ఏపీ హైకోర్టు గురించి బాబు గుబులు ఇందుకేనా?


హైకోర్టు విభజన జరిగిపోతోంది. కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. సుప్రీం నుంచి సవ్యమైన మార్గదర్శకాలు కూడా వచ్చేసాయి. తెలంగాణా నుంచి అన్ని వ్యవస్థలూ విడిపడి ఏపీకి తరలిన నేపధ్యంలో కోర్టు మాత్రం ఉమ్మడిగానే ఇన్నేళ్లుగా కొనసాగుతోంది. ఓ పక్క తెలంగాణా న్యాయవాదులు కోర్టు విభజన జరగాల్సిందే అంటూ పట్టు పట్టారు. ఇక ఓటుకు నోటు దెబ్బకు 10ఏళ్ల ఉమ్మడి రాజధానిని ఉన్నపళంగా వదిలి కరకట్టకు చేరిన చంద్రబాబు ఆఘమేఘాలమీద అన్ని ప్రభుత్వ సంస్థలను ఏపీకి తరలించాడు. ఆ సమయంలో ఉద్యోగుల వెతలు వర్ణనాతీతం. ఉమ్మడి రాజధాని నుంచి ప్రశాంతంగా తరలాల్సిన సంస్థలు, ఉద్యోగులు బాబు వ్యవహారంతో పడరాని పాట్లు పడ్డారు. 
ఒంటి చేత్తో ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేసేస్తాను, హైదరాబ్ కు తాతలాంటి రాజధాని కట్టేస్తాను, 2018కల్లా రాజధాని నిర్మాణం దాదాపుగా పూర్తి చేసేస్తానూ అంటూ అరచేతిలో వైకుంఠం చూపారు మన ముఖ్యమంత్రిగారు. కానీ వాస్తవంలో ఒక్కటీ జరగలేదు. రాజధానిలో అన్ని నిర్మాణాలూ జరిగిపోతున్నాయని జనవరి కల్లా అన్ని పాలనా వ్యవస్థలూ అమరావతి నుంచే పనిచేస్తాయని బీరాలు పల్కిన బాబుకు అదే రీతిలో కేంద్రం షాక్ ఇచ్చింది. అన్నీ సిద్ధంగా ఉన్నాయని ముఖ్యమంత్రే ప్రకటించారు కనుక చెప్పిన ప్రకారమే జనవరి కల్లా హైకోర్టు ఆంధ్రప్రదేశ్ లో తన కార్యకలాపాలు ప్రారంభించాలని ఆదేశించారు. అబద్ధాలతో ప్రజలను మోసం చేసినట్టే, కేంద్రాన్నీ, అత్యున్నత న్యాయస్థానాన్ని కూడా నమ్మించాలనుకున్న బాబుకు ఇది ఎదురు దెబ్బ. జ్యుడిషియల్ భవనాల నిర్మాణం అంటూ చంద్రబాబు చెబుతున్న మాటలకు అక్కడ జరుగుతున్న నిర్మాణానికి పొంతనే లేదు. అమరావతిలో కోర్టు ప్రొసీడింగ్ రూమ్సు ఉన్నాయా అంటూ న్యాయాధికారులే ప్రశ్నించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈ విషయంపై ఎలాంటి పూర్తి సమాచారం లేకుండా జ్యుడిషియల్ భవనాల్లో తాత్కాలికంగా హైకోర్టు ఏర్పాటు అంటూ ఎల్లో మీడియా తూతూ మంత్రంగా వివరాలిస్తోంది. నిజంగా హైకోర్టు భవన సముదాయం నిర్మాణాన్ని పూర్తి చేసుకుని ఉంటే దానిపై ఎల్లో మీడియా పుంఖాను పుంఖాల వార్తలు, ప్రపంచ స్థాయి హైకోర్టు భవనాలంటూ ఫొటోలూ ప్రచురించేది. కానీ అలాంటిదేం జరగలేదు. 
ఒకపక్క హైకోర్టు భవనాల విషయంలో ఇలాంటి సందిగ్ధతే నెలకొని ఉండగా చంద్రబాబు తనలోని భయాన్ని మరోసారి బైటపెట్టారు. జగన్ కోసమే హైకోర్టును వేగంగా విభజించారంటూ వాఖ్యానించాడు. హైకోర్టును విభజించడం వల్ల జగన్ కు కలిగే లాభం ఏమిటి? చంద్రబాబుకు కలిగే నష్టం ఏమిటి? కేసులు ఎక్కడివైనా విచారణ కొంత జాప్యం జరగొచ్చు. అంతే తప్ప విచారణను హైకోర్టు విభజన ప్రభావితం చేస్తుందా? బాబు అలా ఆలోచిస్తున్నాడంటే దానివెనుక కీలకమైన కారణమే ఉండి ఉండాలి. ఉమ్మడి రాజధాని హైదారాబాద్ లోనే చంద్రబాబుకు ఓటుకు నోటు కేసు కీలకాలు, ఆధారాలన్నీ ముడిపడి ఉన్నాయి. చంద్రబాబు బ్రీఫింగ్ ఆడియోటేపు ఎంతో ముఖ్యమైన ఆధారంగా ఉండి కూడా ఈ కేసు కొన్ని రాజకీయ కారణాలతో ముందుకు కదలడం లేదు. ఈ విభజన ఆ కేసు కదలికకు కారణం అవుతుందా? లేక ఆ కేసు సత్వర విచారణకు నోచుకున్నప్పుడు హైకోర్టు విభజన వల్ల బాబుకు అక్కడ చుక్కెదురౌతుందా? ఈభయంతోనే హైకోర్టు విభజనను బాబు వ్యతిరేకిస్తున్నాడా? ఏపీ హైకోర్టు సత్వర ఏర్పాటు కోసం అంతా నేనై కష్టపడుతున్నాను అని చెప్పిన బాబు ఐదేళ్లలోపే విభజన జరిగితే సంతోషించక దాన్ని జగన్ కు అంటగట్టడం వెనుక ఉన్న రహస్యం ఏమిటో బాబు ఓటుకు కోట్లు కేసును స్టడీ చేసే న్యాయకోవిదులే చెప్పాలి. హైకోర్టు విభజనతో బాబులో మొదలైన గుబులుకు కారణమేమిటో బయటపెట్టాలి. 
 
Back to Top