బాబు బా...గా.... బిజీ!

కసాయి కత్తి కమండలం పట్టుకుని ఊరూరూ తిరిగిందట. అదేంటని అడిగితే ప్రపంచశాంతికోసం అని నినాదాలు చేసిందట. ఇప్పుడు చంద్రబాబు దేశ పర్యటన కూడా అలాగే ఉందంటున్నారు రాజకీయాలు దగ్గరగా చూసేవాళ్లు. విపక్షాలను కలుస్తూ, గంటలు గంటలు చర్చలు జరుపుతున్న బాబుగారు బయటొకొచ్చి ఇస్తున్న సందేశం ఏంటంటే... ''ఈ దేశాన్ని రక్షించాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. అందుకే నేను బిజెపికి వ్యతిరేకంగా అందరినీ ఒక్కతాటిపైకి తేవడానికి అహర్నిశలు శ్రమిస్తున్నా''అని. ఎంత విడ్డూరం, ఎంత అద్భుతం, ఎంత చోద్యం. ఆయనొక్కడికి తప్ప అందరికీ మెమరీ లాస్ అయితే ఈ విషయం వినడానికి ఎంత గొప్పగా ఉండేదో కదా! నాలుగున్నరేళ్ల క్రితం ఈ దేశాన్ని కాపాడ్డానికి ఎవరి అవసరముందని జతకట్టాడో, నిన్న మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉందని మట్టీ, నీరు ఇచ్చినా కళ్లకద్దుకుని చాటింపు వేయించాడో... వాళ్లపై ఇప్పుడు పోరాటమట. దానికి ఆయన శక్తి చాలక దేశమంతా తిరిగి పార్టీలను కూడగడుతున్నాడట.

రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య సంరక్షణ. చెప్పే మనిషి చంద్రబాబు కాకపోతే వినడానికి ఎంత బాగుండేవో కదా! కానీ తప్పదు... ఆయన నోటివెంటే వినాల్సిన ఖర్మ పట్టింది ప్రజలకు. తాను పాలిస్తున్న రాష్ట్రంలో ప్రతిపక్ష సభ్యుల్ని కొనుగోలు చేసి అసెంబ్లీలో తన పక్కన కూర్చోబెట్టుకుని, వారికి కేబినెట్ పదవులిచ్చి మరీ గౌరవించిన బాబు... దేశంలో ప్రజాస్వామ్యం గురించి పోరాడుతున్నారట. పార్టీ ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేసి ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఉన్నా... కోర్టులు ఆ నిర్ణాయాన్ని సభాపతికే వదిలేసినాసరే, కనీసం ఆవిషయం గురించి సభలో నోరు విప్పని ఈ ముఖ్యమంత్రి రాజ్యాంగాన్ని పరిరక్షించే పనిలో పడ్డారట. ఎంత నిస్సిగ్గు రాజకీయం. ఎంత అవకాశవాదం.

పెండింగ్ లో ఉన్న కేసులనుంచి, ఓటుకు కోటులో అడ్డంగా దొరికిపోయిన వ్యవహారం నుంచి, ఎపిలో బయటపడ్డ అవినీతినుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక దేశమంతా తిరుగుతూ దానికి ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ లాంటి పేర్లు తగిలించుకుంటున్నాడు బాబు అని లోకం కోడై కూస్తుంది. ఇవేమీ పట్టని నిప్పు బాబు మాత్రం ఒక్కో రాష్ట్రం తిరుగుతూ.. లోపల ఏం చర్చలు జరిగినా బయటకు వచ్చి దేశంకోసం కష్టపడుతున్నా, శ్రమిస్తున్నా అని ఒకటే రికార్డు ప్లే చేస్తున్నాడు.. వింటున్న జనం మాత్రం... బాబు బా...గా... బిజీ! అంటూ నవ్వుకుంటున్నారు.

Back to Top