇది ఒక కుట్రపూరితమైన, అప్రజాస్వామిక వ్యవహారంగా భావించాలి. అందుకే ఆ నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ కోర్టుకు వెళ్లింది. రెండు స్థానాలకు ఒకే  బ్యాలెట్ మీద ఎన్నిక జరపాల్సిందిగా వైఎస్ఆర్కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఒకవేళ ఒకే స్థానానికి ఎన్నిక జరిగే పక్షంలో తమ అభ్యర్థిని నిలబెట్టబోమని పార్టీ స్పష్టం చేసింది.
 
Back to Top