బీఈడీల గోడు పట్టని బాబు!

నాడు హామీ ఇచ్చి నేడు మొండిచేయి
కేంద్రంపై ఒత్తిడికి ఎందుకు తాత్సారం...?
 
రైతులను, మహిళలను బూటకపు హామీలతో బురిడీ కొట్టించిన చంద్రబాబు నాయుడు యువతను కూడా అలానే మోసపుచ్చారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని, నిరుద్యోగులందరికీ నెలకు రు.2వేల చొప్పున భృతి కల్పిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఇపుడు ఆ ఊసే ఎత్తడం లేదు. ఉద్యోగమంటే ప్రభుత్వ ఉద్యోగమే కానక్కర లేదని కొందరు తెలుగుదేశం మంత్రులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఉద్యోగాలపై నిరుద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ వారి ఆశలను బాబుగారు వమ్ము చేశారు. చంద్రబాబు చేతిలో మోసపోయిన వారి జాబితాలో ఇపుడు బీఈడీ నిరుద్యోగులు కూడా చేరారు. డీఎస్సీ షెడ్యూలు ప్రకటిస్తూ ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులు అనర్హులుగా ప్రకటించారు. దాంతో బీఈడీ చేసిన అభ్యర్థుల ఆశలు నీరుగారిపోయాయి. నాడు హామీ ఇచ్చిన చంద్రబాబు నేడు మోసం చేశారంటూ బీఈడీ అభ్యర్థులు వాపోతున్నారు. ఒకవైపు డీఎస్సీ పరీక్ష తేదీలు దగ్గరపడుతున్నా చంద్రబాబు గానీ ఆయన మంత్రివర్గ సహచరులు గానీ తమ గోడు వినడం లేదని ఆవేదన చెందుతున్నారు. 
 
ఎన్నికల కోసమే బాబు గాలం..
జాతీయ వృత్తి విద్యా మండలి (ఎన్‌సీఈఆర్టీ) నిబంధనల మేరకు సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు బీఈడీ అభ్యర్థులు అర్హత కోల్పోయారు. అయితే బీఈడీ అభ్యర్థుల ఓట్లు కోసం చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో గాలం వేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే బీఈడీలకు ఎస్జీటీ పోస్టుల ఎంపికలో అర్హత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పొందుపరిచారు. ఉమ్మడి రాష్ర్టంలో సుమారు నాలుగు లక్షల మంది బీఈడీ నిరుద్యోగులు ఉండడంతో వారందరినీ ఓట్ల కోణంలో చూసిన చంద్రబాబు ఆ హామీ ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌లో ఎస్జీటీ పోస్టులకు పోటీ పడేందుకు తమకూ అవకాశం దక్కుతుందని ఆశతో ఎదురుచూసిన బీఈడీ పట్టభద్రులకు నిరాశ ఎదురయ్యింది. గత డీఎస్సీ మాదిరిగానే ఎస్జీటీ పోస్టులకు డీఎడ్ మాత్రమే అర్హులని తాజా షెడ్యూల్‌లో తేల్చిచెప్పారు. చంద్రబాబు నాయుడు మాట నమ్మిన బీఈడీ అభ్యర్థులు డీఎస్సీ కోసం అప్పులు చేసి వేల రూపాయలు ఫీజులు కట్టి శిక్షణ తీసుకున్నారు. 
 
కేంద్రాన్ని ఎందుకు ఒప్పించడంలేదు?
తెలుగుదేశం, బీజేపీ ఎన్నికల్లో కలసి పోటీ చేశాయి. కేంద్రంలో మంత్రిపదవులను కూడా తెలుగుదేశం అనుభవిస్తోంది. చంద్రబాబు నాయుడు తరచూ హస్తినకు పరుగులు తీస్తుంటారు. కేంద్ర మంత్రులను కలుస్తుంటారు. కేంద్రంలో తాను చక్రం తిప్పుతున్నాను అనే కలర్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే రాష్ర్ట ప్రజలకు మేలు చేసే ఒక్క పనిని కూడా ఆయన కేంద్రం చేత చేయించలేకపోయారు. తాను ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కనీసం ప్రయత్నించిన పాపాన పోవడం లేదు. బీఈడీ అభ్యర్థుల ఎస్జీటీ అర్హత విషయానికే వస్తే... ఆయన ఇప్పటి వరకు ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకురాలేదు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని గాలికొదిలేశారు.  పశ్చిమబెంగాల్ ఈ విషయంలో మనకన్నా మెరుగ్గా ఉంది. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అర్హులుగా గుర్తించేలా కేంద్రాన్ని వారు ఒప్పించగలిగారు. బెంగాల్ విషయంలో ఎన్‌సీఈఆర్‌టీ తన నిబంధనలను సడలించుకుంది. మరి ఆంధ్రప్రదేశ్‌కు ఇది ఎందుకు సాధ్యం కావడం లేదు?
 
మంత్రిగారి మాటలకు అర్థమేమిటో..?
ఎస్జీటీ పోస్టులకు తమను అర్హులుగా గుర్తించేలా కేంద్రాన్ని ఒప్పించాలని బీఈడీ అభ్యర్థులు అధికార పక్షానికి పదేపదే విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నారు. ఏప్రిల్ 28న వారు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావును కలవగా ఆయన ఏమన్నారంటే... ముఖ్యమంత్రితో తాను చర్చించానని, కేంద్రానికి లేఖ రాయమన్నారని, నెలాఖరులోగా తాను లేఖ రాస్తానని చెప్పారు.  మే 9,10,11 తేదీల్లో డీఎస్సీ పరీక్షలు జరుగుతుంటే మన ప్రభుత్వం ఇంకా లేఖ రాసే విషయాన్ని చర్చించే దశలోనే ఉన్నారు. ఒకవేళ కేంద్రం ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అర్హులుగా గుర్తించినా ఈ డీఎస్సీలో అమలు చేసే అవకాశం లేదు. కానీ మంత్రిగారు మాత్రం దానిపై అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెబుతున్నారు. ఇప్పటికే డీఎస్సీ పరీక్షకు అభ్యర్థులకు హాల్ టికెట్లు కూడా పంపిణీ అయిపోయాయి. పరీక్షలు వాయిదా వేసే అవకాశం లేదని మంత్రిగారే స్పష్టం చేస్తున్నారు. మరి ఇంకా బీఈడీ అభ్యర్థులను ఎందుకు మోసపుచ్చుతున్నట్లు?
 
కోర్టును ఆశ్రయించిన బీఈడీ అభ్యర్థులు
డీఎస్సీ, టెట్‌పై బీఈడీ విద్యార్థులు ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు మొరపెట్టుకోవడమే కాదు హైకోర్టును కూడా ఆశ్రయించారు. తెలుగుదేశం ప్రభుత్వం జారీ చేసిన జీఓ - 38ని సవాల్ చేస్తూ వారు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. జీవో - 38పై ప్రభుత్వాన్ని హైకోర్టు తప్పుపట్టిందని, జూన్ 3 వరకు డీఎస్సీ ఎంపిక జాబితాను ప్రకటించవద్దని హైకోర్టు సూచించిందని బీఈడీ అభ్యర్థులు అంటున్నారు. మన రాష్ర్టం కూడా బెంగాల్ మాదిరిగానే కేంద్రంపై ఒత్తిడి చేసి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలోని నాలుగున్నరలక్షల మంది బీఈడీ అభ్యర్థులకు దాని వల్ల మేలు జరుగుతుందని వారంటున్నారు. పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఆ తర్వాత తన హామీని గాలికొదిలేశారని విద్యార్థులు వాపోతున్నారు.
Back to Top